పలుచోట్ల స్వచ్ఛందంగా షాపుల మూసివేత
రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, సభలు
వివిధ కంపెనీల ఎదుట ధర్నాలు
సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
నవతెలంగాణ-విలేకరులు
రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతమయింది. రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించి, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు, వీబీజీఆర్‌ఏఎమ్‌జీ పథకం, వ్యవసాయాన్ని కార్పొరేటీకరించడం.. తదితర కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వివిధ ఫెడరేషన్లు గురువారం సమ్మెను విజయ వంతం చేశాయి. ర్యాలీలు, సభలు నిర్వహించారు. పలుచోట్ల వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. మున్సిపల్ కార్మికులు తెల్లవారుజాము నుండే సమ్మెలోకి వెళ్లారు. రైల్వే స్టేషన్ వద్ద, మిర్చి యార్డుల వద్ద హమాలీలు ధర్నా చేపట్టారు. బీడీ కార్మికులు, అంగన్‌వాడీలు, కంపెనీల ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, కూఈలు, ఆశావర్కర్లు, ప్రజలు బంద్‌లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు, హమాలీలు, స్కీమ్ వర్కర్లు తమ విధులు పక్కన పెట్టి భాగస్వాములయ్యారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు, కేవీపీఎస్, వివిధ ప్రజాసంఘాలు ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తింది.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమ వద్ద సార్వత్రిక సమ్మెను పురస్కరించుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. శివంపేట గ్రామ శివారులోని సీబీఎల్ పరిశ్రమ నుంచి సంగారెడ్డిలోని కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పలు ప్రభుత్వ, ప్రయి వేట్ వ్యాపార సముదాయాలు స్వచ్ఛందం మూసి వేశారు. ఖమ్మంలో అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పలు ప్రభుత్వ శాఖల్లో మధ్యాహ్న సమయంలో నిరసన తెలిపారు. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 5, 6 దశల్లో ఉద్యోగ కార్మికులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. విద్యుత్ సవరణ చట్టం-2025ను నిరసిస్తూ మణుగూరు తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో బీటీపీఎస్‌లో ధర్నా నిర్వహించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, మానవహారాలు నిర్వ హించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పీఎఫ్ ఆఫీస్ రోడ్డులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్‌వీ రమ పాల్గొన్నారు. రైస్ మిల్లులు, హరిత బయో ప్రొడక్ట్స్ కంపెనీ వర్కర్లు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం సమ్మెతో స్తంభించిపోయింది. సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్, ఎన్టీపీసీ కార్మికులు విధులను బహిష్కరించారు. జగిత్యాలలో విద్యుత్ శాఖ ఉద్యోగులు విద్యుత్ భవన్‌లో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ వాటర్ సెక్షన్, ప్రభుత్వ ఆస్పత్రి, సివిల్ సప్లయ్ గోదాముల ముందు కార్మికులు నిరసనలు, ధర్నాలు నిర్వహించారు.
హనుమకొండ జిల్లా ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో ప్రదర్శన చేపట్టారు. వరంగల్‌లో రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక రైల్వేఎల్‌ఐసి బ్యాంక్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. నల్లగొండలో సుభాష్ విగ్రహం దగ్గర నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు కార్మికులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ నుండి కొత్త బస్టాండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆటోనగర్‌లో వరుణ్ మోటార్స్, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మహేంద్ర మోటార్స్, ఎస్‌ఆర్‌ఎంటి, ఐచర్, టీసీఐ, ఐలా తదితర సంస్థలతో పాటు హమాలీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. చర్లపల్లిలో సమ్మెలో భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
స్తంభించిన బొగ్గు ఉత్పత్తి
రామగుండం సింగరేణిలో ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బొగ్గు బావుల వద్ద సింగరేణి పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు ఒక్క తాటి మీద వచ్చి సమ్మెలో పాల్గొన్నారు. మణుగూరు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. రోజువారీగా బొగ్గు ఉత్పత్తి 35 వేల నుంచి 40 వేల టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా సమ్మె కారణంగా బొగ్గు పెల్లా కూడా పెగలలేదు. పీకే ఓసీ 2, ఓసీ 4, కొండాపురం అండర్ గ్రౌండ్, మణుగూరు ఓసీల్లో కార్మికుల హాజరు శాతం పూర్తిగా తగ్గింది. బొగ్గు ఉత్పత్తి గనులే కాక కేసీహెచ్‌పీ, జీఎం ఆఫీస్, ఎస్‌అండ్‌పీసీ, ఏరియా హాస్పిటల్, ఓసీ స్టోర్స్, ఏడబ్ల్యూఎస్‌లలో 8 శాతం సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. రుద్రంపూర్ ఓసీ, ఓబీ, మెయిన్ వర్క్‌షాప్, ఆర్‌సీహెచ్‌పీ, ఏరియా జీఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. భూపాలపల్లి ఏరియాలో కార్మికులు లేక గనులన్నీ వెలవెలబోయాయి. అత్యవసర సిబ్బంది తప్ప విధులకు కార్మికులు ఎవరు హాజరు కాలేదు.




