‘ఆశలు మొలచి గూడు నిలవాలంటే ఒక జీవితమే పెట్టాలే. వికాసమో? విషాదమో అర్థమయ్యే లోపల భవిష్యత్తు కరిమింగిన వెలగపండులా కరిగిపోవచ్చు. తలె అమ్ముకొని చెప్పులు కొన్నట్లు కావొచ్చు. ఆఖరికి చిప్ప చేతికి రావొచ్చు. రాకపోతే మంచిదే? వస్తే…? బతుకే చింత – చితి మధ్య పోరాటం.’ అని నిశిరాత్రి రెప్పమూయకుండా నర్సయ్య ఆలోచనలు కునుకుపాట్ల నడుమ జాగారం చేస్తున్నాయి.
”ఏహే పండుకోక పోయినవు? ఎంతసేపు మేల్కొంటవు?” తెల్లవారు జామున గోనవ్వ నర్సయ్యను మందలించింది.
”నిద్రపోలే తియ్యే” అని జవాబిచ్చాడు.
”నిద్రపొమ్మనే సెప్పుతున్న. ఇల్లు కోసం ఆలోచిస్తన్నవా? ఎట్లయితే గట్లయితది. మనసు కుదార్తమైతే బతుకు యదార్తమైతది. అవునుగని కొడుకును జీవితకాలం కష్టపెడుదామా? నువ్వు చెప్పే” అని ప్రేమతో భర్తను అడుగుతూనే ఉంది.
”ఇగో! నీకు పానం బాగలేదు. ఇల్లు కట్టుడంటే ఉట్టిగనే అయితదా?”
”కాదే. నా ఆరోగ్యం నాకు తెలవదా? ఇయ్యాల్ల ఇంట్ల. రేపు మంట్లే. నా కోసంగాదు. నీకోసంగాదు. ఇంత యెవుసం చేస్తే ఉండ ఇల్లులేదాయే? పండ మంచంలేదాయే. కిందికో మీదికో సంసారం ఎల్లదీస్తిమి. మనలెక్క వాల్లుండల్నా? సోచాయించు. కొడుక్కోసం ఆలోసించు. ఇల్లు కోసం ఉన్నది అమ్ము. పిల్లలే సంపాదన. చల్లగ బతికితే సాలు అంటివి. తర్వాత వాడే కొనుక్కొంటడు. ఊళ్లో ఇల్లు కూలిపోయింది. అక్కడా కట్టలేం. ఆకురాలినట్లు పుటుక్కున నేను రాలిపోతే ఎట్లా? కొడుక్కు నీడ దొరుకుతదా? కిరాయి ఇండ్లలో శవాన్ని వేయనిస్తరా?? సచ్చి మిమ్మల్ని చంపాల్నా? చెప్పేచెప్పు?”అని రాలిపోయే పువ్వు రాగాలు తీసినట్లు ప్రేమతో ప్రశ్నలై గుచ్చుతుంది.
జవాబు చెప్పలేని నరసయ్య నీళ్లు నములుతున్నడు. నరసయ్యకు భూమి అంటే పిచ్చి. ‘భూమి కడుపు చూసే కన్నతల్లి. ఆలాంటి భూమిని అమ్మాలా?’ అని మనసులో మధనపడుతున్నాడు.
పట్టుపట్టింది. మాటకు, మూటకు కరగని నర్సయ్య మనసు కరిగింది. జాగ అమ్ముడుపోయింది.
గోనవ్వ కోరికగా కడుతున్న ఇల్లే జాడపడ్డది. తక్కువ ధర అనగానే హుషారు పడికొన్నరు.
బంధుమిత్రుల మధ్య గహప్రవేశం ఘనంగా జరిగింది. సంబరం అంబరాన్ని తాకింది. రమణ అత్తగారు అతనికి, అతని తల్లిదండ్రులకు ఒడిబియ్యం పోసారు. గోనవ్వ మనస్సు దూదిపింజలా తేలుతున్న సంతోష సమయంలో రమణ భార్యతో తల్లిదండ్రుల కాళ్లకు సాష్టాంగపడి మొక్కారు.
గోనవ్వ, నర్సయ్య కళ్లు చెమర్చాయి. లేపి బొంగురుగొంతుతో ”బిడ్డా! మీ సంతోషమే మా సంతోషంరా అయ్య” అనుకుంటూ మనవడిని మనవరాలిని వణుకుతున్న చేతులతో దగ్గరికి తీసుకొని కన్నీరు కార్చింది.
”పచ్చని పందిట్లో ఏడుపు ఎందుకే అక్కా!” అని గద్దించిన కనకవ్వ మాటకు కట్టుబడ్డది. తన్నుకొస్తున్న దు:ఖాన్ని లోలోన అదిమిపట్టింది.
మామిడి తోరణాలు ఎండి గడియారంలోని లోలకంలా గాలికి ఊగుతున్నాయి. పండుగకు కళకళలాడిన ఇల్లు పండుగ తర్వాత సుట్టాలు వెల్లిపోవడంతో పరిగె ఏరిన సేనులా ఉంది.
రమణ అరకొర వసతుల వసతి గహాల్లో చదివాడు. ప్రైవేటుగా నౌకరి చేస్తున్నాడు. తల్లి అనారోగ్యం గుర్తొస్తేనే మనసు కల్లోలమైతుంది. కన్నీరైతుంది.
ఇంట్లోకి వచ్చి మూడు నెలలు గడవక ముందే… కూల్చివేత పిడుగు పడ్డది.
”అందుకే తక్కువ ధరకొచ్చిందా? కూల్చేస్తారా? కూల్చకుండా ఎవరిని కలుద్దాం సార్? ఎట్లసార్?” అనే మాటలు తరుచుగా ఫోన్‌లో గోనవ్వ పదేపదే వింటుంది. కొడుకులో మార్పును, అలజడిని గమనిస్తుంది.
గతరాత్రి గోనవ్వను పరామర్శించడానికి వచ్చిన గంగ కూల్చేస్తమంటున్నారనే వార్తను వలపోసుక చెప్పింది. గోనవ్వ మనసుకు మంటలుపోట్ల సలపరం మొదలైంది. కుమిలిపోతుంది. తన్ను సంబాలించుకుంటుంది. మనుసు బట్టల ముల్లెగట్టిన నిప్పురవ్వతీరు మండుతూనే ఉంది.
ఉదయం టీ తాగుతూ పేపర్ చదవడం రమణకు అలవాటు. టీతో న్యూస్ పేపర్‌లోని హెడ్‌లైన్స్‌ని చప్పరిస్తున్నాడు. చాయి చేదుగా తగిలింది. రమ్య పిల్లలను లేపింది. రోజూలాగే తాతా మనవళ్లు బ్రష్ చేస్తున్నారు.
టీవీ లోసౌండ్‌లో కూల్చబడిన కన్వెన్షెన్ మట్టిపెళ్లల మధ్య నిలబడి కీచుపిట్టలా ఒక ముప్పయ్యేళ్ల అమ్మాయి విల్లులా కనుబొమ్మల్ని ఎగురేస్తూ, మెరుస్తున్న లిప్స్టిక్ పెదాలను మెలికలు తిప్పుతూ, మధ్యమధ్యలో జుట్టుని సవరిస్తూ, అశోకుడు కలువపూవును పట్టుకున్నట్లు మౌత్‌పీసును పట్టుకొని శిథిలాలను జూమ్‌చేసి చూపిస్తూ ”అక్రమార్కులకు హడల్, ఎవరికైనా ఇదే గతి పడుతుందా? ఈ నీతి అందరికీ వర్తిస్తుందా?” అంటూ వసపిట్టోలే తెలుగింగ్లీష్‌లో నసపెడుతుంది. ఆమె మాట్లాడేది పొగుడుతుందో, తెగుడుతుందో అర్థం కాకుండా ఉంది.
అటు టీవీలో, ఇటు న్యూస్ పేపర్‌లో ఒకటే వార్త. ఆ వార్త మూడు దఫాలుగా ఇచ్చే ప్రమాద హెచ్చిరికలను ఒకేసారి జారీ చేసినట్లనిపించింది రమణకు.
”బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిని ఆక్రమిస్తే ఇదేగతి. మా నెక్స్ట్ టార్గెట్ నల్లచెరువు ప్రాంతం.” అని కళ్లద్దాల ఫ్రేమ్స్ మెరుస్తుండగా ఒగ పెద్దాఫీసరు యుద్ధమే అంటున్నాడు.
”యుద్ధమంటే, ఎలా ముందుకు వెళ్తారు సార్? నోటీస్‌లు ఇస్తారా?” -జర్నలిస్టు.
”నో నోటీస్. నో ఇంటిమేషన్. ఓన్లీ బుల్డోజ్” అని అధికారం గర్వం ప్రకటించింది.
‘ఉరిశిక్షపడ్డ ఖైదీని ఆఖరికోరిక ఏమిటో అడుగుతారు. అంతకంటే హీనమా? అదీ అడగరా? కూల్చితే ఎలా? నల్లచెరువు మాదే! ఎక్కడ కూల్చుతారు? ఎవరివి కూల్చుస్తారు? అందిరివా? కొందరివా?’ అని రమణ పిల్లిపట్టిన కోడిలా అపసోపాలు పడుతున్నాడు.
గోనవ్వ గట్టిగా కేకేసిన శబ్ధం హాల్లో ఉన్న రమణను దాటి కిచెన్‌లో పనిచేస్తున్న రమ్యకు వినిపించింది.
”అత్తమ్మ పిలుస్తుందండీ! రండి” అని హెచ్చరిస్తూ రన్నింగ్ రేసులా అత్తమ్మను చేరుకుంది.
తాగుతున్న టీ కప్పు పక్కనపెట్టి, రమణ అతని భార్య రమ్య గోనవ్వను క్షణాల్లో గోనవ్వను చేరుకున్నారు.
గోనవ్వ రమణ తల్లి. క్యాన్సర్ పేషెంట్. ఐదు సంవత్సరాలుగా అంపశయ్యపై భీష్మునిలా చావలేక ఆయాసపడుతూ బెడ్‌కే పరిమితమైంది. నర్సయ్య, కొడుకు, కోడలు గోనవ్వను కనుపాపలా కాపాడుతున్నారు. ఆ రోగం బోన్స్‌కి కూడా వ్యాపించిందని కిందటి వారం డాక్టరు వివరించాడు. నిలబడలేని గోనవ్వ లేచి నిలబడదామనుకొని ప్రయత్నిస్తూ తూలి కిందపడిపోయింది. ఈమె ఎముకలు పెళుసుగా మారాయి అని డాక్టర్ చెప్పిన సూచనలు రమ్యకు లీలగా గుర్తొస్తున్నాయి.
”దెబ్బతాకిందా అత్తమ్మా? ఒక్క పిలుపుకే వచ్చేదాన్ని కదా! అయ్యయ్యో! ” అని ఒళ్లంతా పుణికి చూస్తూ ఓదార్చింది. అనుకున్నట్లే పాదం ఉబ్బింది. తలకు దెబ్బ తగిలింది. ముట్టుకుంటే తల్లడిస్తుంది. రమణ చేరుకొన్నాడు.
”అమ్మా! దెబ్బతాకిందా?” అంటూ పసిపిల్లాడిలా తల్లినిచేరి, బుజ్జగిస్తూ నీళ్లు నిండిన కళ్లతో అడుగుతున్నాడు.
ఊపిరి ఆయాసంగా తీస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా మాటల్లో స్పష్టతలేదు. సరిగ్గా చూస్తలేదు. కాలువాసింది. మడమ కీళ్లు ఉబ్బి ప్యాక్చర్ పోలికలు కనపడుతున్నాయి.
”బావా! ఏడువకే. చిన్నపిల్లాడిలా ఏడిస్తే ఎలా? ఏడిస్తే సమస్య పరిష్కారమైతదా? వొద్దొద్దు. ఏడువొద్దు. త్వరగా ఫోన్‌చెయ్యి” అని రమ్య బతిమాలింది.
బయట బ్రష్ చేసుకుంటున్న నర్సయ్య అనుమానంతో లోపలికి వచ్చిండు.
”అయ్యో! శంకరా ఎంతపనైపాయేరా నాయనా! అందుబాటులో అందరం ఉన్నంకదా! ఎందుకే ఇట్లా చేస్తవు?” అంటూ నర్సయ్య మాట్లాడిస్తున్నాడు. గోనవ్వలో ఉలుకూలేదు. పలుకూలేదు. ఏంగోసరా తండ్రీ” అనుకుంటూ నెత్తికొట్టుకుంటున్నాడు.
”బాధపడకు మామయ్య. అత్తమ్మ బావుంటుంద”ని రమ్య ఓదార్చింది.
”బావా! అంబులెన్స్‌కి ఫోన్‌చెయ్యి.” అని మరొకసారి గుర్తు చేసింది రమ్య.
రమణ ఫోన్ కలిపి అన్ని విషయాలు వివరించాడు.
హాస్పిటల్ పాతచిట్టీలు, ఎక్స్‌రే ఫిల్ములు, దుప్పటి, వాటర్ బాటిల్ మొదలైన సరంజామా సర్దుకుని, పక్కింటి వారికి పిల్లలను అప్పగించి రమ్య రడీగా ఉంది.
గాలిమేఘంలా దూసుకొచ్చిన అంబులెన్స్ లక్ష్యాన్ని చేరుకున్న కత్రిమ ఉపగ్రహములా ఇంటి ముందాగింది.
యుద్ధప్రాతిపదికన గోనవ్వను అంబులెన్సులో ఎక్కించుకొన్నారు. రమ్య, రమణ, నర్సయ్య అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి వెళుతుండగా గోనవ్వ స్పహ తప్పిపోయింది. హాస్పిటల్ చేరగానే ఎమర్జెన్సీ చికిత్స అందిస్తున్నారు.
”టెస్టులు చూస్తూ మీ అమ్మగారికి బ్రైయిన్‌డెడ్ అయ్యింది. చివరి ప్రయత్నంగా ఎక్స్‌మో చికిత్సచేస్తే నయంకావొచ్చు. హండ్రెడ్ పర్సంట్ చెప్పలేం. మీ అదృష్టం ఆలోచించండి.” అని డాక్టర్ వద్దన్నట్లే చెప్పినా ఆశల్ని నింపాడు.
రమ్య రమణలు చికిత్సకు ఒప్పుకున్నారు. చికిత్స ప్రారంభమైంది.
రమ్యతల్లిగారు కూడా ఆ నల్లచెరువు అవతలి ప్రాంతంలో ఉంటారు. వాళును పిల్లల్ని తీసుకోమని ఫోన్ చేసి చెప్పాడు రమణ. తన అక్కాచెల్లెళ్లకు ఫోన్‌చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని చెప్పాడు. రెక్కలు కట్టుకొని బంధు మిత్రులందరూ హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు. పిల్లల వద్దకు రమ్య తల్లిదండ్రులు వెళ్తున్నారు.
