Sunday, March 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసంక్షేమ హాస్టళ్ల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

సంక్షేమ హాస్టళ్ల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

- Advertisement -

ప్రీ బడ్జెట్‌ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సంక్షేమ వసతి గహాల కోసం నిర్మిస్తున్న భవనాల్లో 80 శాతం పూర్తయిన వాటిని యుద్ద ప్రాతిపదికన రాబోయే మూడు నెలల్లో పూర్తిచేసి, రానున్న విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయా సంక్షేమ శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలను సమీక్షించారు. తదుపరి వైద్య, ఆరోగ్యశాఖ, దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకొకసారి క్రమం తప్పకుండా ఆర్థిక శాఖకు వచ్చే విధంగా ఒక సీనియర్‌ అధికారిని నియమించి బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఈ వేసవిలో వసతి గృహాల మరమ్మత్తు కార్యక్రమాన్ని పూర్తి చేయాలనీ, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తెలిపారు. వసతి గృహాల అద్దెలు, ఎలక్ట్రికల్‌ బిల్లులు, కాస్మోటిక్‌ చార్జీలు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలు ప్రతినెలా చెల్లిస్తామనీ, అధికారులు సకాలంలో ఆర్థిక శాఖకు బిల్లులు పంపాలని సూచించారు. గత ప్రభుత్వ కాలంలో ఈ బిల్లులు ఏడు నెల్లకోసారి చెల్లించేవారని గుర్తు చేశారు. వసతి గృహాలకు సరఫరా చేస్తున్న మెటీరియల్‌ క్వాలిటీ చెక్‌ కోసం ఒక నిర్దిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని నిరంతరం సమీక్షించాలని చెప్పారు. డైట్‌ చార్జీలు 40 శాతం పెంచాం, కాస్మోటిక్‌ చార్జీలు 200 శాతం పెంచాం, సంక్షేమ వసతి గృహాలకు సంబంధించిన బిల్లులను మొదటి ప్రాధాన్యతగా గుర్తించి చెల్లిస్తున్నామని తెలిపారు.

ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు నిత్యం వసతి గృహాలను సందర్శించి స్థానికంగా జరుగుతున్న బోధన, భోజనంలో నాణ్యత, వసతి గృహాల్లో సదుపాయాలను పరిశీలించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రపంచం మొత్తం ఆయుర్వేదం వైపు చూస్తున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా మెడిసినల్‌ ప్లాంట్లు పెంచేందుకు ఆయుష్‌ శాఖ ఏర్పాట్లు చేసుకోవాలనీ, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ సమావేశంలో డిప్యూటీ సీఎం సూచించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మెడిసినల్‌ ప్లాంట్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక ప్రజలు అడవిని కాపాడుకుంటారని అటవీశాఖ అధికారులకు సూచించారు. పర్యాటక రంగం విస్తరిస్తే స్థానిక ప్రజలకు ఉపాధితో పాటు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. కాలుష్య కారకాలు, వాటిని నియంత్రించకపోతే వచ్చే ప్రమాదాలు అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న దేవాలయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని దేవాదాయ శాఖ సమావేశం లో డిప్యూటీ సీఎం సూచించారు. సమావేశాల్లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఉన్నతాధికారులు సభ్య సాచి గోష్‌, కృష్ణ ఆదిత్య, క్రిస్టినా, సువర్ణ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -