Magazines

నేను అడ్డుకోవడం వల్లే ఇజ్రాయెల్‌ మనుగడలో ఉంది: ట్రంప్‌

1 గంట క్రితం

Israel survives because I prevent it: Trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ అణ్వాయుధం తయారు చేయకుండా తాను అడ్డుకోవడం వల్లే ఇజ్రాయెల్‌, పశ్చిమాసియా దేశాలు మనుగడలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం తన సోషల్‌ మీడియా వేదిక ‘ట్రూత్‌ సోషల్‌’లో పోస్టు చేశారు. ఇరాన్‌ను అడ్డుకోకపోయి ఉంటే ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా ఉనికే ఉండేది కాదని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌ తన అణు కార్యక్రమంపై కొత్త ప్రతిపాదనను అమెరికాకు అందించిన నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులు చేయాలా? వద్దా? అనే అంశంపై అమెరికా ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో జాతీయ భద్రతా బృందంతో సమావేశాలు జరుగుతున్నాయని సీనియర్‌ అధికారులు వెల్లడించారు. ఇరాన్‌ మొత్తం దేశాన్ని నాశనం చేయడం తనకు ఇష్టం లేదని, కానీ అవసరమైతే ఆ నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చని ట్రంప్‌ గతంలో వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, ఇరాన్‌ అణు, సైనిక కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు చేయగా, ప్రతిగా ఇరాన్‌ ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ ప్రాంతాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. మరోవైపు ఇజ్రాయెల్‌కు ఏటా అందిస్తున్న 3.8 బిలియన్‌ డాలర్ల సైనిక సహాయాన్ని 2026 చివరి నాటికి నిలిపివేయనున్నట్లు ట్రంప్‌ ప్రకటించడం కూడా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌పై ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్