Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవైఐఐఆర్‌సీ మొదటి విడతలో బాలికలకు ప్రాధాన్యం

వైఐఐఆర్‌సీ మొదటి విడతలో బాలికలకు ప్రాధాన్యం

- Advertisement -

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనంపై కసరత్తు
వచ్చే విద్యా సంవత్సరం ఆరంభానికి నగరంలో నూతన పాఠశాలలు
ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలకు తగినట్టు సిలబస్‌ : విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (వైఐఐఆర్సీ)లో మొదటి విడతలో బాలికలకు అధిక ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న మూడేండ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు, బాలికలకు ఒక్కొక్కటి చొప్పున వైఐఐఆర్‌సీ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం బాలికలకు స్కూల్స్‌ కేటాయించిన నియోజకవర్గంలో మరో విడతలో బాలురకు కేటాయించాలని తెలిపారు. విద్యాశాఖపై గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్షించారు. వైఐఐఆర్‌సీలో సోలార్‌ కిచెన్ల నిర్మాణాన్ని పీఎం కుసుమ్‌లో చేపట్టే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు.

వైఐఆర్‌ఆర్‌సీల నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కొడంగల్‌ నియోజక వర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. తగినంత స్థలం, అవసరమైన మద్దతు అందజేస్తే పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయగలమని అక్షయపాత్ర ప్రతినిధులు సీఎంకు తెలియజేశారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ఏర్పాటు చేసి అందరికీ సకాలంలో భోజనం అందేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ఏర్పాటుకు రెండెకరాల స్థలం కేటాయింపు లేదా 99 సంవత్సరాలకు లీజు తీసుకునే అంశంపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడి త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌ రామకృష్ణారావుకు ముఖ్యమంత్రి సూచించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 23 నూతన పాఠశాల భవనాల నిర్మాణాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. బాచుపల్లి పాఠశాల స్థలం కేవలం అర ఎకరం మాత్రమే ఉండడంపై ఆయన ఆరా తీశారు. ఎక్కడైనా పాఠశాలకు కనీసం ఎకరంన్నర స్థలం ఉండాలనీ, బాచుపల్లి ప్రస్తుతం ఉన్న స్థలం సమీపంలో ఎకరంన్నర స్థలాన్ని ఆ పాఠశాల నిర్మాణానికి కేటాయించాలని అన్నారు. ప్రస్తుత, భవిష్యత్‌ అవసరాలకు తగినట్టు ఒకటి నుంచి పదో తరగతి వరకు సిలబస్‌ మార్పుపై కసరత్తును వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం పనులు వేగవంతం చేయాలని సూచించారు.

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో నూతన కోర్సులు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం చేసుకున్నందున దానిని త్వరగా అమలయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. పాలిటెక్నిక్‌ కళాశాలలు, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి కచ్చితంగా ఉద్యోగం లభించేలా సిలబస్‌, బోధన ఉండాలని సీఎం అన్నారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, పి.సుదర్శన్‌ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ వి.శేషాద్రి, సీఎం స్పెషల్‌ సెక్రెటరీ బి.అజిత్‌ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌, ఉస్మానియా విశ్వ విద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ మొలుగారం కుమార్‌, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ వి.ఎల్‌.వి.ఎస్‌.ఎస్‌. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్‌ పాలసీ : సీఎం
నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ తరహాలో త్వరలోనే తెలంగాణ ఎడ్యుకేషన్‌ పాలసీని తీసుకురానున్నట్టు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ఒక కమిటీని నియమించినట్టు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని హిమాచల్‌ ప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి రోహిత్‌ కుమార్‌ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా విద్యా శాఖ కమిషనర్‌ యోగితా రాణా, పాఠశాల విద్య డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌, సీఎం స్పెషల్‌ సెక్రెటరీ అజిత్‌ రెడ్డి, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకు వస్తున్న సంస్కరణలు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు వివరాలను హిమాచల్‌ ప్రదేశ్‌ మంత్రికి సీఎం వివరించారు.

25 ఎకరాల సువిశాల స్థలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకే చోట మినీ యూనివర్సిటీ తరహాలో రూ.200 కోట్లతో రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నట్టు చెప్పారు. ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు వీలుగా ప్రీ ప్రైమరీ విద్య అందించే విధానం అమలు చేయనున్నట్టు వివరించారు. మల్లెపల్లి ఐటీసీని సందర్శించాలని హిమాచల్‌ ప్రదేశ్‌ మంత్రికి సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణంపై హిమాచల్‌ ప్రదేశ్‌ విద్యామంత్రి ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఈ స్కూల్స్‌ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర నివేదికను తమకు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టతకు ముఖ్యమంత్రి విజన్‌ను రోహిత్‌ కుమార్‌ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -