– నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం కలెక్టర్ అధ్యక్షతన నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ ప్రతినిధులు పాల్గొని, జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల రవాణా, వినియోగం పెను సవాలుగా మారిందని అన్నారు.
యువత, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న మత్తు పదార్థాలు రవాణా, వినియోగం జరుగకుండా అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగాల బాధ్యత అని భావించకుండా సమాజంలోని వివిధ వర్గాల వారందరూ మాదకద్రవ్యాల నిరోధానికి తమవంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, వినియోగం, వాటితో ముడిపడిన కార్యకలాపాలను గమనిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. టోల్ ఫ్రీ నెంబర్ 14446 కు కాల్ చేసి కూడా సమాచారం తెలుపవచ్చని సూచించారు. సమాజానికి పెను ప్రమాదకరంగా మారిన మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
మాదకద్రవ్యాల వినియోగంతో దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృతస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రహారీ క్లబ్ లను ఏర్పాటు చేయడమే కాకుండా, అవి సమర్ధవంతంగా పని చేసేలా చూడాలన్నారు. గర్భిణీలు కల్తీ కల్లు సేవించకుండా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా నషా ముక్త్ భారత్ అభియాన్ ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సామూహిక ప్రతిజ్ఞ కోసం రూపొందించిన క్యూ.ఆర్ కోడ్ ను లాంచ్ చేసారు. నషా ముక్త్ భారత్ అభియాన్ లో బాగంగా మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా మాస్ ప్రతిజ్ఞ ఆన్లైన్ లో చేయడానికి https://nmba.dosje.gov.in/content/take-a-pledge?type=e-pledge లింక్ లేదా QR కోడ్ ద్వారా స్కాన్ చేసి వివరాలు నమోదు చేసి సర్టిఫికెట్ పొందాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిణి రసూల్ బీ, జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.



