Sunday, July 20, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకిచిడీలో పురుగులు

కిచిడీలో పురుగులు

- Advertisement -

ఆకలితోనే తరగతులకు విద్యార్థులు హాజరు
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఘటన
విచారణకు ఆదేశించిన పీవో
బాధ్యులను వెంటనే సస్పెండ్‌ చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ-భద్రాచలం

ఐటీడీఏకు కూతవేటు దూరంలో పట్టణానికి నడిబొడ్డున ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అమానుషం చోటుచేసుకుంది. విద్యార్థినులకు అల్పాహారంగా అందించే కిచిడీలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. దాంతో 600 మంది విద్యార్థినులు ఆకలితోనే క్లాసులకు హాజరయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శనివారం జరిగింది. ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలం పట్టణంలో గిరిజన ఆశ్రమ పాఠశాల ఉంది. అక్కడ సుమారు 650 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. మూడ్రోజుల నుంచి అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలు, వార్డెన్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. శనివారం అల్పాహారం అందించేందుకు 80 కేజీల కిచిడీ సిద్ధం చేయగా.. అందులో పురుగులు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కిచిడీ తినలేమని ఆకలితోనే తరగతులకు హాజరయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి ఉన్న ప్రధాన కేంద్రంలోనే ఈ ఘటన జరగటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రిన్సిపాల్‌ పద్మావతిని వివరణ కోరగా.. కిచిడీలో పురుగులు ఉన్న మాట వాస్తవమేనని, జీసీసీ నుంచి వచ్చిన బియ్యంలోనే పురుగులు రావడంతో అలా జరిగిందని తెలిపారు. పురుగులు ఉన్న బియ్యాన్ని వెనక్కి పంపిస్తున్నామని చెప్పారు. గతంలో ఇదే ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థిని సీనియర్ల వేధింపులు, పాఠశాలలో వసతులపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే.

విచారణకు ఐటీడీఏ పీఓ ఆదేశం
కిచిడీలో పురుగులు వచ్చిన ఘటనపై విచారణకు ఆదేశించామని, ఆర్‌సీఓని విచారణ అధికారిగా నియమించామని, పూర్తి నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ స్పష్టం చేశారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యను అందించేందుకు ఐటీడీఏ రాజీ లేకుండా పని చేస్తోందని తెలిపారు. విద్యార్థులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు.

గోదాంకి పురుగులు పట్టిన బియ్యం తరలింపు
ఆశ్రమ పాఠశాల విషయం సామాజిక మాధ్యమాలలో ప్రచారం కావడంతో జీసీసీ అధికారులు అప్రమత్తమై రహస్యంగా పాఠశాలలోని పురుగులు పట్టిన బియ్యాన్ని గోదాంకి తరలించారు. ఈ ఘటనపై డీసీసీ అధికారులు.. మే నెలలో ఇచ్చిన పాత స్టాక్‌ని ఆశ్రమ పాఠశాల అధికారులు పరిశీలించి విద్యార్థులకు వండించాలని, అలా పరిశీలించనందునే అన్నంలో పురుగులు వచ్చాయని చెబుతున్నారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.రవీందర్‌
విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఎఫ్‌ఐ బృందం ఆశ్రమ పాఠశాలకు వెళ్లి సందర్శించిందని, ఘటనపై ప్రిన్సిపాల్‌ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్‌ విమర్శించారు. ప్రిన్సిపాల్‌, వార్డెన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -