నవతెలంగాణ – ఆర్మూర్
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంత నాగ్ జిల్లాలోని కొకర్ నాగ్ తహసిల్ హాన్ గుల్ గుండ్ గ్రామంలోని విద్యార్థులకు అంగన్వాడి కేంద్రంలో “సూపర్ బ్రెయిన్ యోగా” అనే అంశంపై జిల్లాకు చెందిన గుంజీళ్ళ అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు ఆదివారం కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో గుంజీళ్ళ మాస్టారు అందె జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంతేకాకుండా యోగా ద్వారా మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. మన దేశంలో పాఠశాలలో గుంజీళ్లను ఉతక్ బైఠక్ , ముర్గా అనే పేర్లతో తీయించేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన భారత ఉప ఖండానికి మాత్రమే పరిమితమైన గుంజీళ్లు సూపర్ బ్రెయిన్ యోగా అనే పేరుతో విశ్వవ్యాప్తమైందన్నారు.
సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీళ్ళ మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను విద్యార్థులకు వివరించారు. సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ద, సమస్య పరిష్కారం, అభ్యసనం, గుర్తుంచుకోవడం, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, మానసిక సమతుల్యత మొదలైనవి పెంపొంది సమస్యలు మరియు ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందని వివరించారు. యోగా ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో సూపర్ బ్రెయిన్ యోగా వలన విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. కావునా గుంజీళ్లు తీయడాన్ని “శిక్షగా కాకుండా శిక్షణ” గా పరిగణించాలని అన్నారు.
బహుళ ప్రయోజనాలు ఉన్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాలలో శిక్షణలో భాగంగానే పరిగణించి అమలు చేయడం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహద పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. డాక్టర్ రఫియా హసన్ అందె జీవన్ రావు వివరించిన అంశాలను కాశ్మీరీ భాషలో తర్జుమా చేసి విద్యార్థులకు తమదైన సులభ శైలిలో అరటిపండు ఒలచి పెట్టిన చందంగా వివరించారని పేర్కొన్నారు. విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో ఆసక్తిగా చూసి విని ఆనందించారు. తలపెట్టిన కార్యం ఆసాంతం విజయవంతమై, సర్వత్రా హర్షద్వానాలు మిన్నంటాయి.



