పదవి కంటే సేవే ముఖ్యం
– మాజీ సర్పంచ్ శివశంకర ప్రసాద్
నవతెలంగాణ – అశ్వారావుపేట
“సేవ చేయాలన్న సంకల్పం ఉంటే పదవి పెద్దదా… చిన్నదా అన్నది అప్రస్తుతం” అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు వేదాంత పురం మాజీ సర్పంచ్ సోని శివశంకర ప్రసాద్. నాడు సర్పంచ్ గా ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన ఆయన, నేడు అదే పంచాయితీలో 8 వ వార్డు సభ్యుడిగా ప్రజల ముందుకు రావడం వెనుక నిస్వార్థ సేవాభిలాషే కారణం అని స్పష్టమవుతోంది.
సాధారణంగా వార్డు సభ్యుడిగా ప్రారంభమైన రాజకీయ ప్రయాణం ఉపసర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వైపు ఎదగడం సహజం.కానీ సర్పంచ్ పదవి చేపట్టి మళ్లీ వార్డు సభ్యుడిగా పోటీ చేయడం వెనుక గట్టి ఆశయం, సేవ పై అచంచలమైన నిబద్ధత ఉంటే తప్ప సాధ్యపడదనే చెప్పాలి.ఆ కోవలోకే వస్తారు శివశంకర ప్రసాద్.
ఆసుపాక పంచాయితీ పరిధిలోని వేదాంతపురాన్ని 2018లో అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం నూతన పంచాయితి గా ఏర్పాటు చేసింది. 2011 జనగణన ప్రకారం 674 జనాభా, 407 ఓటర్లు, 8 వార్డులతో ఈ పంచాయితీ ఏర్పడింది. తొలి ఎన్నికల్లో సర్పంచ్ స్థానం ఎస్టీ(పు/స్త్రీ) రిజర్వేషన్ కావడంతో చదువుకున్న యువకుడైన శివశంకర ప్రసాద్ సర్పంచ్ గా బరిలోకి దిగి విజయం సాధించారు.ఆయన పాలనలో పంచాయితీలో అనేక దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో సర్పంచ్ స్థానం ఎస్టీ (స్త్రీ)కి రిజర్వ్ కావడంతో ఆయనకు ప్రత్యక్ష అవకాశం లేకపోవడంతో, తన సమీప బంధువు, వరుసకు సోదరి అయిన తోట వెంకటమ్మ ను సర్పంచ్ అభ్యర్థిగా నిలిపి,తాను 8 వ వార్డు సభ్యుడిగా బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో మంగళవారం నవతెలంగాణ ప్రతినిధితో మాట్లాడిన శివశంకర ప్రసాద్..
“స్వంతూరు పై మక్కువ, ప్రజాసేవ చేయాలనే తపన తోనే నేను మళ్లీ వార్డు సభ్యుడిగా బరిలో నిలిచాను. గెలిచినా సాధారణ సభ్యుడి గానే పనిచేస్తాను. గతంలో ఉపసర్పంచ్ పదవిని విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కాశీ కాలాస్త్రీ కి ఇచ్చాం. ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందిన సంగీత వీర్రాజు కు ఇవ్వాలని నిర్ణయించాం. మా గ్రామ ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా ప్రజా సేవే నా లక్ష్యం” అని స్పష్టం చేశారు. పదవి కంటే సేవే గొప్పదని నిరూపిస్తున్న ఈ అడుగు నిజమైన సేవా దృక్పథానికి అద్దం పడుతోంది.



