గ్రామపంచాయతీ ఏర్పాటుకు కృషిచేసిన నిర్మలకు విజయం
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
గెలుస్తున్నాను అనుకునే సమయంలో ఓటమి చెందిన ఆ మహిళ ఎక్కడ కూడా కృంగిపోలేదు. ఉద్యమ చరిత్ర కలిగిన ఆమె తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాటం చేసింది అంతేకాకుండా తమ గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీ గా ఏర్పాటు చేయాలని అప్పటి మంత్రి కేటీఆర్ తో పట్టు పట్టింది. ఆమె పట్టు వదలక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటి మంత్రి కేటీఆర్ తంగళ్ళపల్లి లోని పద్మా నగర్ ను ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. ప్రత్యేక గ్రామపంచాయతీ సాధించిన ఘనత ఆమెకే దక్కింది.
ఆమెనే పద్మా నగర్ కు చెందిన మోర నిర్మల. 2018లో పద్మా నగర్ ప్రత్యేక గ్రామపంచాయతీ గా ఏర్పడగా 2019లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి ఆ సమయంలో నిర్మల సర్పంచ్ పదవికి పోటీ చేసింది కానీ దురదృష్టంతో ఒకే ఒక్క ఓటుతో ఆమె ఓటమిపాలైంది. అయినా ఎక్కడ కూడా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు గ్రామ ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగింది.
ప్రస్తుత ఎన్నికల్లో నిర్మల మళ్లీ సర్పంచ్ పదవికి పోటీ చేసి 430 ఓట్లను సాధించి ఆమె సర్పంచిగా గెలుపొందింది. పద్మా నగర్ గ్రామంలో 920 మంది ఓటర్లు ఉండగా 765 ఓట్లు పోలయ్యాయి మోర నిర్మలకు 430 ఓట్లు రాగా బూర ఉష కు 307 ఓట్లు వచ్చాయి. ముడారి రాజమ్మకు 12 ఓట్లు రాగా నాలుగు ఓట్లు చెల్లకుండా పోయాయి 12 ఓట్లు నోటాకు వచ్చాయి. మోర నిర్మల సర్పంచ్ గా గెలుపొందింది. నిర్మల తంగళ్ళపల్లి మండల టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. మాజీ మంత్రి ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దగ్గర ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది.



