Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుతప్పని తిప్పలు

తప్పని తిప్పలు

- Advertisement -

యూరియా కోసం రైతుల కష్టాలు
తెల్లవారుజామునే లైన్లో..పలుచోట్ల పోలీసుల సమక్షంలో పంపిణీ
నవతెలంగాణ- విలేకరులు

యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సోమవారం తెల్లవారకముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలు, పీఏసీఎస్‌ కేంద్రాలు, దుకాణాల వద్ద బారులు తీరారు. పలుచోట్ల పోలీసు బందోబస్తు మధ్య యూరియా బస్తాలు పంపిణీ చేశారు. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌లో తోపులాట జరిగి ఓ రైతు స్పృహ తప్పి పడిపోయాడు.
కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలంలోని జంగంపల్లి, పెద్ద మల్లారెడ్డి సొసైటీ కార్యాలయాల ఎదుట రైతులు యూరియా కోసం బారులు తీరారు. పోలీసులు సొసైటీ వద్దకు చేరుకుని ముందస్తు చర్యలు తీసుకున్నారు. గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనంలో రైతుకు రెండు బస్తాలు మాత్రమే యూరియా ఇవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని సోమార్‌పేట్‌ గ్రామంలో రైతులు యూరియా కోసం ఉదయం నుంచే పడిగాపులు కాశారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని వందలాదిమంది రైతులు మరోసారి యూరియా కోసం రోడ్డెక్కి ధర్నా చేశారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ధర్నా మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు కొనసాగింది. మరిపెడ పట్టణ కేంద్రంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద వరంగల్‌ ఖమ్మం జాతీయ రహదారిని స్తంభింపజేశారు. మరిపెడ సీఐ రాజకుమార్‌, ఎస్‌ఐ సతీష్‌, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎన్నిసార్లు సర్ది చెప్పినా ససేమిరా అన్నారు. ఉదయం సద్ది కట్టుకొని వచ్చినా యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నామని రైతులు సద్ది మూటలను వారికి చూపించారు. చివరిగా మరిపెడ ఏడిఏ విజయచంద్ర వచ్చి ప్రతి రైతుకూ రెండు బస్తాల యూరియా కట్టలు అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

యూరియా అందితే చాలు..
జనగామ జిల్లా పాలకుర్తి సొసైటీకి యూరియా వస్తుందన్న సమాచారంతో రైతులు వర్షాన్ని సైతం లెక్కచేయ కుండా బారులు తీరారు. సొసైటీ వద్ద అర్ధరాత్రి నుంచి కాపలాకా శారు. 944 యూరియా బస్తాలు పాలకుర్తి సొసైటీకి కేటాయించగా.. సుమారు 1000 మంది రైతులు బారులు తీరారు. అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య రైతులకు కూపన్లు అందజేశారు. ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో యూరియా బస్తాలను అందజేశారు.

నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో రైతులు రహదారిపై ధర్నా నిర్వహించారు. పీఏసీఎస్‌ గోడౌన్‌లో 200ల యూరియా బస్తాలు మాత్రమే ఉందని అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ చెప్పడంతో ఆగ్రహానికి గురైన రైతులు రహదారిపై ధర్నాకు దిగారు. సూర్యాపేట జిల్లాలో యూరియా కొరతను తీర్చాలంటూ నడిగూడెం ప్రాథమిక సహకార సంఘం బ్యాంకు ముందు తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట కోఆపరేటివ్‌ బ్యాంకు గోదాం దగ్గర ధర్నా చేపట్టారు.

పెద్దముల్‌లో తోపులాట స్పృహ కోల్పోయిన రైతు
వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండల కేంద్రంలోని రైతు సేవ సహకార సంఘం కార్యాలయం వద్దకు పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు. 200 యూరియా బస్తాలు మాత్రమే రావడంతో రైతులు లైన్‌లో గంటల తరబడి వేచి ఉన్నారు. యూరియా బస్తాలు తక్కువగా ఉన్నాయని తెలుసుకున్న రైతులు ఆందోళనతో తోసుకురావడంతో తోపులాట జరిగి జనగాం గ్రామానికి చెందిన రైతు మల్లప్ప స్పృహ తప్పి పడిపోయాడు. రైతులు గమనించి ఆటోలో ఆస్పత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారంలో యూరియా విక్రయ కేంద్రం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు.
మెదక్‌ జిల్లా మనోహారాబాద్‌లో రైతు వేదిక వద్ద గంటల తరబడి నిలుచున్న రైతులు యూరియా అందకపోవడంతో జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. సుమారు రెండు గంటల పాటు ధర్నా చేయడంతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. తహసీల్దార్‌ ఆంజనేయులు యూరియాను పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. నార్సింగి పట్టణంలో యూరియా పంపిణీ దుకాణం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దుకాణాదారుడు, పోలీసులు రైతు వేదిక వద్ద టోకెన్‌లు తీసుకోవాలని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. శివ్వంపేట మండలంలో యూరియా టోకెన్ల కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడిన రైతులు ఒక్కసారిగా ఎగబడి, రైతువేదికలోకి చొచ్చుకొని వెళ్లారు. సిద్దిపేట జిల్లా మద్దురులో పీఏసీఎస్‌ కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే లైన్లు కట్టారు. కొండపాక, జగదేవపూర్‌, కుకునూర్‌పల్లి, కొండపాక మండలాల్లో జాతీయ రహదారిపై రైతులు బైటాయించి నిరసన తెలిపారు.

యూరియా కోసం ఆత్మహత్యాయత్నం
యూరియా కోసం రోజూ కార్యాలయం చుట్టూ తిరిగి విసుగు చెందిన వనపర్తి జిల్లా ఘనపూర్‌ మండల కేంద్రానికి చెందిన రైతు బిక్కి కేశవులు ఆత్మహత్యాయత్నం చేశాడు. పీఏసీఎస్‌ కార్యాలయం భవనం పైకెక్కి దూకేస్తానని హెచ్చరించాడు. తోటి రైతులు, అధికారులు నచ్చజెప్పి కిందకు దించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌, యాచారం, పెద్దముల్‌ మండలాల్లో యూరియా కోసం రైతులు
బారులు తీరారు. షాబాద్‌ పీఏసీఎస్‌ ఎదుట ఉదయం 7 గంటల నుంచి లైన్‌లో నిలుచున్నారు. షాబాద్‌కు 20టన్నుల (400 బస్తాలు) యూరియా వస్తే, ఒక్కో రైతుకు రెండు బ్యాగుల చొప్పున పంపిణీ చేసి, మరి కొంతమంది రైతులకు టోకెన్లు ఇచ్చి పంపించారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొంతం మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad