Wednesday, March 25, 2026
E-PAPER
Homeకరీంనగర్కార్మికులు ఆత్మహత్యల బాట పట్టకుండా ఆర్థిక వెసులుబాటు కల్పించాలి

కార్మికులు ఆత్మహత్యల బాట పట్టకుండా ఆర్థిక వెసులుబాటు కల్పించాలి

- Advertisement -

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చుట్టుముట్టిన విద్యుత్ సంక్షోభం నుంచి నేతన్నలను కాపాడాలని కోరుతూ మాజీ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ను, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పవర్‌లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు, సర్‌చార్జిల భారంపై ఆయనకు సమగ్రమైన వినతి పత్రాన్ని అందజేసి, వాటిని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రిని కలిసి ఒక లేఖను అందజేశారు.
సిరిసిల్ల పట్టణం రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు గుండెకాయ వంటిదని, గతంలో ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన చేదు జ్ఞాపకాలను కేటీఆర్ ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్.పి. వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న ‘బ్యాక్ బిల్లింగ్’ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆయన వివరించారు.

రూ. 38 కోట్ల విద్యుత్ భారం రద్దు చేయాలి
2016 నుండి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్.ఎస్.ఐ (SSI) యూనిట్లపై అధికారులు రూ. 19 కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని, అది సర్‌చార్జిలతో కలిపి ఇప్పుడు రూ. 38 కోట్లకు చేరిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతో పాటు, ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి నేతన్నను అదుకోవాలన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను, కార్మికుల ఉపాధిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కేటీఆర్ కోరారు.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్, సర్‌చార్జి మొత్తాలను పూర్తిగా మాఫీ చేయాలనీ, పాత బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలు ఇవ్వాలనీ, కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలనీ అన్నారు.
సిరిసిల్ల నేతన్నల సమస్య కేవలం ఒక ప్రాంతానిది కాదని, అది వేలాది కుటుంబాల మనుగడకు సంబంధించినదని కేటీఆర్ గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి  సానుకూలంగా స్పందించి, త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.కెటిఅర్ తో ఏంఏల్సీ ఎల్ రమణ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -