నవతెలంగాణ-గంగాధర
నిన్న, మొన్నటి వరకు ధాన్యం అమ్మకాల్లో బిజీగా ఉన్న రైతులు మళ్లీ యాసంగి సాగుపై దృష్టి సారించారు. కరీంనగర్ జిల్లాలో ఎల్లంపల్లి, కాళేశ్వరం జలాలతో జీవనదిగా మారిన వరద కాలువ నీటి ప్రవాహం ఓ వైపు ఉండగా, ఎల్లంపల్లి ఎత్తిపోతలతో నారాయణపూర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. నీటి కరువు లేదన్న భరోసాతో గంగాధర మండలంలోని మెట్ట ప్రాంత రైతాంగం వరి నాట్లను మొదలుపెట్టారు. లక్ష్మిపూర్ పంప్‌హౌజ్ నుంచి ఎత్తిపోసే కాళేశ్వరం, ఎల్లంపల్లి జలాలతో గంగాధర మండలంలో సాగు విస్తీర్ణం పెరిగింది. మండలంలోని అనేక గ్రామాలను ఆనుకుని వెళ్తున్న వరద కాలువ వల్ల తాగు, సాగునీటి బావుల్లో భూగర్భ జలాలు పెరగడంతోపాటు తూముల వల్ల చెరువుల్లోకి నీరు చేరుతోంది.మండలంలో 39 వేల 269 ఎకరాల భూములు సాగుకు యోగ్యమైనవిగా ఉండగా, సుమారు 23 వేల ఎకరాల్లో వరితోపాటు పలు రకాల పంటలు సాగు అవుతున్నాయి. వర్షాకాల సీజన్‌లో కేవలం 550 ఎకరాల్లోనే వరి సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ప్రస్తుత యాసంగిలో సుమారు 21 వేల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మెట్ట ప్రాంతంలో నూటికి 98 శాతం మంది రైతులు వరి సాగుపైనే దృష్టి పెట్టి నాట్లు వేసే పనిలో పడ్డారు.
సాగునీటి వనరులు పెరిగాయి : పానుగంటి శ్రీనివాస్, రైతు, కొండాయపల్లి
సాగునీటి వనరులు పెరగడం వల్లే వరి పంట వేయాలని నిర్ణయించుకున్నాం.. వరద కాలువ నీటి ప్రవాహంతో వ్యవసాయ బావుల్లో పుష్కలంగా నీరుంది. ప్రతి సీజన్‌లో ఆశించిన పంటల దిగుబడి వస్తుంది. పెట్టుబడి, శ్రమ పెద్దగా ఉండదన్న దృష్టితోనే వరి సాగును చేస్తున్నం. నీరు పుష్కలంగా మారడంతో నేనే కాదు, ప్రతి రైతు వరి సాగునే ఎంచుకున్నరు.
పల్లెల్లో మొదలైన యాసంగి వరినాట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



