Friday, September 12, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిలౌకిక విలువల కోసం పోరాడిన ఏచూరి

లౌకిక విలువల కోసం పోరాడిన ఏచూరి

- Advertisement -

కామ్రేడ్‌ సీతారాం నిర్యాణమై అప్పుడే సంవత్సరం అయ్యింది. దేశ రాజకీయ రంగంలో ఆయనలేని వెలితి స్పష్టంగా కన్పిస్తున్నది. భారత రాజ్యాంగ మౌలిక విలువలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, సమానత్వం, సోషలిజంలపై ఆరెస్సెస్‌ దాని పనుపున నడుస్తున్న బీజేపీ కేంద్ర సర్కారు తీవ్రమైన దాడి చేస్తున్న తరుణంలో, దాన్ని ఎదిరించి పోరాడే శక్తులను ఐక్యపర్చి ముందుకు తీసుకుపోవడంలో సీతారాం కృషి అసమానమైనది. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా ఆ ఒరవడిని మరింత పటిష్టంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భారతీయత భావనకు పునాది మన సమ్మిశ్రిత సాంస్కృతిక వారసత్వంలో ఉందని సీతారాం ప్రగాఢంగా నమ్మారు. ఆయన రచనల్లో, ఉపన్యాసాల్లో ఈ అంశాన్ని తప్పకుండా ప్రస్తావించేవారు. ఈ సమ్మిశ్రిత సాంస్కృతిక వారసత్వాన్ని ఆరెస్సెస్‌ మతోన్మాద శక్తులు ధ్వంసం చేస్తున్నాయి. ఆరెస్సెస్‌ రాజకీయ విభాగమైన బీజేపీ అధికారాన్ని, రాజ్య వ్యవస్థలను ఉపయోగించుకుని మరింత వినాశకరమైన దాడులు చేస్తున్నది. దీన్ని ఎదిరించి మన సమ్మిశ్రిత సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మన దేశ పురోభివృద్ధికి, అంతిమంగా సోషలిస్టు సమాజ సాధనకు అవసరం అన్న స్పృహతోనే ఫాసిస్టు హిందూత్వ మతోన్మాద శక్తులను నిరంతరం సీతారాం గారు ఎదుర్కొన్నారు. అయితే ఆ పని ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోయింది.

భారతీయ భావనను (ఇండియా ఆఫ్‌ ఇండియా) తరతరాల చరిత్ర తీర్చిదిద్దింది. ఈ భావన ప్రజల నిత్య జీవితానుభవం నుండి పోరాటాలు, ఉద్యమాలు సృష్టించిన ఐక్యమత్యం నుండి, అది సృష్టించిన ఉమ్మడి విలువలు, ప్రయోజనాల నుండి ఆవిర్భవించింది. ఈ భావనే మన రాజ్యాంగం ఇండియా ”భారత్‌” అన్న నిర్వచనంలో క్రోడీకరించింది. నేడు బీజేపీ, ఆరెస్సెస్‌ మతతత్వ శక్తులు సర్వ సాధారణ ఆమోదం పొందిన ఈ భావనను వమ్ముజేస్తున్నాయి. దేశ చరిత్రను వక్రీకరించి, కట్టుకథలను వ్యాప్తిజేసి, భారతీయ భావనకు వికృత రూపాన్ని ఇవ్వడానికి పూనుకున్నాయి.
భారతీయ భావనకు కీలకం ”భిన్నత్వంలో ఏకత్వం”. ఎన్నో మతాలు, భాషలు, మాండలిక, ప్రాంతీయ వ్యత్యాసాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, వేషభాషలు, ఆహారపు అలవాట్లు, పండగలు, పబ్బాలు, పెండ్లి పద్ధతులు, తెగలు, కులాలు జీవన పద్ధతులు కలగలిసి జీవించే కోట్లాది ప్రజలున్న దేశం మనది. ఇన్ని వ్యత్యాసాలున్నా, ఈ వైవిధ్యం కొన్ని సందర్భాల్లో దేశ సమైక్యతకు, ప్రజల సంఘీభావానికి పరీక్షలు పెడుతున్నా మనమంతా భారతీయులం/ ఇండియన్స్‌ అన్న ఆలోచన ప్రజల్లో బలంగా వేళ్లూనుకున్నది. కాని బీజేపీ ఇతర మతతత్వ శక్తులు ఈ విశాల భారతీయతా భావనకు బదులుగా ఒక సంకుచిత, మత భావనను చొప్పించి దేశ సమైక్యతకు చిచ్చు పెడుతున్నాయి.

ఈరోజు ఆరెస్సెస్‌ అధినేత భగవత్‌ గారి పుట్టినరోజు సందర్భంగా మన ప్రధాని మోడీ మీడియాకు విడుదలజేసిన ప్రశంసా వ్యాసంలో ”మోహన్‌భగవత్‌ గారు ‘ఏక్‌ – భారత్‌ – శ్రేష్ట భారత్‌’ భావనను విశ్వసిస్తారు. ఇండియా వైవిధ్యాన్ని, విభిన్న సంస్కృతుల, సాంప్రదాయాల గొప్పదనాన్ని గౌరవిస్తారు. ‘వసుధైక కుటుంబం సూత్రం ఆయనకు స్పూర్తి” అని రాశారు. భగవత్‌ గారిపట్ల ఆయన భక్తిప్రవత్తులు ప్రకటించుకోవడం ఆయన అభీష్టం. కాని ఆయన ఆరెస్సెస్‌ గురించి దాని అధినేత గురించి చెప్పిన అభిప్రాయాలు నోరు నవ్వుతుంటే నొసలు వెెక్కిరిస్తుంది అన్నట్లున్నది. ఏ విలువలైతే ఆరెస్సెస్‌లో నలుసంతైనా కన్పించవో, వాటిని ఆరెస్సెస్‌ అధినేతలో మనకు చూపించి, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మోడీ చేశారు. శ్రీభగవత్‌ గారికి, శ్రీ మోడీ గారికి ఏక్‌భారత్‌ అంటే ఒకేమతం – అంటే హిందూమతం, ఒకే భాష – అంటే సంస్కృతం/ హిందీ, ఒకే సంస్కృతి – అంటే బ్రాహ్మణ వాద అగ్రకుల జీవన విధానం – ఇదీ వైవిద్యంమీద వారి ప్రేమ, ఏక్‌ భారత్‌ అంటే వారి అర్థం.
మనదేశం ప్రాచీన కాలం నుండి హిందూమత ప్రాతిపదికన నడిచిందని అందువలన మన దేశాన్ని హిందూమత ప్రాతిపదిక రాజ్యంగా ప్రకటించుకోవాలని ఆరెస్సెస్‌ పరివార్‌ శక్తులు పనిజేస్తున్నాయి. ఈ ప్రయత్నాలకు అడ్డంగా ఉన్న రాజ్యాం గ మౌలిక విలువలను పథకం ప్రకారం ధ్వంసం జేస్తున్నాయి. మోడీ సారథ్యంలో గత పదకొండేండ్లలో బీజేపీ ప్రభుత్వం ఈ పనిజేస్తున్నది.
‘హిందూ’ అన్న పదానికి ఒక మతమనే అర్థం ప్రాచీనకాలంలో లేదు. దానికి మతార్థం ఆధునికంగా ఇవ్వబడింది. సింధూ నదీ ప్రవాహ ప్రాంతంలో నివసించే ప్రజలు ‘సింధూ’ అన్న మాటను వినియోగించారు. అయితే ఆనాటి ఇరానియన్‌ అవేస్త భాషలో అది ‘హిందూ’గా మారింది. దేశానికి వచ్చిన గ్రీకులభాషలో ఇండోస్‌గా మారింది. అనంతరం దేశంలో పర్యటన జేసిన చైనీయుల భాషలో అది ‘ఇంటు’గా వ్యవహరించబడింది. మధ్య యుగాల్లో దేశాన్ని పరిపాలించిన ఢిల్లీ సుల్తానుల కాలంలో పర్షియన్‌ భాష మూలంలో ‘హిందూస్థాన్‌’గా మారింది. బ్రిటీష్‌ వలస పాలకుల హయాంలో గ్రీకు భాషలోని ‘ఇండోస్‌’ నుండి ఇంగ్లీషు భాషలో ‘ఇండియా’గా మారింది. ఈ మొత్తం పరిణామంలో ఈ మాటలకు భౌగోళిక భావం తప్ప మతార్థం ఎక్కడా లేదు.

అలాగే ఇప్పుడు మనం ఒక దేశంగా భావిస్తున్న ప్రాంతాన్ని మన పురాతన ఆధారాలు భౌగోళికార్థంలోనే పేర్కొన్నాయి. వేదకాలం నుండి గ్రంథాలు సింధూ పరివాహక ప్రాంతం అన్న అర్థంలో ‘సింధవ’ అన్న మాటను వాడారు. ఆ తర్వాత అశో కుని శిలాశాసనాలలో ‘జంబుద్వీప’ మాట మనుధర్మ శాస్త్రంలో ప్రయోగించిన ‘ఆర్యావర్తం’ అన్న మాట, క్త్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దంలో ‘భారవేలుడు’ అనే పాలకుడు వేసిన శిలాశాసనంలో పేర్కొన్న ‘భారతవర్ష’ అన్న పదం భౌగోళిక అర్థంలోనే వినియోగించబడ్డాయి. అలాగే ‘హిందూమతం’ అన్న పదప్రయోగం కూడా పద్దెనిమిదవ శతాబ్దం వరకు మనకు కన్పించదు. అప్పటివరకు మతాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు బ్రాహ్మణం, జైన, బౌద్ద, శ్రమణం, వైష్టం, శైవం, ఇస్లాం, సిఖిజం వంటి పదాలనేె ప్రయో గించారు. కొంతమంది బ్రిటిష్‌ అధికారులు ‘హిందూ’ అన్న పదాన్ని మొట్టమొదట మత అర్థంలో ప్రయోగించడం ప్రారంభించారు. ఆ తర్వాత రాజారామ్‌మోహన్‌రారు 1819లో ‘హిందూయిజం’ అన్న పదాన్ని వినియోగించారు. ఇప్పుడు సంఫ్‌ుపరివార్‌ శక్తులు ‘హిందూమతం’ భావన ప్రాచీనకాలం నుండి ఉందని అదే ప్రజల రాజకీయ, సామాజిక జీవనాన్ని నడిపించిందని, పరిపాలనను శాశించిందని చెబుతున్న అంశం చారిత్రక సత్యం కాదు.

