మాస్కోతో స్నేహం కోసం వెంపర్లాట
రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ వ్యూహాలు ఉన్నాయంటున్న విశ్లేషకులు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల క్రితం శ్వేతసౌధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక ప్రతినిధి కిరిల్ దిమిట్రేవ్తో రహస్య సమావేశం నిర్వహించారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా త్వరలోనే ఓ గొప్ప శాంతి ఒప్పందం కుదరబోతోందని సమావేశం అనంతరం ఆయన తెలిపారు. అయితే ఈ భేటీకి సంబంధించిన ఆంతరంగిక వివరాలను ట్రంప్ అధికారికంగా వెల్లడించనప్పటికీ అమెరికా ప్రతినిధి బృందం, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ చర్చల పరిధిని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందం కేవలం ఉక్రెయిన్ సరిహద్దులకే పరిమితం కాకుండా మొత్తం యూరప్ ఖండం భద్రతా స్వరూపాన్నే మార్చబోతోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే రష్యాతో చర్చల కోసం ట్రంప్ ఈ స్థాయిలో చొరవ తీసుకోవడం వెనుక స్పష్టమైన రాజకీయ, అంతర్జాతీయ, ఆర్థిక వ్యూహాలు దాగి ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తాను అధికారంలోకి వస్తే రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని అతి తక్కువ సమయంలోనే ముగిస్తానని అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ చెప్పారు. అయితే అది ఇప్పటికీ నెరవేరలేదు. గతంలో తాను ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవడానికి ట్రంప్ ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
రష్యా - చైనా స్నేహబంధాన్ని దెబ్బతీయాలన్నది ట్రంప్ ఆలోచన. రష్యాతో సంబంధాలను పునరుద్ధరించుకోవడం ద్వారా ప్రపంచ వేదికపై రష్యా - చైనా కూటమి మరింత బలోపేతం కాకుండా అడ్డుకోవడమే అమెరికా దీర్ఘకాలిక భౌగోళిక వ్యూహం. రష్యాతో సన్నిహిత సంబంధాలు నెరపుకోవడం వెనుక ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రష్యా నుంచి అమెరికాకు మూడు లక్షల టన్నుల డీజిల్ సరఫరా నిమిత్తం ట్రంప్ గత నెలలో పుతిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అమెరికాలో ఇంధన ధరలను తగ్గించి, దేశీయంగా ఆర్థిక వ్యవస్థను ఒడిదుడుకుల నుంచి దూరం చేయడం ఈ సత్సంబంధాల వెనుక ఉన్న తక్షణ ఉద్దేశం. నాటో, యూరోపియన్ యూనియన్ దేశాల ప్రమేయాన్ని పరిమితం చేస్తూ అమెరికా నేతృ త్వంలోనే చారిత్రక ఒప్పందాన్ని కుదర్చడం ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద రాయబారిగా తన ఇమేజ్ను చాటుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.







కామెంట్లు (0)