నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలపట్ల కార్మిక వర్గ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జెండాను ఆవిష్కరించిన అనంతరం రాములు మాట్లాడుతూ 36 ఏండ్ల సరళీకృత ఆర్థిక విధానాల అమలు నేపథ్యంలో కార్మికవర్గం తీవ్ర శ్రమ దోపిడీకి గురవుతోందని చెప్పారు. సంపద కొద్దిమంది పెట్టుబడిదారుల వద్ద పోగుపడుతోందని వివరించారు. ఆర్థిక అంతరాలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. దీని దుష్ప్రభావాలు కార్మికవర్గం భరించాల్సి వస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో గనులు, భూములు, సహజ వనరులను విదేశీ, స్వదేశీ గుత్త సంస్థలకు కట్టబెడుతున్నదని తెలిపారు. మరోవైపు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు, ఉత్పత్తి సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వల్ల ఉత్పత్తి , సేవా రంగాల్లో గణనీయ మార్పులు సంభవిస్తున్నాయనీ, అంతిమంగా సంఘటిత ఉద్యోగులతో సహా యావత్ కార్మికవర్గం భద్రత లేని ఉపాధికి పరిమితం కావాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికవర్గంలో పెరుగుతున్న అసంతృప్తిని పక్కదోవ పట్టించడానికి హిందుత్వ భావజాలాన్ని ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ శక్తులు ముఖ్యంగా కార్మికవర్గంలో వైషమ్యాలు పెంచి పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడుతున్నాయని చెప్పారు. లౌకిక, ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ అమెరికా ప్రోత్సాహంతో ఇరాన్‌పై ఇజ్రాయిల్ సాగిస్తున్న యుద్ధం వల్ల ప్రపంచ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారనీ, కార్మికవర్గం మరిన్ని భారాలను మోయాల్సిస్తోందని విమర్శించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సీఐటీయూ నాయకత్వం సైద్ధాంతికంగా పరిణితి సాధించడం ద్వారా కార్మికవర్గాన్ని చైతన్యవంతం చేయడానికి దోహదపడుతోందని చెప్పారు. శిక్షణా తరగతులకు సీఐటీయూ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ఎంపిక చేసిన కార్యకర్తలు హాజరయ్యారు.
ఏప్రిల్ 5 వరకు జరగనున్న మూడు రోజుల క్లాసులకు ప్రిన్సిపాల్‌గా చుక్క రాములు వ్యవహరించగా తొలి రోజు ట్రేడ్ యూనియన్ పని పద్ధతులు పాఠ్యాంశాన్ని రాష్ట్ర ఉపాద్యక్షులు ఎస్. వీరయ్య బోధించారు.
కార్మికవర్గ చైతన్యాన్ని పెంచుకోవాలి:చుక్క రాములు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



