– సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజాస్వామ్యం, సమాఖ్య భావన, సోషలిజం, లౌకికవాదం, దేశ సార్వభౌమాధికారం వంటి ఉన్నత విలువలను సమర్థించడం లో కామ్రేడ్ సీతారాం ఏచూరి ఒక పెట్టని కోటలా ఉండేవారని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య కొనియాడారు. మండలంలోని నందిపాడు లో శనివారం ఆ శాఖ కార్యదర్శి మడకం రాజబాబు అద్యక్షతన నిర్వహించిన సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సభకు పుల్లయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సృజనాత్మకమైన వారి ఆలోచనలు దేశానికి సంబంధించిన అనేక విషయాలలో ఏకాభిప్రాయ సాధనకు ఉపయోగపడేవి అన్నారు.
సరళీకరణ ప్రయివేటీకరణ – ప్రపంచీకరణ (ఎల్పీజీ)కు వ్యతిరేకంగా పోరాడే సీతారాం ప్రభుత్వ రంగ సంస్థలను చెక్కుచెదరకుండా కాపాడేందుకు గట్టిగా నిలబడే వారని అన్నారు. గత నాలుగైదు దశాబ్దాలుగా ఢిల్లీ నగరం చూసిన ప్రతి పోరాటంలో నూ, పోలీసు దాడులను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందు భాగంలో ఉండేవారు అని,రైతుల పోరాటం మొదలుకొని సీఏఏ పోరాటం దాకా,ఆయన హయాంలో జరిగిన అన్ని పోరాటాలలో ముందు వరుసలో ఉన్నాడనే విషయం మర్చిపోలేం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్,మాజీ ఎంపీటీసీ మాడి నాగేశ్వరరావు,కారం జోగారావు,సూరిబాబు,మడకం నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.