Sunday, February 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి

కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి

- Advertisement -

ప్రీ-బడ్జెట్‌ సమీక్షా సమావేశంలో మంత్రి వివేక్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాబోయే ఆర్థిక సంవత్సరానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, అమల్లో ఉన్న పథకాలను సక్రమంగా అమలు చేయటంతో పాటు సేవా వ్యవస్థను పటిష్టంగా మార్చాలని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉన్నతాధికారులతో ప్రీ-బడ్జెట్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక వ్యయం, అమల్లో ఉన్న పథకాలు, బడ్జెట్‌ కేటాయింపులు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి అవసరమైన నిధుల వివరాలపై ఆయన సమీక్షించారు. కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీల) ద్వారా యువతకు నాణ్యమైన శిక్షణ అందించటం, ఐటీఐల్లో ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ అందించడం, ఈఎస్‌ఐసీ పరిధిలో ఉన్న బీమాదారులకు మెరుగైన వైద్య సేవలు అందించడం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని చెప్పారు. ఈఎస్‌ఐసీ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులపై కచ్చితంగా ఫాలోఅప్‌ చేయాలనీ, బడ్జెట్‌ అవసరాలు వ్యయ అంచనాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సేవల మెరుగుదలే శాఖల ముఖ్య లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. నిధుల కొరత కారణంగా ఏ పథకం గానీ, బీమాదారులకు అందించే సేవలు గానీ నిలిచిపోకూడదని మంత్రి స్పష్టంచేశారు. అవసరమైన నిధుల వివరాలను ముందుగానే తెలియజేయాలనీ, తాను ఆర్థిక శాఖ మంత్రి, సీఎంతో సమన్వయం చేసి నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. టామ్‌కామ్‌ ద్వారా విదేశీ ఉపాధి, నియామకాల పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. విదేశీ ఉపాధి అవకాశాలు లక్ష్యానుసారం అమలు కావాలని సూచించారు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల పనితీరు, బడ్జెట్‌ వినియోగం, శిక్షణ పొందిన యువత సంఖ్య, ప్లేస్‌మెంట్‌ గణాంకాలపై పూర్తి స్థాయి విశ్లేషణ చేయాలని ఉపాది, శిక్షణ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్‌, ఉపాధి, శిక్షణ విభాగం డైరెక్టర్‌ కాంతి వెస్లీ, ఫ్యాక్టరీల డైరెక్టర్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -