కొన్ని ఊర్లు… పేర్లు చరిత్రకే చరిత్రను అద్దుతాయి. ఇంకొన్ని మనల్ని చరితార్థులను చేస్తాయి. పరిశోధకాగ్రణి, తెలుగుజాతి చరిత్రకు నాలువందల యేండ్ల చరిత్రను భిక్షగా పెట్టిన మహామనిషి, ప్రాత:స్మరణీయులు శ్రీ భిన్నూరి నరహరిశాస్త్రి గారు. పూర్తిపేరుతో చెబితే ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ బి.ఎన్.శాస్త్రి అనగానే నడిచే శాసనం కళ్ళముందు కదలాడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అన్న అనుమానం రావచ్చు. మనం ఇవాళ్ళ మాట్లాడుకుంటున్న బాలల కథకుడు డా. రెబ్బ మల్లికార్జున్ అందుకు కారణం. మల్లికార్జున్ పుట్టింది నల్లగొండ వలిగొండ మండలం అర్రూరులో. చదివింది తుమ్మలగూడెంలో. ఈ తుమ్మలగూడెం ప్రాచీన నామం ఇంద్రపాల నగరం, తెలుగునేలను నాలుగు వందలేండ్లు పాలించిన విష్ణకుండిన రాజుల రాజధానిగా బి.ఎన్.శాస్రి నిరూపించారు. 27 జూన్, 1978న పుట్టిన మల్లికార్జున్ తల్లిదండ్రులు శ్రీమతి రెబ్బ రాములమ్మ – కృష్ణమూర్తి. అర్రూరు, తుమ్మల గూడెం, వలిగొండ, భువనగిరి, హైదరాబాద్‌లలో విద్యాభ్యాసం చేసిన వీరు తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు.
తెలుగు సాహిత్య బోధన, అధ్యాపనాల్లో అభిరుచివున్న వీరు కవి, రచయిత, పరిశోధకులు. ఇటీవల పిల్లల కోసం చక్కని కథలు కాసిన బాల సాహితీవేత్త. పద్మశ్రీ కూరెళ్ళ విఠలాచార్య పట్ల అత్యంత గురుభక్తి కలిగిన డా. రెబ్బ వారి ‘విఠలేశ్వర శతకం-ఒక పరిశీలన’ అంశంపైన ఎం.ఫిల్. చేశారు. ‘యాదాద్రి భువనగిరి జిల్లా శతక సాహిత్యం-సమగ్ర పరిశీలన’ అన్న అంశాన్ని స్వీకరించి పిహెచ్.డి. పూర్తిచేశారు. కూరెళ్ళవారి జీవిత కథను, యాత్రను ‘చరితార్థుడు’ పేరుతో జీవనచరితగా కూర్చారు. కవిగా ‘కరోనా కల్లోలం’ కవితా సంపుటిని ప్రచురించారు. ‘వ్యాస కౌముది’ పేరుతో వీరి సాహిత్య వ్యాసాలు సంపుటంగా అచ్చయ్యాయి. కూరెళ్ళవారి ఆస్థాన సాహితీమూర్తిగా ఆయనపైన పరిశోధన, జీవిత రచనలు చేస్తూనే ‘కూరెళ్ళ ఇంటర్వ్యూలు’ తన సంపాదకత్వంలో తీసుకువచ్చారు. పుస్తక సంపాదకునిగి ‘చిగురు’ పేరుతో ఒక కథా సంకలనాన్ని కూడా తెచ్చారు మల్లికార్జున్. దాదాపు అన్ని ప్రధాన పత్రికల కోసం రచనలు చేసిన ఈయన యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం సహాయ కార్యదర్శిగా ఉన్నారు. జీవసంగీతం స్వచ్ఛంద సంస్థ సంయుక్త కార్యదర్శిగా, ఆత్మీయ భారతి ప్రధాన కార్యదర్శిగా, ‘అఆ’ (అభ్యుదయ ఆలోచనల వేదిక’) బాధ్యులుగా ఉన్నారు. నల్లగొండ పూర్వ కలెక్టర్ నందివెలుగు ముక్తేశ్వరావు చేతుల మీదగా ‘సాహితీ పురస్కారం’ అందుకున్నారు. ఇవేకాక నవతెలంగాణ 3వ వార్షికోత్సవ సత్కారం, తెలంగాణ అవతరణ దినోత్సవ సత్కారం, ప్రపంచ తెలుగు మహాసభల్లో సత్కారం వంటివి మల్లికార్జున్ అందుకున్న పలు పురస్కారాలు, సత్కారాలు. కవిగా అనేక కవిగోష్టులు, కవి సమ్మేళనాల్లో పాల్గొని సత్కారాలు అందుకున్నారు.