మనదేశంలో ఎన్నో మతాలు ఉద్భవించాయి. ప్రజాజీవితంపై పెద్ద ప్రభావాన్ని చూపాయి. బలమైన, ప్రభావితమైన శక్తులుగా ఎదిగాయి. కాలగమనంలో కొన్ని బలహీనపడ్డాయి. కొన్ని చీలిపోయి ముక్కలయ్యాయి. అయినా దేశంలో ఎన్ని మతా లున్నా, ఎన్ని వాదోపవాదాలు జరిగినా, కొన్ని సందర్భాలలో మత అనుయాయుల మధ్య భౌతిక సంఘర్షణలు జరిగినా, మొత్తం మీద ఈ ఉపఖండంలో విభిన్న మతాలు, మత శాఖలు సహజీవనం సాగించడం ప్రధాన అంశంగా ఉండేదనేది వాస్తవం. ఆ వాస్తవం, అనుభవం మీద ఆధారపడే మన స్వాతంత్య్రోద్యమ నేతలు బ్రిటీష్‌ వలసవాద వ్యతిరేకపోరాటంలో ప్రజలను సమీకరించేందుకు లౌకికవాద భావనను ఆలంబనగా చేసుకున్నారు. ముస్లిం లీగ్‌ ‘ఇస్లాం’ను రాజ్యానికి ప్రాతిపదిక అన్నా, హిందూ మహాసభ, ఆరెస్సెస్‌్‌లు ‘హిందూ’ మత ప్రాతిపదికగా జాతిని, దేశాన్ని నిర్మించాలని అన్నా, స్వాతంత్య్రోద్యమం (దానిలో – అన్ని పాయలు, కాంగ్రెస్‌ వాదులు, కమ్యూనిస్టులు, విప్లవకారులు) ఉపఖండమంతా, వైవిధ్యభరితమైన భారత దేశాన్ని ఒకటిగా నడపాలన్నా, వలస పాలనను తుదముట్టించడానికి ప్రజలను ఐక్యం జేయాలన్నా లౌకిక ప్రాతిపదిక అవసరం అని భావించింది. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ నిర్మాణ సభలో జరిగిన చర్చల్లో, జరిగిన వాదోపవాదాల్లో ఈ భావన స్పష్టంగా కన్పిస్తుంది.

ఆధునిక సమాజంలో ఏ దేశమైనా బతికి బట్టకట్టాలంటే, ఐక్యంగా మనగల్గాలంటే, నిరంతర సంఘర్షణలతో కునారిల్లకుండా అభివృద్ధి పథంలో ముందుకు పోవాలంటే రాజ్యానికి లౌకిక పునాది ఉండాలని ప్రపంచ అనుభవం తెల్పుతున్నది. ఆధునిక శాస్త్ర సాంకేతిక సమాచార, రవాణా రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులు, వ్యాపారం, ఉత్పత్తి, పర్యాటకం, మొదలగు అన్ని రంగాలలో ప్రపంచీకరణను స్థిరపర్చుతున్నాయి. ఒకే దేశంలోనే కాదు అన్ని దేశాల మధ్య ప్రజలు వలస పోవడం పెరిగిన నేపథ్యంలో దేశాలన్నింటిలో వైవిధ్యం ఇంకా తీవ్రమవుతున్నది. ఈ స్థితిలో ఏ రాజ్యమైనా స్థిరంగా, ఒడిదుడుకులు లేకుండా పురోగమించాలంటే లౌకికభావన ఆలంబన తప్పదు. మన దేశంలో ఎన్నో త్యాగాలతో, జీవితానుభవంతో సాధించుకున్న ‘లౌకిక భావన’ వమ్ముగావడాన్ని సహించడం మన దేశ చరిత్రకు అపచారం అవుతుంది. దేశ సమైక్యతకు విఘాతం కలుగుతుంది. అందుకే లౌకిక విలువలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. సోషలిజం కోసం జరిగే పోరాటంలో లౌకిక విలువలను కాపాడుకోవడం, ఒక ముఖ్యభాగం అని నమ్మి, జీవితాంతం కృషి చేసిన కామ్రేడ్‌ సీతారాం గారికి ఆ కృషిని కొనసాగించడమే మనం అర్పించగల నిజమైన నివాళి.

బి.వి.రాఘవులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -