నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయబోమని తీర్మానం చేయాలి : సీఐటీయూ నల్లగొండ జిల్లా మహాసభలో రాష్ట్ర కోశాధికారి రాములు
ఉత్సాహభరితంగా మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలోని కార్మికుల సమస్యలు అసెంబ్లీలో చర్చించాలని, ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కారానికి కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ అమలు చేయబోమని తీర్మానం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండజిల్లా కేంద్రంలోని పెద్ద బండ ఎఫ్‌సీఐ ఫంక్షన్ హాల్‌లో పెన్న అనంతరామ శర్మనగర్, వైఆర్‌కె.రెడ్డి ప్రాంగణంలో నిర్వహించిన సీఐటీయూ నల్గొండ జిల్లా 13వ మహాసభలకు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్, ఎండి సలీం, వి.భూలక్ష్మి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్‌లు అమలు చేయబోమని కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఇప్పటికే తీర్మానం చేసిందని, తెలంగాణ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని అన్నారు.
రాష్ట్రంలో 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ కనీస వేతనాలు సవరించకుండా కాలయాపన చేయడం వల్ల సుమారు కోటి మంది కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 జనవరిలో డ్రాఫ్ట్లు ఇచ్చి పెండింగ్‌లో పెట్టిందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్‌కు పిఆర్పీ గడువు ముగిసి 2 సంవత్సరాలు గడిచినా వేతన సవరణ చేయలేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వారి సర్వీసులు క్రమబద్దీకరించాలని కోరారు.కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్కీం వర్కర్స్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకెపి వివోఏ, ఫీల్డ్ అసిస్టెంట్స్, నేషనల్ హెల్త్ మిషన్, మిషన్ భగీరథ తదితర ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రజలు ఆందోళనలో జీవిస్తున్నారని చెప్పారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మూడు సంవత్సరాలుగా జరిగిన కార్యక్రమాలను నివేదిక ప్రవేశపెట్టగా 33 మండలాల నుండి చర్చల్లో పాల్గొని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ నెల 16 నుండి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కార్మికులకు రావాల్సిన వాటా కోసం జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభ ప్రారంభానికి ముందు జిల్లా అధ్యక్షులు చిన్నపాటి లక్ష్మీనారాయణ సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు హాజరై కార్మిక పోరాటాలకు రైతాంగం సంపూర్ణ మద్దతు తెలిపారు.