కవిత్వం, పరిశోధన, విమర్శల్లో పనిచేస్తూనే పిల్లల కోసం రాసిన కథలను ‘వినయశ్రీ కథలు’ పేరుతో తెచ్చారు. తాను చూసిన సంఘటనలు, పిల్లలకు, పెద్దలకు నచ్చే, మెచ్చే వివిధ అంశాలను కథలుగా మలిచిన ఆయన బాలల మనస్తత్వానికి దగ్గరగా రచనలు చేస్తున్నారు. ‘బద్ధకానికి మంత్రం’ ఇటువంటిదే. చక్కగా పనిచేస్తూ, తల్లితండ్రులకు ఆసరాగా ఉండాల్సిన తరం బద్ధకంగా కూర్చుంటే ఎలా అన్న విషయాన్ని ఇందులో చెప్పాడు. ఒక కుమారుడు ఏ పనీచేయక సోమరిగా కూర్చుంటుంటే తన కొడుకును గమనించిన తండ్రి తను వృద్ధున్నయ్యానని కష్టపడి పనిచేయమని చెబుతాడు. ఒక మిల్లులో కూలీగా కుదురుకుని మొదటిరోజు ఇరవై రూపాయుల, రెండో రోజు, మూడోరోజు కూడా తెచ్చి తన సంపాదన తండ్రి చేతిలో పెడతాడు. ఇచ్చినవి ఇచ్చినట్టు తండ్రి వాటిని బావిలో వేస్తాడు. నాలుగోరోజు కూడా భావిలో వేయబోతే ఆపి ‘నాన్న అవి నాకష్టార్జితం’ అంటూ ఆపుతాడు. దానికి సంతోషపడ్డ తండ్రి తన కొడుకు ఆ రోజు నిజంగా కష్టపడి పనిచేసాడని ఎంతగానో సంతోషిస్తాడు. పని విలువను, డబ్బు విలువను తెలిపే కథ ఇది. మనకు తెలిసిన గొడ్డలి కథను ‘మాయా గొడ్డలి’ పేరుతో మళ్ళీ పున: కథనం చేసిన మల్లికార్జున్ అతి తెలివి వల్ల జరిగే నష్టాలు, అనర్థాలను ‘అతి తెలివితో అనర్థం’ కథలో చెబుతాడు. ఇందులోని ఉప్పు వ్యాపారి గాడిద అతితెలివితో బరువును తప్పించుకునేందు ఉప్పు బస్తాలు నీటిలో ముంచి కరిగేలా చేస్తుంది. దానివల్ల గాడిదకు బరువు తగ్గేది. దీనిని గమనించిన ఉప్పు వ్యాపారి గాడిదకు గుణపాఠం చెప్పేందుకు పత్తి బస్తాను వేస్తాడు. ఎప్పటిలాగే కాలువ దాటుతూ గాడిద కావాలని పత్తిబస్తాలను ముంచుతుంది. పత్తి మొత్తం నాని బాగా బరువైగాడిద తిక్క కుదురుతుంది. ఇదీ ఇందులోని కథ. ‘పిల్లికి గంట కట్టినట్టు’ సామెత మనకు తెలుసు. మల్లికార్జున్ ఆ సామెతను కథగా మలిచాడు. బాగుందీ కథ. మరో కథ ‘కోడిపుంజు చాకచక్యం’ అపాయంలో ఉపాయాన్ని తెలిపేది కాగా, ‘అపకారికి ఉపకారం|, ‘చెడు సహవాసం’, ‘కుందేలు సాయం’, ‘బుద్ధి చెప్పినట్టు’ మొదలైన కథలు పిల్లలకు తప్పక నచ్చుతాయి. బుద్ధిచెప్పినట్టు కథ కొద్దిగా పెద్ద కథ. ఈ సంపుటిలో కథలతో పాటు ‘కితకితలు’ పేరుతో నవ్వుకునే విధంగా జోకులను కూడా చేర్చారు డా.రెబ్బ మల్లికార్జున్. పిల్లలకోసం చక్కని కథలను అందించిన డా.రెబ్బ మల్లికార్జున్ కు అభినందనలు.
– డా|| పత్తిపాక మోహన్
9966229548
బాలల కథా సాహిత్యంలో యాదాద్రి కొత్త ‘పెబ్బ’
- Advertisement -
- Advertisement -