రైతు నాయకుల గృహ నిర్బంధం
ఖండించిన సీపీఐ(ఎం)
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించడానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు నిరసనలు వ్యక్తమవుతాయని భయపడి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లో రైతు సంఘాల నాయకులను గృహ నిర్బంధించింది. వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించడానికి ప్రధాని మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ఉదయం గ్రేటర్ నోయిడాకు వెళ్లినప్పుడు కలెక్టరేట్ ముందు పెద్ద నిరసన నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఈ చర్యను అడ్డుకోవటానికి, యూపీ పోలీసులు ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) జిల్లా అధ్యక్షుడు రూపేశ్ వర్మ, కిసాన్ ఏక్తా సంఫ్‌ు జాతీయ అధ్యక్షుడు సురాన్ ప్రధాన్, భారతీయ కిసాన్ పరిషత్ జాతీయ అధ్యక్షుడు సుఖ్‌బీర్ ఖలీఫా వంటి నాయకులను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గృహ నిర్బంధంలో ఉంచారు.
2024 నిరసనకు రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవడం, కొత్త వ్యవసాయ చట్టాల ఆలోచన విరమించుకోవాలని, భూసేకరణకు తగిన పరిహారం ఇవ్వాలని వంటి డిమాండ్లను లేవనెత్తుతూ గురువారం ఉదయం కలెక్టరేట్ ముందు భారీ నిరసనను నిర్వహించాలని రైతు సంఘాలు నిర్వహించాయి. దేశంలోని, ఇతర దేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు పాల్గొనే సమావేశం నిర్వహించినప్పుడు రైతుల నిరసనలతో ఎదురుదెబ్బ తగులుతాయని గ్రహించిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రైతు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచింది.రూపేశ్ వర్మ, ఇతర రైతు నాయకులను నిరసనలకు భయపడిగృహ నిర్బంధించడం యూపీలోని బీజేపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పిరికితనానికి నిదర్శనమని సీపీఐ(ఎం) విమర్శించింది. మోడీ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతుండగా, కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలకు ఎర్ర తివాచీ పరవడాన్ని విమర్శించింది. రైతు నేతల అక్రమ గృహ నిర్బంధాన్ని సీపీఐ(ఎం) ఖండించింది.