జాగ అమ్మగా వచ్చిన మరిన్ని డబ్బులతో ఇంటి అప్పు తీర్చాలనుకున్నాడు కానీ అమ్మచికిత్సకు ఆన్‌లైన్ ద్వారా హాస్పిటల్కు ట్రాన్స్ఫర్ చేశాడు రమణ.
యముడు పంపగా వచ్చిన రాక్షసుల్లా నల్లచెరువు పరిసర ప్రాంతాల్లోకి జెసీబీలు, హిటాచీలు జడల దయ్యంలా భయంకరంగా నిలుచున్నాయి.
”ఇది బఫర్ జోన్. ఫుల్ ట్యాంకు లేవల్లో కట్టబడిన కాలనీ. ఇళ్లలో ఉన్నవారందరూ బయటకు రావాలి. పై అంతస్తులో ఉన్నవారు త్వరగా దిగాలి.” అని ఒక మైక్ అదేపనిగా హెచ్చరిస్తుంది.
కనికరంలేని చట్టం కత్తిదూసింది. ఇండ్లలో దూరి వద్ధుల్ని, మహిళల్ని, దీర్ఘకాలిక రోగుల్ని చూడకుండా బలవంతంగా బయటకు తీసుకొస్తుంది.
”అక్రమం ఏదైనా చట్టం దష్టిలో నేరం. ఆలోచించొద్దు. సహకరించండి.” అని హెచ్చరికలు జారీ అవుతూనే ఉన్నాయి.
అయోమయంలో ప్రజలు, కుటుంబాలు, పిల్లలు. గుంపులు గుంపులుగా రోడ్డుమీదికి వచ్చి రోదిస్తున్నారు. వద్దని కాళ్లు మొక్కుతున్నారు. లబలబ మొత్తుకుంటున్నారు. మరోగుంపు నినాదాలతో నిరసిస్తున్నారు. ఎవరో చెప్పగానే నినాదాలు ఆగాయి. మనసు పదన కనబడ్తదా? బతుకు రోడ్డుమీద పడ్డదా? రోడ్డే బతుకులోకి సోచ్చిందా? అర్థంకాని స్థితిలో ఆ కాలనీవాసులు హాహాకారాలు అరణ్య రోదనలవుతున్నాయి.
”చాలా ఏళ్లుగా నివసిస్తున్నా”మని అధికారులను మర్యాదపూర్వకంగా చేతులు జోడించిన ఒక చోటా లీడర్‌తో కలసి అడుగుతున్నారు.
”హలో! మర్యాద, మర్యాద. నేరం నేరమే. నేరానికి శిక్ష ఉండదా? వెళ్తావా? వెళ్ళవా? వెళ్లాల్సిందే. మాట్లాడొద్దు. దయచేసి సహకరించండి.” అని ఆరడుగుల ఒక అధికారం కరుకుగా దబాయిస్తుంది.
”మా జీవితాలు నాశనం అవుతున్నాయి సార్. విసిగించొద్దంటే ఎట్లా? వినండి సార్. మాకు గడువు ఇవ్వండి. మమ్మల్ని అర్థం చేసుకోండి”అని ఎంత రిక్వెస్ట్ చేసినా వినేస్థితిలో అధికారం లేదు.”
తెరిచినకళ్ళు అరుస్తున్న శబ్దాలు ఏం జవాబిస్తాయి? గట్టిగా మాట్లాడుతాయి. అరుపుల్ని అరెస్టు చేస్తున్నారు.
ఎత్తిన లాటీలకు ఇనుపబూట్ల శబ్దాలు కోరస్ కలుపుతూ తెగబడుతున్నాయి. ప్రెస్ కవరేజీని విలేకరులను జర్నలిస్టులను నియంత్రిస్తున్నారు. తెగించిన కెమెరాలు కొన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తూనే ఉన్నాయి.
”ముప్పైఏళ్లుగా నివసిస్తున్నాము. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు” అని ముసలితనం కప్పుకున్న ఒక పెద్ద ముఖం ప్రశ్న.
”మీకు నోటీసులు ఇవ్వం. విసిగించొద్దు. ఇండ్లలో ఎవరు ఉండొద్దు. బయటకు రండి. కూల్చేస్తాం” అని కఠువుగా హెచ్చరిస్తున్నారు. జేసీబీల దాటికీ పేకమేడల్లా కూలుతున్నాయి. కాలనీ ఒక్కటే కాదు బతుకులూ ధ్వంసమవుతున్నాయి.
”ఏది అక్రమం? ఎవరు నేరస్తులు సార్? మాది రిజిస్ట్రేషన్ జాగా. అనుమతులు ఇచ్చింది మీరు? నిబంధనలకు లోబడి ఇల్లు కట్టుకున్నాం. ఇచ్చిన మీరే అక్రమం అంటే ఏం న్యాయం? బ్యాంకులోన్ కూడా మంజూరు అయ్యింది. నెలనెలా ప్రీమియం చెల్లిస్తున్నాం. నిలువ నీడలేదు. కూల్చిన ఇల్లుకు ప్రీమియం ఎవరు చెల్లించాలి. ఎలా కూలుస్తారు? అన్ని అనుమతులు ఇచ్చింది మీరు. సర్కార్ మారగానే అక్రమం గుర్తొస్తుందా? అన్యాయం కనబడుతుందా? అక్రమైతే చెల్లించిన టాక్సులను అనుసరించి క్రమబద్ధీకరించండి. నోటీసులేకుండా కూల్చడం అక్రమం కాదా??” అని నినదిస్తున్న ప్రశ్నలని, ఎదురు తిరిగిన గొంతులను రెడీగా ఉంచిన డీసీఎంలో కుక్కుతున్నారు వస్తాదుల్లాంటి పోలీసులు.
ఏ వస్తువులు తీసుకోవడానికి వీల్లేకుండా కట్టుబట్టలతో ఇంట్లోంచి మెడలుపట్టి వెళ్లగొడుతున్నారు. సానుభూతి లేకుండా పిచ్చి కుక్కల్ని తరుముతారే అలా తరుముతున్నారు. గజదొంగల్ని బంధించినట్లు బంధిస్తున్నారు.
పుస్తకాలకోసం వెతుకుతున్న లేతపిల్లల మనసుల్ని ఉరుము కళ్ళతో చండ్రనిప్పులు కురిపిస్తూ భయకంపితులని చేస్తున్నారు. పుస్తకాలు పట్టాల్సిన లేతవేళ్లు భయంతో గజగజ వణుకుతున్నాయి.
మూడు నెలల కింద గహప్రవేశం జరిగిన రమణ ఇంట్లోంచి పిల్లల్ని బయటకు తెచ్చారు.
గంటల వ్యవధిలో కాంక్రీట్ బంగ్లాలన్నీ నేలమట్టమయ్యాయి. డిజైన్ల బంగ్లాలు, రంగురంగులతో అలంకరించుకున్న గర్వము ఆత్మగౌరవంతో నిలుచున్న బంగళాలు అధికార దాడికి శిథిలాలు, శకలాలుగా దర్శనమిస్తున్నాయి. అనుబంధాలు జ్ఞాపకాల కన్నీళ్లయ్యాయి.
రమణ పిల్లలు అత్తమామలు ఒక్కతీరుగా వలపొస్తున్నారు. ఏం జరుగుతుందో ఏమో అర్థం కావడంలేదు. ఏడుపు ఆకాశాన్ని తాకింది. విశాలమైంది. శాపనార్థాలు పెడుతున్న మహిళలు స్వరం తెగుతుందా అన్నట్లు తుంపర్ల మధ్య ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. చెవులుంటే బండరాళ్ల గుండెలు కూడా పగులు.
”మార్పు మార్పు అన్నావుకదా! మాడుపుమొకపోడా! గిదేనా మార్పు? మమ్ముల చంపేరు? మా శవాలమీద కుర్చేసుకొని పాలించు.” అని నడీడు ఆడమనిషి ఏడుపుతో ఎత్తి ఏడుదోసిల్ల మన్నుబోస్తూ నిందిస్తున్న దశ్యాలు టీవీల్లో కనబడుతున్నాయి.
”మీ ఇల్లు కూలగొడితే ఇట్లనే ఊరుకుంటారా? ఓ… పోలీస్ సారూ! నా చెప్పులతో నేనే కొట్టుకుంటున్న సూడు ఓటేసిన పాపానికి. ఓ… పోలీస్ మేడం నన్ను నేను కాలపెట్టుకొని సత్తా” అనగానే ఇద్దరు మహిళా పోలీసులు వచ్చి ఆమెను ఆత్మహత్య నేరం కింద నోరుమూయిస్తూ బలవంతంగా తీసుకెళ్లి పోలీస్ వ్యాన్ ఎక్కించారు.
బాధలను ప్రసారమాధ్యమాలు కొన్ని ప్రసారం చేస్తున్నాయి.
ఒక ప్రైవేట్ ఛానల్ యూట్యూబ్ విలేఖరి తీసుకుంటున్న ఇంటర్వ్యూలో బయటికి చెప్పు చూపించి ”ఒక్కక్కొన్ని పళ్ళు రాలగొడతామ”ని ఒక మహిళ హెచ్చరిస్తుంది.
ఆ కాలనీ రిక్టర్ స్కేల్‌పై ఏడుగా నమోదైన భూకంప విలయంలా దర్శనమిస్తుంది.
కొంతమంది నెత్తి కొట్టుకుంటున్నారు. బిత్తర చూపులు చూస్తున్నారు. కొంతమంది పిచ్చివాల్లలా పరుగులు పెడుతున్నారు. రొమ్ము చరుచుకుంటున్నారు. నెత్తి కొట్టుకుంటున్నారు. కాలని అంతా దింపుడుకల్లంలా రోదనలతో మిన్ను ముట్టింది. సానుభూతి గుంపు కట్టొద్దు. ఏమో సాయుధం కావొచ్చు. తేనెటీగల దాడిలా పోలీసులు గుంపులను తరుముతున్నారు. గుంపులని బెదిరించడానికి లాఠీచార్జీ చేస్తున్నారు. తగిలిన దెబ్బలను, గాయాలను, కారుతున్న రక్తపు మరకలను సాక్ష్యాలుగా చూపెడుతున్నారు.
