పారిపోతున్న పారిశ్రామికవేత్తలు
ఐదేండ్లలో 11వేల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు మూసివేత
ఉపాధికోల్పోయిన 55వేల మంది కార్మికులు
ఇవీ కేంద్ర నివేదికలోని అంశాలు
గాంధీనగర్ : నిన్న మొన్నటి వరకు గుజరాత్ మోడల్ అంటూ ప్రధాని నరేంద్రమోడీ సహా కేంద్రంలోని మంత్రులంతా ఊదరగొట్టిన విషయం తెలిసిందే. కానీ వాస్తవంలో గుజరాత్ తీవ్రమైన పారిశ్రామిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. గడచిన ఐదేండ్లలో గుజరాత్‌లో 11వేల పరిశ్రమలు మూతపడ్డాయి. వాటిపై ఆధారపడిన
55వేల మంది కార్మికులు రోడ్డునపడ్డారు. ప్రధాన మీడియా ఈ విషయాలను దాచేసి, అన్ని రాష్ట్రాల గాటనే దీన్నీ కట్టేసింది. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం 2020 జులై 1 నుంచి 2025 జులై 15 వరకు గుజరాత్‌లో 10,948 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. దీనివల్ల 54,901 మంది ఉపాధి కోల్పోయారనే సమాచారమూ ఉంది. గుజరాత్ ప్రభుత్వం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ సెక్టార్‌కు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, సబ్సిడీలను నిలిపివేయడంతో పరిశ్రమల మూసివేతలు కొనసాగినట్టు తెలుస్తోంది. ఆహారం, తయారీ, సేవలు, టెక్స్‌టైల్ రంగాల్లో మెజారిటీ పరిశ్రమలు మూతపడ్డాయి. అలాగే 2023-25 మధ్య 348 స్టార్టప్‌లు కూడ మూతపడ్డాయి.
అయితే ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమల్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గుజరాత్‌కు బలవంతంగా తరలించుకెళ్తుందనే విమర్శలు ఉన్నాయి. అలా తీసుకెళ్లిన పరిశ్రమలకు ప్రారంభంలో అనేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇస్తామని హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. పరిశ్రమ ఏర్పాటైన రెండు, మూడేండ్లలో ఏ ఒక్క హామీ అమలు కాకపోవడం, ఉత్పత్తి మందగించి, నష్టాలపాలు కావడంతో పారిశ్రామికవేత్తలు కంపెనీలను మూసివేస్తున్నారని సమాచారం. ఫలితంగా గుజరాత్ నుంచి కూడా ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక్కడ విద్యావంతులైన యువత ఇప్పుడు నిరుద్యోగులుగా మారుతున్నారు. ఈ పరిస్థితులపై రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైబ్రెంట్ గుజరాత్ నినాదం ప్రాభవాన్ని కోల్పోతుందని చెప్తున్నారు. అయితే గుజరాత్‌లో ఏర్పాటవుతున్న పెద్ద కంపెనీలు ప్రీమియంతో పాటు భూమి, కోట్ల విలువైన సబ్సిడీలు పొందుతూనే ఉన్నాయి. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, సంస్థలు మాత్రం సర్కారు సహకారం లేక విలవిల్లాడుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో పోటీ పడలేక, మనుగడ సాగించలేక, మూసివేతలకు కారణమవుతున్నాయి.
ఉద్యమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్లలో తీవ్ర క్షీణత
ఉద్యమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్లలోనూ గుజరాత్‌లో పారిశ్రామిక సంక్షోభం స్పష్టంగా కనిపిస్తోంది. 2023-24లో 13 లక్షలకు పైగా చిన్న పరిశ్రమలు ఈ పోర్టల్‌లో నమోదయ్యాయి. కానీ 2025-26 నాటికి ఈ సంఖ్య 5,30,160కి పడిపోయింది. వైబ్రెంట్ గుజరాత్‌ను నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలు అందుకున్నప్పటికీ, ”డిస్ట్రిక్ట్ వైబ్రెంట్” చొరవల ద్వారా జిల్లా స్థాయిలో ఈ నమూనాను పునరావృతం చేయడంపై ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఆశాజనకమైన ఫలితాలనివ్వలేదు. గుజరాత్‌లోని బీజేపీ సర్కార్ పెద్ద పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరించి, చిన్న పరిశ్రమలను పక్కన పెట్టిందని పారిశ్రామిక విశ్లేషకులు చెప్తున్నారు. ఫలితంగ ఆ రాష్ట్ర పారిశ్రామిక విధానంలో అంతరాలు బహిర్గతమై, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఇది సరికాదు
వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్‌లు నిర్వహించినప్పుడు పెద్ద పరిశ్రమలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య పరిశ్రమలకు సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంటున్నా, వాస్తవానికి భిన్నంగా ఉంది. మధ్య తరహా పరిశ్రమల టర్నోవర్‌ల ప్రమాణాలు మారుతూనే ఉన్నాయి. విధాన నిర్ణయాల వల్ల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ పరిశ్రమలు నష్టపోతున్నాయి. విదేశాల నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకుని దిగుమతి సుంకం రద్దు చేసినప్పుడు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా నష్టపోతున్నాయి. మరోవైపు, ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఉత్పత్తులపై జీఎస్టీ భారం పడుతుంది. అదే సమయంలో చిన్న తరహా పరిశ్రమల్లో ఏ రంగాలు ఎక్కువగా నష్టపోతున్నాయి..? ఏఏ సంస్థలు మూతపడుతున్నాయి..? అనే వివరాలపై సమగ్ర విచారణ చేయాలి.
-రాజకీయ, ఆర్థిక శాస్త్ర విశ్లేషకుడు హేమంత్ షా



