Friday, September 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమార్కిృస్టు చరిత్రే ఏచూరి జీవితం

మార్కిృస్టు చరిత్రే ఏచూరి జీవితం

- Advertisement -

మతసామరస్యం, స్వాతంత్య్రం కోసం పోరాడింది కమ్యూనిస్టులు
ఏచూరి కృషితోనే సోషలిజం ముందుకు …
ఆయన చొరవతోనే దేశంలో ఒకే వేదికపై 28 రాజకీయ పార్టీలు : వర్ధంతి సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని


నవతెలంగాణ – నిజాంపేట్‌
‘సీతారాం ఏచూరి గురించి మాట్లాడుకోవడం అంటే మార్కిృస్టు పార్టీ గురించి మాట్లాడుకున్నట్టే’ అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌ ప్రగతినగర్‌(నిజాంపేట్‌)లోని లీలా సుందరయ్య ఫంక్షన్‌ హాల్‌లో సీతారాంఏచూరి ప్రథమ వర్ధంతి సభ జరిగింది. ఈ సభలో వీరభద్రం మాట్లాడుతూ ఏచూరి విద్యార్థి దశ నుంచే ఉద్యమాలకు నాయకత్వం వహించారని గుర్తుచేశారు. ఢిల్లీ జేఎన్‌యూలో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులను సమీకరించి, నిరసనలు చేపట్టారని తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో యూనివర్సిటీలో జరిగిన దాడులపైన ఆనాటి యూనివర్సిటీ ఛాన్స్లలర్‌ అయినా ఇందిరాగాంధీ రాజీనామా కోరుతూ ఆందోళన చేసిన ధైర్యశీలి అని చెప్పారు. సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత 1992లో పార్టీ మహాసభలో సోషలిజంపై సమగ్ర రిపోర్టు సమర్పించి, శాస్త్రీయ విశ్లేషణతో మార్గనిర్దేశం చేశారని అన్నారు. ”ప్రపంచంలో అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు క్షీణించినా, భారతదేశంలో మాత్రం సీపీఐ(ఎం) బలంగా నిలబడగలిగింది’ అని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని పార్టీలు సోషలిజం గురించి మాట్లాడుతున్నాయని, కానీ కమ్యూనిస్టులు మాత్రమే శాస్త్రీయ సోషలిజం కావాలని కోరుతున్నాయని అన్నారు. సోషలిజం ముందుకు తీసుకెళ్లడానికి సీతారాం ఏచూరి బాగా కృషి చేశారని, దాని ఫలితంగానే గత ఎన్నికల్లో బీజేపీ మతోన్మాదుల బలం తగ్గిందన్నారని తెలిపారు. సీతారాం ఏచూరి కృషి వల్ల దేశంలో 28 పార్టీలు ఒకే వేదికపైకి వచ్చాయని ఆయన తెలిపారు.

కమ్యూనిస్టు పార్టీల కలయిక అవసరమని, ఆ అభిప్రాయాలను, ప్రయత్నాలను సీపీఐ(ఎం) విభేదించడం లేదని స్పష్టం చేశారు. భారతదేశంలో అనేక మతకల్లోలలు తగాదాలు ఏర్పడినప్పుడు మతసామరస్యం కోసం, స్వాతంత్రం కోసం పోరాడింది కమ్యూనిస్టులే అని తెలిపారు. బీజేపీ మతోన్మాద శక్తుల అసలు లక్ష్యం హిందుత్వ రాజ్యమేనని అన్నారు. మనుధర్మ శాస్త్రాన్నే రాజ్యాంగంగా మలచాలని ప్రయత్నిస్తున్నారని తమ్మినేని విమర్శించారు. రాజ్యాంగంలో సోషలిజం, ప్రజాస్వామ్యం పదాలను తొలగించాలన్న బీజేపీ నేతల ప్రకటనలను తిప్పికొట్టాలన్నారు. ప్రస్తుతం రాజ్యాంగ సంస్థలు అయిన ఈడీ, సీఈడీ, సీబీఐ, ఈసీ స్వతంత్రత కోల్పోయేలా మోడీ ప్రభుత్వం చేసిందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఆధిపత్యం కారణంగానే కమ్యూనిస్టు పార్టీల బలం తగ్గిందని, ప్రజా సమస్యలపై మమేకమై పనిచేస్తే భవిష్యత్తు కాలం కమ్యూనిస్టులదేనని నమ్మకం వ్యక్తం చేశారు. ”సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి” అని తమ్మినేని వీరభద్రం అన్నారు. సెప్టెంబర్‌ 10 నుండి 17 వరకు జరగనున్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.సత్యం, మాజీ సర్పంచులు దయాకర్‌ రెడ్డి, శ్రీరాములు, జిల్లా కమిటీ సభ్యులు జె.చంద్రశేఖర్‌, ఏ.అశోక్‌, ఎం.వినోద, రాజశేఖర్‌, బి.వెంకటరామయ్య, రాథోడ్‌ సంతోష్‌, వరప్రసాద్‌, నరేష్‌, లింగస్వామి, లక్ష్మణ్‌, సబిత, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -