– ఆకాశ్, జడేజా, సుందర్ అర్థ సెంచరీలు
– భారత్ రెండో ఇన్నింగ్స్ 396/10
– భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టు
నవతెలంగాణ-లండన్ :
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (118, 164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో చెలరేగగా.. నైట్‌వాచ్‌మన్ ఆకాశ్ దీప్ (66, 94 బంతుల్లో 12 ఫోర్లు), రవీంద్ర జడేజా (53, 77 బంతుల్లో 5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (53, 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో మెరువగా ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌కు భారత్ 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కెఎల్ రాహుల్ (7), సాయి సుదర్శన్ (11), శుభ్‌మన్ గిల్ (11), కరుణ్ నాయర్ (17) నిరాశపరిచినా.. యశస్వి జైస్వాల్ కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ను ముందంజలో నిలిపాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో గస్ అటిక్సన్, జోశ్ టంగ్‌లు వికెట్ల వేటలో మెరిసినా.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 88 ఓవర్లలో 10 వికెట్లకు 396 పరుగులు చేసింది.
జైస్వాల్, ఆకాశ్ అదరహౌ :
నైట్‌వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన ఆకాశ్ దీప్ (66) అదిరే ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లీశ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ టెస్టు కెరీర్‌లో తొలి అర్థ సెంచరీ సాధించాడు. యువ ఓపెనర్ జైస్వాల్ తోడుగా ఉదయం సెషన్లో ఆకట్టుకున్న ఆకాశ్‌దీప్.. అటిక్సన్, టంగ్‌లపై చూడచక్కని షాట్లు ఆడుతూ బౌండరీలు రాబట్టాడు. రాహుల్, సాయి సుదర్శన్ వికెట్లతో ఒత్తిడిలో పడిన భారత్‌ను ఆకాశ్ దీప్, యశస్వి జోడీ మూడో వికెట్‌కు 150 బంతుల్లో 107 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆకాశ్, యశస్వి భాగస్వామ్యంతో భారత్ కుదురుకుంది. ఇంగ్లాండ్‌కు సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించగలే స్థితిలో నిలిచింది.
సూపర్ యశస్వి :
ఇంగ్లాండ్ పర్యటనను సెంచరీతో మొదలెట్టిన యశస్వి జైస్వాల్.. ఆఖరు టెస్టులోనూ శతకంతో మెరిశాడు. ఆరంభంలో పలు జీవనదానాలు లభించటం యశస్వికి వరమైంది. ఆకాశ్ దీప్, కరుణ్ నాయర్, జడేజాతో వరుసగా 107, 40, 44 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆకాశ్ దీప్ 9 ఫోర్లతో 70 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదగా.. యశస్వి 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 127 బంతుల్లో శతక మోత మోగించాడు. యశస్వి జైస్వాల్ నిష్క్రమించే సమయానికి భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది.
ఆఖర్లో అదుర్స్ :
వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్‌లు ఆఖర్లో ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడారు. జడేజా నిష్క్రమణతో సిక్సర్ల మోత మోగించిన వాషింగ్టన్ సుందర్.. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. జురెల్ (34) వేగంగా పరుగులు పిండుకున్నాడు.
యశస్వి జైస్వాల్ శతకం
- Advertisement -
- Advertisement -