ఎక్స్‌మో చికిత్సకు సిద్ధం చేస్తుండగా గోనవ్వకు హార్ట్‌స్ట్రోక్‌తో చనిపోయింది.
కాలనీలో ఏం జరిగిందో, జరుగుతుందో రమణకు తెలియనివ్వలేదు. పార్థివ వాహనంలో గోనవ్వను తీసుకొని నల్లచెరువు ప్రాంతంలోని ఇంటి వద్దకు వచ్చేసరికి స్మశానానికి వచ్చినట్లుంది. ఇల్లు స్మశానమైందా? స్మశానమే ఇల్లు అయిందా అర్థంకాని దుస్థితి. రమ్యకు రమణకు అర్థం కాకుండా ఒకరి మీద ఒకరుపడి ఏడుస్తున్నారు.
గహప్రవేశం చేసి కాలనీ వాళ్ళతో కలివిడిగా కలిసిపోయిన రమణతో కలిసి విలపిస్తున్నారు. రమణ చెల్లెలు రత్న భర్త సురేందర్ ఓదార్చుతున్నాడు.
”బావా! నేను ఇల్లు కట్టాలని కోరికోరి నాన్నను ఒప్పించింది. బా…! ఊర్లోని జాగా ఉన్నదంతా అమ్మేలా జేసింది. ఊర్లో ఇల్లులేదు. ఉన్న అమ్మ పోయింది. కట్టుకున్న ఇల్లు కత్తికోత కోసింది. ఇప్పుడు అమ్మను ఎక్కడ కర్మచేయాలి బావా బావా! నన్ను ప్రాణంగా ప్రేమించిన నా తల్లి నాగ్గాకుండా పోయింది బావా! నేనేం చేయాలి బా…వ” అని పసివాడిలా ఏడుస్తున్నాడు.
కాలనీవాసులు ఓదార్చుతున్నారు.
నరసయ్య ఏడిసి ఏడిసి గోడగా నిలబడిపోయాడు. నిర్వేదం ఆవరించింది. భార్య చనిపోయిన బాధ, ఇల్లు కూలిపోయిన బాధ రెండు కలిసి మానసికస్థితి చెదిరిపోయింది. మనిషిలా లేడు. పరిస్థితి చేసిన పిచ్చివాడిలా అయ్యాడు నరసయ్య.
రమ్య దుఃఖం మొగులు తెగని వర్షంలా ఉంది. కాలనీ అధ్యక్షులు రమేష్ రాగానే రమణ మీదపడి ఏడుస్తూ ”సార్ సార్ ప్లాట్ మీరే ఇప్పించారు. బ్యాంకులోను ఇప్పించారు. దగ్గరుండి అన్ని చేయించారు. రాత్రికి రాత్రి ఈ ప్లాటు బఫర్ జోన్ ఎట్లా అయింది సార్? మా బతుకే బరివాతయింది సార్” అని ప్రశ్నిస్తూ ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ప్రశ్నిస్తున్నాడు. మన ఇండ్లన్నీ కూల్చబడ్డాయి.
చుట్టాలు బంధువులు రమణను ఏడువకూడదనీ ఫ్రెండ్స్ బుజ్జగిస్తున్నారు. బతిమాలుతున్నారు.
”జాగకు జాగా. ఇల్లుకి ఇల్లు ఇస్తరట. ఏడుపెందుకు సార్? ఏం పోలేదు. జరగబోయే కార్యం చూడాల”ని రమణ కోలీగ్ అన్నాడు.
”ఆ… ఎవడో నీకు ఇస్తడు? నువ్వు తీసుకుంటావు? అదంతా కల్ల. బెకారుగాడెవడో పుట్టించిన పుకారు నమ్ముతావు? కల్లబొల్లి కబుర్లు చెప్పేటోళ్లు మస్తుగ ఉంటరు. ఆ మాటలు ఎందుకు కానీ జరగబోయేది ఆలోచించుండ్రి” అని నరసింహులు చెబుతున్నాడు.
ఆ మాటలు విన్న రమణ మరింత నిరుత్సాహపడ్డాడు.
”రమణ సార్ ఏడుపు ఆపండి. మన కాలనీ వాసులం మనకు పరిహారం రావాల్సిందని కోర్టులో పిటిషన్ వేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లు ఆధారం చేసుకుని కోర్టుకు వెళుతున్నాము. కచ్చితంగా మనమే గెలుస్తాం. మనకు న్యాయం జరుగుతుంది. నా మాట నమ్మండి. నేను ఒక లాయర్ గా చెప్తున్నా”ని లక్ష్మణ్ విశ్లేషించారు.
కొంతసేపటి తర్వాత రమణ పరిస్థితులను ఆకలింపు చేసుకొని ఓదార్చబడ్డాడు.
”అమ్మ అంత్యక్రియలు ఎక్కడ చేద్దాం సార్” అని అడుగుతున్నాడు.
