నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలపై ఇండియన్ పైటర్ జెట్స్ దాడి చేశాయి. ఈ పోరులో ఉగ్రమూకల శిబిరాలు ధ్వంసంకాగా, 100మందికిగా కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత రెండు దేశాలు నాలుగు రోజులపాటు ప్రతిదాడులు చేసుకొని..నాటకీయ పరిణామల మధ్య పాక్ కాళ్లబేరానికి వచ్చింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఉద్రిక్తతలకు తెరపడింది. అప్పట్నుంచి రెండు దేశాల మధ్య పలు రకాల దౌత్య సంబంధాలు, వ్యాపార లావాదేవీలతో పాటు ఆదేశంతో ఎలాంటి క్రీడలు ఆడేది లేదని భారత్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజాగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్‌లో ఆడేందుకు విముఖత చూపడమే కారణమంటూ డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరూ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వద్దకు రావొద్దని సూచించారు. టికెట్ సొమ్మును మొత్తం రీఫండ్ చేస్తామని స్పష్టం చేశారు. తాను పాక్‌తో ఆడనని మే 11నే చెప్పానని శిఖర్ ధావన్ పోస్టు చేసిన కొద్దిసేపటికే డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
‘‘ఈ లీగ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదని మే 11నే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నాకు నా దేశమే ముఖ్యం. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు. జై హింద్’’ అని మెయిల్ స్క్రీన్‌షాట్‌ను ఎక్స్ వేదికగా ధావన్ పోస్టు చేశాడు. యువరాజ్ సింగ్ నాయకత్వంలో టీమ్‌ఇండియా ఛాంపియన్స్ టోర్నీ బరిలోకి దిగింది. తొలి మ్యాచ్ పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో కావడం గమనార్హం.