Tuesday, November 11, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్మికుల బీమా..అంతా డ్రామా

కార్మికుల బీమా..అంతా డ్రామా

- Advertisement -

హెల్త్‌ టెస్టుల పేరిట భారీ మోసం
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిర్వీర్యానికి కుట్ర
ప్రయివేటు కంపెనీలకు సెస్‌ డబ్బు
కార్లూ.. బిల్డింగులకూ కార్మికుల సొమ్ము
దారిమళ్లిన సంక్షేమ నిధులు.. కష్టాల్లో కార్మికులు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వీరి సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేయటమే ఇందుకు కారణం. వీరి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డును సైతం పాలకులు నిర్వీర్యం చేస్తున్నారు. భవన నిర్మాణదారుల నుంచి పన్ను రూపంలో వసూలు చేస్తున్న ఒక్క శాతం (సెస్‌) నిధులను ప్రభుత్వం దారి మళ్లీస్తోంది. కార్మికులకు ఆరోగ్య బీమా అంటూ అంతా డ్రామా చేస్తోంది. తాడూ బొంగరం లేని ప్రయివేటు కంపెనీలకు సర్కారు సమర్పించుకుంటున్నది. కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన నిధులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీల ఖాతాలోకి మల్లుతున్నాయి. అంతస్తుల కొద్ది, అందమైన భవంతులు కడుతున్న ఆ కార్మికుల బతుకు దుర్భరంగా తయారవుతున్నది.

బోర్డు నిర్వీర్యానికి కుట్ర
నిబంధనల ప్రకారం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను వారి కోసమే ఖర్చు చేయాలి. బోర్డులో రూ. కోట్ల నిధులున్నా కార్మికుల సంక్షేమానికి వినియోగించటం లేదు. ఆ నిధులను గుర్తింపు లేని ప్రయివేటు బీమా కంపెనీలకు సుమారు రూ.346 కోట్లు ప్రభుత్వం కట్టబెట్టింది. ఆ డబ్బును తిరిగి సంక్షేమ నిధిలో జమచేయాలని కార్మికులు ఎన్ని సార్లు కోరినా.. ప్రభుత్వానికి చెవికెక్కటం లేదు. ఇది 1996 కేంద్ర చట్టం నిబంధనలను ధిక్కరించటం కాక మరేమిటి? కార్మికుల పట్ల, నాడు యూపీఏ ప్రభుత్వం చేసిన చట్టం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సానుకూలత ఉన్నా..కేంద్ర చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోదు? అని కార్మిక సంఘాలు నిలదీస్తున్నాయి. అయినా ప్రభుత్వానికి చలనం లేదు. బోర్డు నిర్వీర్యానికి గురికాకుండా కాపాడాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది.

దీనిపై కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.డబ్బు దారి మళ్లించేందుకే..జీవో 12 చేసేది మోసమైనా..చట్టబద్దంగా చేయాలని ప్రభుత్వం భావించినట్టుంది. అందుకే కార్మికుల సొమ్మును చట్టబద్దంగానే దారిమళ్లించింది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణాలకు రూ.10 లక్షలు, సహజ మరణాలకు రూ.2 లక్షలకు పెంచి, శాశ్వత, పాక్షిక అంగవైకల్యం తదితర నాలుగు సంక్షేమ పథకాలను ప్రయివేట్‌ ఇన్యూరెన్స్‌ కంపెనీల ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీఓ, నెం.12ను 2025 జూలై 22న విడుదల చేసింది. జీఓ విడుదల చేసిన రెండు రోజులకే (ప్రయివేట్‌ బీమా కంపెనీలైన క్రెడిట్‌ యాక్సిస్‌ లైఫ్‌ ఇన్యూరెన్స్‌ కంపెనీకి రూ.250 కోట్లు, ఎర్గో జనరల్‌ ఇన్యూరెన్స్‌ కంపెనీకి రూ.90 కోట్లు, ట్రెయిల్‌ ప్లాజర్‌ అనే బ్రోకర్‌ సంస్థ ద్వారా మొత్తం రూ.346 కోట్లు ప్రయివేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ప్రభుత్వ అధికారులు బదిలీ చేశారు. కేంద్ర చట్టం, రాష్ట్ర వెల్ఫేర్‌ బోర్డు నిబంధనలకు ఇది విరుద్ధం.