”ఊరికి తీసుకెళ్ళుదాం” అని భరత్ అన్నాడు.
”నాన్నను అడుగుదాం” అని రమణ అన్నాడు.
అప్పటిదాకా పిచ్చిపిచ్చిగా వ్యవహరించిన నరసయ్య స్థిమితంగా ఆలోచిస్తూ! ”నా బంగారం పోయింది. ఆమె కొనుమన్న ఇల్లు పోయింది. ఇల్లడుగు జాగ మిగిలింది. ఆ ఇల్లడుగు జాగలో కాల్చేద్దాం.” అని జవాబిచ్చాడు.
”కూలిపోయిన కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ కొంతమంది పెద్దలు ముందుకొచ్చి ఈ కాలనీ ఇప్పుడు స్మశానంగా మారింది. ఇక్కడే కాల్చేద్దా”మని మద్దతు పలికారు.
ఫోన్‌లో అన్నీ ఏర్పాట్లు ఆరాతీస్తున్నారు.
ఫోన్‌లో సంద్రింపులు జరిగాయి. ముత్తైదువ చావు ప్యాకేజీ కుదుర్చుకున్నారు. కాడుకట్టెలు వస్తున్నాయి. కొత్తబట్టలు, శవయాత్రకు సంబంధించిన సరంజామా అంతా కూలిన శకలాల మీదుగా ఎత్తేసుకుంటూ డొక్కు ఆటలో వస్తున్నాయి. డప్పులోల్లు వస్తుండ్రు.
పోలీసు కస్టడీలో ఉన్న ఎదురుతిరిగినోల్లకు ఫోన్‌ద్వారా తెలిసింది. వాళ్లు ఇంకొంత మందికి ఫోన్‌చేసి చెప్పిండ్రు. కూలిపోయిన మన కాలనీలో సచ్చిన ఆ ముసల్దాన్ని దహనం చేస్తరట. ఆపుండ్రి అని ఫోన్‌లు రాగానే ఇక్కడ ఉన్నోల్లు ఒక్కటయ్యిండ్రు.
కాలనీ వాసులు ఇప్పుడు రెండు వర్గాలు అయ్యిండ్రు.
”ఎన్నటికైన ఈ కాలనీ మనదే. ఇక్కడ కాల్చొద్దు.” అనే వాళ్లు రెట్టింపయ్యిండ్రు. రమేష్ కూడా వెనకకు తట్టిండు.
”మా ఇంట్ల మేం దహనం చేస్తం. వద్దనడానికి మీరెవరు?” అని బంధువులు, స్నేహితులు గట్టిగట్టిగ మాట్లాడుతున్నారు.
”మర్యాదగ వినండి. ఎట్ల కాల్చుతవో కాల్చు. అదీ చూస్తం” అని కొందరు గర్జిస్తున్నారు.
స్మశానంలాంటి స్థలంలో పోరాటం మొదలైంది. ఎవరో పోలీసులకు ఫోన్ చేసిండ్రు.
క్షణాలలో ఒకటి కాదు రెండు కాదు గుంపులు గుంపులుగా పోలీస్ జీపులు వస్తున్నట్లు సైరన్‌లు వినబడుతున్నాయి. అవి వాయువేగంతో దూసుకొచ్చి చుట్టుముట్టాయి.
ఇన్నోవా కార్లలోంచి పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపలాగా నిల్చున్నారు. కొన్ని కెమెరాలు రెప్పగొట్టకుండా రికార్డు చేస్తున్నాయి.
ఒక ఆరడుగుల అధికారదర్పం రమణని ”శవాన్ని తీయకపోతే.. చూడు బిడ్డా! తడాఖా కనవడ్తది. ఇబ్బంది అనిపిస్తే అనాధ శవసంస్కరాలు మేమే చేస్తం” అని ఆగ్రహంగా హెచ్చరిస్తున్నాడు.
డెడ్‌బాడీకి పర్లాంగ్లా దూరం వచ్చాక ”మీ అమ్మ అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతున్న పరిస్థితులపై మీ అభిప్రాయం తెలియజేయండి” అని కన్ను తెరిచిన కెమెరాతో ఒక మైకు వెంటాడుతుంది.
ఒగ పెద్దాయన చిరాకుతో ”ఇటు రా అమ్మా! దుఃఖంలో నీతో మాట్లాడతాడా? నేను మాట్లాడతా.” అన్నాడు.
మైకు ముందు పెట్టి కెమెరా ఆన్ చేశారు. ”జర్నలిస్టులు అంటే నాకు అపార నమ్మకం. ఇక ప్రస్తుత విషయం ఇదిగో మధ్యతరగతికి ఇల్లు కట్టుకోవడం జీవిత కాలపు ఆశ. ఆ ఆశచుట్టూ మార్కెట్ పొద్దుతిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటుంది.
వేలు వంకరగా పెడితే వెన్న వచ్చినట్లు ఆశకు ఎరవేస్తే తప్ప ఆమ్యామ్యాలు రాలవు. బ్రోకర్లకు కమిషన్లు, రియల్టర్లకు లాభాలు ఊరికే రావు. స్థానిక నేతలకు వాటాలు కావాలి కాబట్టి ఆశకు రెక్కలు వస్తాయి.” అని వివరిస్తున్నపుడు సానుభూతి తాకిడి ఎక్కువైంది.
ఇక్కడ పరిస్థితి సీరియస్ అని వాకీటాకీలో సమాచారం వెళ్లింది. వాహనాలు సైరన్‌లతో దూసుకొస్తున్నాయి.
ఇంటర్వ్యూ ఇవ్వకుండా కొంతమంది ఆడోళ్లు శాపనార్థాలు, పెడబొబ్బలు పెడుతున్నారు. వారిని ”ఆగుండ్రి. ఆగుండ్రి.” అని పెద్దమనిషి.
”తల్లీ! ఆశను సొమ్ము చేసుకోవడానికి బ్రోకర్లు వేటాడుతారు. రియల్టర్లు, బిల్డర్లు దొడ్డిదారిన పర్మిషన్లకు దరఖాస్తు ఇస్తారు. నిషేధిత స్థలాల్లోనూ అధికారులు అనుమతులు ఇస్తారు. భవనాలు మొలుస్తాయి, తక్కువ ధరకని ఎరవేసి బాధితులను పట్టుకుంటారు. తా అంటే తందానన్నట్లు బ్యాంకులు లోన్లు ఇస్తాయి. ఇంతమందిని కొనెటోడు ఎక్కడా కనబడడు. బతుకొక నాటకం. పాత్రలెవరో? పాత్రులెవరో తెలుసుకునేసరికి మధ్యతరగతి మనిషికి చింత మిగులుతుంది. కడుపు ఆరని కత్తిలా చితి నిత్యం నోరుతెరుచుకొని ఎదురుచూస్తుంటది. బలి అయ్యేది బలహీనులే… సామాన్యుల బతుకు రాత్రికి రాత్రే మారిపోతది. మాడిపోతది. బతుకులు కుక్కలు కాదు ఎన్నో కలలతో ఎన్నికైన వ్యవస్థ చింపిన విస్తారయితది. అభివృద్ధి జరగనీ. సామాన్యులు వద్దనడం లేదు. ఇప్పటి నష్టానికి బాధ్యత సర్కారుదే. అది ఇప్పటి సర్కారా? ఇంతకు ముందటి సర్కారా? కాదు. సమస్య పరిష్కారం చేయండి. సామాన్యులను బతుకనివ్వండి.”
తేనెటీగల గుంపులా మంది గుమికూడారు. కడక్ స్వరాలు కొన్ని బెదిరిస్తూ చెదరకొడుతునాయి.
”ఎట్లాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు” జర్నలిస్ట్ ప్రశ్న.
”పరిమిషన్ ఇచ్చినందుకు ఇల్లుకు ఇల్లు కట్టించాలి. మార్కెట్ విలువగా పరిహారం అందజేయాలి. క్రమబద్ధీకరించాలి. పకడ్బందీ చర్యలు చేపట్టాలి. మధ్యతరగతి బతుకులు తక్కువ ధరకు అని మోసపోవద్దు. విచక్షణగా ఆలోచించాలి” అని ముగించారు.
ఏరు ఎవడ్రా ఇక్కడా చితి కాల్చేది? వెళ్లిపోండి. అనవసరంగా కేసులపాలు కావొద్దు.
”రమణా! ఏంటి ఈ పరిస్థితి” అని ఒక అధికారదర్పం కరుకుగా ప్రశ్నించింది.
రమణకు ఏం మాట్లాడాలో తేరుకునేలోపల ”మేం సందం చేస్తం. ఇక్కడికి దగ్గరలోనే ఎలక్ట్రిక్ స్మశానం ఉంది. మేం అంత్యక్రియలు చేస్తమ”ని అధికారం ఉరిమింది.
”అయ్యా! నా భార్య చావు నేను చేసుకుంట. మమ్ముల బతకనియ్యిండ్రి.” అని వంగి పాదాలకు ఎదిరించి మట్టికి దండం పెట్టిండు. ”అయ్యా ఈ మట్టి సాక్షిగా చెప్పుతున్న. నా భార్యచావుకు ఏర్పడకుంట కారణమైనోన్ని, ఆ నడమంత్రపు అభివృద్ధిని, అధికారాన్ని ఈ మట్టిలో కలువాలని శాపం పెడుతున్న. కలువకపోతదా? నేను సూడకపోతనా?” అని పిడికిట్లో కి తీసుకున్న మట్టి దూరంగా వెదజల్లిండు.
పాండ్రహా పాండ్రి. స్మశానంలోనే ఆఖరి కార్యక్రమాలు చేద్దామని పురమాయించాడు నర్సయ్య.
మొహరం పండుగ ఏబీసీగాని తలగొట్టినట్లు అంబులెన్స్ వెనుక విషణ్ణ వదనాలతో స్మశానంవైపు అడుగులు భారంగా పడుతున్నాయి.
డా. సిద్దెంకి యాదగిరి. 9441244773