పేరుకు దిగ్గజ కంపెనీ.. చేసేవన్నీ చట్టవిరుద్ధ పనులు
ఫంక్షన్ హాల్‌పై దాడి చేసిన నార్కోటిక్ అధికారులు
కన్నెత్తిచూడని పీసీబీ, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు
కాలుష్య జలాలకు మూగజీవాలు మృత్యువాత
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పేరుకు దిగ్గజ కంపెనీ.. పేరుప్రతిష్టలకు డోకాలేదు.. కానీ చేసే పనులన్నీ చట్టవిరుద్ధమైనవే.. ఆ కంపెనీ ఏదో కాదు.. హెటిరో ఫార్మా పరిశ్రమ.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం గడ్డపోతారంలోని ఈ కంపెనీ.. వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పరిశ్రమ నుంచి వ్యర్థాలను దోమడుగు నల్లకుంట చెరువులోకి విడుదల చేయడంతో నీరు కలుషితమైందని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించి మమ అనిపించారు. భూగర్భజలాలు సైతం కలుషితం కావడంతో స్థానికులు తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. చర్మవ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు నరకం అనుభవిస్తున్నా పీసీబీ, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మాత్రం హెటిరో జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ కంపెనీ ఆడిటింగ్ నుంచి తప్పించుకునేందుకు కెమికల్ డ్రమ్ములను అక్రమంగా నిల్వ చేసిన వాటిపై నార్కోటిక్ అధికారులు దాడిచేశారు.
అక్రమంగా కెమికల్ డ్రమ్ముల నిల్వ..
ఫంక్షన్ హాలులో కెమికల్ డ్రమ్ములను అక్రమంగా నిల్వ చేస్తున్నా.. హెటిరో తమకున్న రాజకీయ పలుకుబడితో అధికార యంత్రాంగాన్ని భయబ్రాంతులకు గురిచేస్తూ నిజాలు బయటకు రాకుండా చూస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యర్ధ జలాలు, కెమికల్ వ్యర్థాలను శుద్ధి చేయడానికి కర్మాగారానికి తరలించాల్సి ఉండగా ప్రమాదకరమైన కెమికల్స్‌ను అక్రమంగా నిల్వ ఉంచి రాత్రివేళ కాల్వలు, పొలాల్లోకి డంప్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకున్న పరిమితికి మించి ప్రొడక్షన్ చేయడం ఒక కారణమైతే, శుద్ధి కర్మాగారానికి తరలిస్తే ఖర్చు ఎక్కువ రావడంతోపాటు తమ బండారం బయటపడుతుందని ఆక్రమంగా వ్యర్థాలను నిల్వచేసి గుట్టుచప్పుడు కాకుండా ఖాళీ ప్రదేశాల్లో వదులుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రసాయన డ్రమ్ములను నిల్వ ఉంచిన ఫంక్షన్ హాలుకు రూ.లక్షల్లో అద్దెలు చెల్లిస్తున్నట్టు తేలింది.
ఆడిటింగ్ కోసమే అక్రమ నిల్వ.. దాడిచేసిన నార్కోటిక్ అధికారులు
పారిశ్రామిక వాడలో చాలా రసాయన పరిశ్రమలు తమ అనుమతికి మించి ప్రొడక్షన్ చేయడంతోపాటు గుట్టుచప్పుడు కాకుండా ఇతర రకాల కెమికల్స్‌ను తయారు చేస్తున్నాయనే సమాచారంతో నార్కొటిక్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారానికి స్థానిక అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని, ఆడిటింగ్ సమయాల్లో మాత్రం స్టాక్స్‌ను గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలిస్తారని తెలుస్తున్నది. హెటిరోలో ఆడిటింగ్ జరగాల్సి ఉందని అందుకోసమే అక్రమంగా తయారు చేస్తున్న కెమికల్స్‌ను బయట ప్రదేశంలో నిల్వచేశారని చేసినట్టు సమాచారం.
మూగజీవాల మృత్యుఘోష..
సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామంలో మూగజీవాల మృత్యుఘోష వినిపిస్తోంది. రసాయన వ్యర్థ జలాల కారణంగా పాడి పోషణ చేస్తూ బతికే రైతు కుటుంబాలకు తీరని నష్టం వాటిల్లుతోంది. చింతల శ్రీధర్‌కు నల్లకుంట చెరువు పై భాగంలో పశువుల కొట్టం ఉంది. కొన్నేండ్లుగా పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు 18 బర్రెలు ఉండగా అందులో ఇప్పటికే 8 చనిపోయాయి. కాలుష్య జలాలే ఇందుకు కారణమని తెలిపారు. ప్రతి సంవత్సరం 10 దూడలు జన్మిస్తాయని, ఇందులో ఒక్కటి బతికితే అదే గొప్ప అన్నట్టుగా పరిస్థితి మారిందని అన్నారు.
చెరువు నీళ్లతోపాటు భూగర్భజలాలు పూర్తిగా కలుషితమవడంతోనే జీవాలు చనిపోతున్నాయని, ఎంతమందికి ఫిర్యాదు చేసినా పట్టించునేవారే కరువయ్యారని శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో పాటు మూగజీవాల ప్రాణాలు తీస్తున్న హెటీరో పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన దూడల తోలుతో మరుగేదెల రూపంలో తయారు చేసిన బొమ్మలను పెట్టి పాలు పిండుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.