అటకెక్కిన అడ్వజరీ కమిటీ
అడ్వజరీ కమిటీ అటకెక్కింది. ప్రభుత్వానికి అనుకూలమైన సభ్యులను ఆ కమిటీలో నియమించుకుని కార్మికుల ప్రయోజనాలను తుంగలో తొక్కటం ఆ కమిటీ రివాజుగా మారింది. 1996 భవన నిర్మాణ కార్మిక కేంద్ర చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్ర వెల్ఫేర్‌ బోర్డు అడ్వజరీ కమిటీని నియమించాలి. ఆ కమిటీ నిర్ణయం ప్రకారమే బోర్డు నిధులు ఖర్చు చేయాలి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు తమకు ఇష్టమొచ్చినట్టుగా నిధులను ఇతర శాఖలకు దారి మళ్ళిస్తున్నాయి. కార్మిశాఖ అధికారుల వాహనాలు, వారు వాడే ఖరీదైన ఫోన్లు, కొత్తగా నిర్మిస్తున్న కార్మిక శాఖ భవనాలకు కార్మికుల సంక్షేమ నిధిని వినియోగించటం విడ్డూరంగా ఉంది.

పనికి రాని హెల్త్‌ టెస్టులు
ఆరోగ్య పరీక్షల పేరుతో కార్మికులకు ప్రయివేటు బీమా కంపెనీలు కుచ్చుటోపి పెడుతున్నాయి. సీఎస్సీ హెల్త్‌ టెస్టుల పేరుతో ప్రభుత్వం సుమారు రూ.500 కోట్లు దుర్వినియోగం చేసింది. కార్మికులకు అవసరం లేకున్నా హెల్త్‌ టెస్ట్లు చేయించుకోకపోతే లేబర్‌ కార్డులు తొలగిస్తామని బెదిరిస్తూ పరీక్షలు చేస్తున్నారు. 33 జిల్లాల్లో ఏడు కేంద్రాలను ఎంపిక చేసుకుని ఏడు మంది ల్యాబ్‌ మేనేజర్లను పెట్టి టెస్ట్లులు చేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 నుండి 150 మందికి టెస్ట్లులు చేస్తున్నారు. ఒక కార్మికునికి పరీక్ష చేస్తే సీఎస్సీ సంస్థకు రూ.3,250లు బోర్డు చెల్లిస్తున్నది. రోజువారీగా ఏడు సెంటర్లలో సుమారు వెయ్యి మందికి టెస్ట్‌లు చేస్తున్నారు. టెస్ట్‌ చేసిన ఎంప్లాయికి సీఎస్సీ సంస్థ రూ.90 చొప్పున ఇస్తున్నది.

ఒక నెలకు 30వేల మందికి, ఏడాదికి 3.60లక్షల మందికి టెస్ట్లు చేస్తున్నారు. ఈ లెక్కన వెల్ఫేర్‌ బోర్డు నుండి సుమారు రూ.600 కోట్లు టెస్టుల పేర దుబారా చేశారు. ఈ పరీక్షల వల్ల కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఏ ప్రభుత్వ హాస్పిటళ్లలోనైనా ఆరోగ్య పరీక్ష చేస్తారు. ఈ సంస్థ టెస్టు మాత్రమే చేసి డాక్టర్‌ను సంప్రదించండి అని ఉచిత సలహా ఇస్తున్నది. కావాల్సిన మందులు, వాటికయ్యే ఖర్చులు కార్మికులే భరించాలి. అయితే ఈ పరీక్షల రిజెల్ట్‌ కూడా సక్రమంగా రావటం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న జబ్బులు లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎస్సీ హెల్త్‌ టెస్టులను రద్దు చేసి కార్మికులందరికీ హెల్త్‌ కార్డులివ్వాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -