సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు
నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రంలోని పలు గ్రామాలలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ చారికి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులకు నాలుగు నెలల పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బోనాల పండుగ, వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పనిభారం పెరిగినా, వేతనాలు అందకపోయినా పనిచేశారన్నారు. ప్రభుత్వం మల్టి పర్పస్ విధానాన్ని రద్దుచేయాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇన్స్యూరెన్స్ సౌకర్యం , ఇ ఎస్ ఐ, పి ఎఫ్ కల్పించాలని, పెండింగ్ లో ఉన్న వేతనాల బకాయిలను చెల్లించాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 28 లోపు వేతనాలు విడుదల చేయని పక్షంలో 29 న ,మండలం లో కార్మికులను సమీకరించి ధర్నా కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి బాలస్వామి,గ్రామ పంచాయితీ కార్మిక యూనియన్ మండల కార్యదర్శి గెల్వయ్య, ఉపాధ్యక్షులు వెంకటేష్, లక్ష్మయ్య సహాయ కార్యదర్శి రవి, లక్ష్మయ్య, కవిత ,కృష్ణ, రామకోటి తదితరులు పాల్గొన్నారు.