నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో రూ. 1,500 కోట్ల మేర అవినీతి
ఛండీగడ్ : బీజేపీ పాలిత హర్యానాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖ నిర్వహణలో నడిచే భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఈ కుంభకోణం జరిగింది. నకిలీ వర్క్ స్లిప్స్ (వర్క్ రిసీప్ట్స్)తో రూ. 1,500 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది. ముందుగా ప్రాథమిక తనిఖీల్లో హిసార్, కైథల్, జింద్, సిర్సా, ఫరిదాబాద్, భివానీ జిల్లాల్లో భారీ ఎత్తున ఈ అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. దీంతో అన్ని జిల్లాల్లోనూ జిల్లా స్థాయి కమిటీలతో తనిఖీలకు డిప్యూటీ కమిషనర్లు ఆదేశించారు. ముఖ్యంగా 2023 ఆగస్టు నుంచి 2025 మార్చి వరకూ ఆన్‌లైన్‌లో జారీ చేసిన అన్ని వర్క్ స్లిప్స్‌ను భౌతికంగా తనిఖీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హర్యానాలో మొత్తం 22 జిల్లాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ 13 జిల్లాలో ప్రాధమిక తనిఖీలు పూర్తయ్యాయి.
కర్నాల్, రేవారి, నౌ (మీరట్), మహేంద్రగడ్, గురుగ్రామ్, ఝజ్జర్, పల్వాల్, పానిపట్, రోహ్తక్, సోనిపట్, పంచకుల, సిర్సా, కైథల్ జిల్లాలో ఇవి పూర్తయ్యాయి. ఈ జిల్లాల్లో గత రెండేళ్లలో మొత్తం 5,99,758 వర్క్ రిసీప్ట్స్ జారీ అయ్యాయి. అయితే వీటిలో కేవలం 53,249 మాత్రమే సరైనవిగా గుర్తించారు. 5,46,509ను ఇన్‌వ్యాలీడ్‌గా ప్రకటించారు. అలాగే ఈ జిల్లాల్లో ఈ బోర్డులో 2,21,517 మంది గుర్తింపు పొందిన కార్మికులు ఉన్నారు. అయితే వీరిలో 14,240 మంది మాత్రమే నిజమైన కార్మికులు ఉన్నారని అధికారులు నిర్థారించారు. 1,93,756 మంది గుర్తింపులు నకిలీగా గుర్తించారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో హర్యానాలోని బిజెపి ప్రభుత్వంపై భవన నిర్మాణ రంగానికి చెందిన కార్మిక నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సిఐటియు అనుబంధ సంఘమైన భవన-నిర్మాణ కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుఖ్‌బీర్ సింగ్, రాష్ట్ర అధ్యక్షులు మనోజ్ సోని మాట్లాడుతూ 90 రోజుల ధ్రువీకరణ కాలంలో ఈ మోసం జరిగిందని కార్మిక మంత్రి అనిల్ విజ్ వాదనను తీవ్రంగా ఖండించారు.
2014 నుంచి 2018 వరకూ మధ్యకాలంలో అప్పటి కార్మిక మంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ నేతృత్వంలో ప్రభుత్వం నిర్వహించిన క్యాంపుల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లలో ఈ అక్రమాలు జరిగాయని కార్మిక నాయకులు విమర్శిస్తున్నారు. అలాగే, 2018 బిజెపి ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ వ్యవస్థ కూడా దోపీడికి ఆస్కారం కల్పించిందని నాయకులు తెలిపారు. అలాగే, కార్మికులను లక్ష్యంగా చేసుకోవడాన్ని విమర్శించారు. కార్మికులను నకిలీలుగా ముద్రవేసి పరీక్షలకు గురిచేయడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి వాటికి బదులుగా బీజేపీ ప్రభుత్వం తన పరిపాలన విధానాలను, ముఖ్యంగా కార్మికులపై ధ్రువీకరణ అధికారాన్ని ఎవరికీ అప్పగించామో పరిశీలించుకోవాలని, దర్యాప్తు చేయాలని నాయకులు సూచించారు. ప్రస్తుతం హర్యానా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు జాతీయ ఉపాధి హామీ, బీపీఎల్ రేషన్‌కార్డులు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటి పథకాల్లో కార్మికులను నకిలీలుగా ముద్రవేసి వివిధ పరీక్షలు, పరిశీలనలు చేస్తున్నాయని నాయకులు విమర్శించారు. కార్మికుల హక్కులపై దాడులను సహించమని హెచ్చరించారు. ఈ నెల 17, 18 తేదీల్లో మంత్రుల నివాసాల వద్ధ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
హర్యానాలో వర్క్‌స్లిప్ కుంభకోణం
- Advertisement -
- Advertisement -



