– ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం : మంత్రి పొన్నం ప్రభాకర్
– శనిగరం చెరువులో రొయ్య పిల్లల విడుదల
నవతెలంగాణ-కోహెడ
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం చెరువులో బుధవారం మత్స్య అభివృద్ధి, స్టేట్ సెక్టార్ పథకంలో భాగంగా వంద శాతం రాయితీపై రొయ్య పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్య సంపద ప్రకృతి ద్వారా లభించే విలువైన సంపద అని, చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. నియోజకవర్గంలోని 166 చెరువులకుగాను 38 లక్షల 92 వేల చేప పిల్లలు విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందించగా, ఇప్పటి వరకు 26 చెరువుల్లో 26 లక్షల 69 వేల 860 చేప పిల్లలను విడుదల చేసినట్టు తెలిపారు. ఇందుకు రూ.46.08 లక్షలు అయిందన్నారు. శనిగరం రిజర్వాయర్‌లో 9.87 లక్షల చేప పిల్లలను విడుదల చేయగా ప్రభుత్వం రూ.17.04 లక్షలు ఖర్చు చేసిందన్నారు. రాజీవ్ రహదారి ప్రధాన రోడ్డుపై ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, స్థల సేకరణ పూర్తయ్యాక మార్కెట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కరీంనగర్, గోదావరిఖని తదితర ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ వెళ్లే సమయంలో ఇక్కడ చేపలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. మత్స్య సంపదతో ముదిరాజ్, గంగపుత్రులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అందరికీ భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కేడం లింగమూర్తి, ఏఎంసీ చైర్మెన్ నిర్మల జయరాజ్, శనిగరం సర్పంచ్ లింగంపల్లి లక్ష్మీనారాయణ, మత్స్య సహకార సంఘాల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మత్స్యకారుల అభివృద్ధికి కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



