Friday, December 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ రాకుంటే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవారా?

తెలంగాణ రాకుంటే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవారా?

- Advertisement -

మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీఎం రేవంత్‌రెడ్డి భాష చూస్తే అసహ్యంగా ఉందని మాజీమంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య, నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్‌, కేసీఆర్‌ వంటి వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులుగా ఉన్నారనీ, వారు అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. కేసీఆర్‌ తెలంగాణ తేకుంటే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవారా?అని ప్రశ్నించారు. జైపాల్‌రెడ్డి ఇంగ్లీష్‌లో మాట్లాడితే పదాలకు అర్థం కోసం డిక్షనరీలో వెతుక్కునే వారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి తెలుగులో మాట్లాడే బూతులు పదాలను ఏ డిక్షనరీలో వెతకాలని ఎద్దేవా చేశారు. నాలుగు వేల గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు గెలిచారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఎలా ఖతం అవుతుందని ప్రశ్నించారు. భూమి ఉన్నంత వరకు బీఆర్‌ఎస్‌ ఉంటుందనీ, కేసీఆర్‌ సీఎం కావడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా తేవాలని డిమాండ్‌ చేశారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన, ఆక్రోశం బయటపడిందన్నారు. కేసీఆర్‌ను తిట్టడానికి రేవంత్‌రెడ్డికి ప్రజలు ఓట్లు వేశారా?అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా?అని అడిగారు. రేవంత్‌ను సీఎం కుర్చీ నుంచి దింపిన తర్వాతే కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తారని చెప్పారు. ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి దమ్ముంటే కొడంగల్‌ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఆరు గ్యారంటీలు అమలయ్యాయో చూపించాలని కోరారు. ఇది నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయబోననీ, రేవంత్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎమ్మెల్యేను చేస్తామని చెప్పారు. ఆయన్ను చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జి జైపాల్‌యాదవ్‌, శాట్స్‌ మాజీ చైర్మెన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -