Saturday, September 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనిన్న ఈయూ..నేడు జీ7

నిన్న ఈయూ..నేడు జీ7

- Advertisement -

భారత్‌, చైనాలపై అధిక సుంకాలకు ట్రంప్‌ ఒత్తిడి
చర్చించనున్న జీ7 దేశాల ఆర్థిక మంత్రులు
భారత్‌తో వాణిజ్య చర్చలంటూ లీకులు.. మరోవైపు టారిఫ్‌లతో బెదిరింపులు
మారని యూఎస్‌ అధ్యక్షుడి తీరు

వాషింగ్టన్‌ : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఆపటమే లక్ష్యంగా మధ్యవర్తిత్వం వహిస్తానంటూ విఫల ప్రయత్నం చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. ఇప్పుడు ఆ అక్కసునంతా భారత్‌, చైనాలపై చూపెడుతున్నాడు. రష్యాకు ప్రధాన ఆదాయవనరు గా ఉన్న చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రెండు దేశాలుగా భారత్‌, చైనాలు ఉన్నాయి. అయితే రష్యా శాంతి చర్చల్లోకి రావాలంటే ఈ రెండు దేశాలను చమురు కొనుగోలు చేయకుండా నిరోధించాలని అమెరికా అధ్యక్షుడు భావిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్‌, చైనాలపై భారీ సుంకాలు అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ రెండు దేశాలపై వంద శాతం సుంకాలు విధించాలని యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాలను ట్రంప్‌ కోరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే రాగాన్ని ఆయన జీ7 దేశాల ముందు వినిపించనున్నారు. భారత్‌, చైనాలపై అధిక టారిఫ్‌లు విధించాలని జీ7 దేశాలపై ట్రంప్‌ ఒత్తిడి తేనున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా యూఎస్‌ ప్రతిపాదనలపై జీ7 దేశాల ఆర్థిక మంత్రులు వీడియో కాల్‌లో చర్చించనున్నట్టు సమాచారం. ఉక్రెయిన్‌ ప్రజలను చంపుతున్న పుతిన్‌ చేసే యుద్ధ వ్యూహానికి భారత్‌, చైనాలు జరుపుతున్న రష్యా చమురు కొనుగోళ్లు నిధులను సమకూరుస్తున్నాయని యూఎస్‌ ట్రెజరరీ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. ”ఈ విషయంలో మేము ఇప్పటికే మా ఈయూ భాగస్వాములకు స్పష్టం చేశాం. యుద్ధానికి ముగింపు పలికే విషయంలో సీరియస్‌గా ఉంటే మాతో చేతులు కలపాలన్నాం. ఇందుకు అర్థవంతమైన సుంకాలు విధించాలని చెప్పాం. ఇందుకు అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధంగా ఉన్నది. మా జీ7 భాగస్వాములు కూడా మాతో అడుగేయాల్సిన అవసరం ఉన్నది” అని సదరు వ్యక్తి చెప్పారు. అయితే ఈ టారిఫ్‌ రేంజ్‌ ఎంత ఉంటుందన్న విషయాన్ని చెప్పటానికి అధికార ప్రతినిధి నిరాకరించారు. అయితే అనధికారిక సమాచారం ప్రకారం ఇది 50 నుంచి 100 శాతంగా ఉంటుందని తెలుస్తోంది.

మోడీ మిత్రుడంటూనే భారత్‌పై టారిఫ్‌లకు ట్రంప్‌ పట్టు
భారత ప్రధాని మోడీ ఒక మంచి మిత్రుడనీ, భారత్‌తో వాణిజ్య అడ్డంకులు తొలగించేందుకు చర్చలు నడుస్తాయని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో పేర్కొన్న కొన్ని రోజులకే తాజా కథనాలు రావటం గమనార్హం. రష్యా నుంచి చమురు కొనుగోలును కారణంగా చూపుతూ ట్రంప్‌.. భారత్‌పై 50 శాతం అధిక సుంకాలను విధించిన విషయం విదితమే. అటు చైనాపైనా ఏప్రిల్‌లో సుంకాలను అధికంగా పెంచేసిన ట్రంప్‌.. ఆ తర్వాత మార్కెట్‌లో ఎదురుదెబ్బ తర్వాత వాటిని తగ్గించారు. టారిఫ్‌లు విధించాలని ట్రంప్‌ చేసిన సూచనకూ ఈయూ దేశాల నుంచీ వ్యతిరేకతే వచ్చింది. ఆంక్షలు, టారిఫ్‌లు వేర్వేరనీ, ఆసియాలో రెండు ప్రధాన దేశాలపై సుంకాలు విధిస్తే ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుందని ఈయూ దేశాల వాదన. ఒకవైపు భారత్‌తో వాణిజ్య చర్చలంటూనే.. మరోవైపు తన మిత్రదేశాలనూ భారత్‌పై టారిఫ్‌లు విధించాలని ట్రంప్‌ ఒత్తిడి తేవటం చర్చనీయాంశంగా మారుతున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -