‘భారత ప్రజాస్వామ్యం’పై మీ లెక్చర్ వద్దు
‘కారవాన్’ మాజీ ఎడిటర్‌కు ఆహ్వానం రద్దు
కేరళలోని ఓ ప్రముఖ కళాశాల తీరు
కార్యక్రమానికి రెండ్రోజుల ముందు ఈ నిర్ణయం
దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు : వినోద్ కె. జోస్ ప్రతిస్పందన
తిరువనంతపురం : కేంద్రంలోని మోడీ పాలనలో భారత ప్రజాస్వామ్య స్థితిగతులపై మాట్లాడాలంటే సాహసం చేయాల్సిన పరిస్థితులు దేశంలో ఏర్ప డ్డాయి. కేంద్రాన్ని ప్రశ్నించినా, ప్రజా స్వామ్యం ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తినా.. అలాంటి వారికి ఎలాంటి వేదికా దొరకదు. కేరళలోని ఓ ఘటనే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. భారత ప్రజాస్వామ్య స్థితిగతులపై మాట్లాడా లంటూ ఓ సీనియర్ జర్నలిస్టును ఆహ్వానించిన ప్రముఖ విద్యా సంస్థ సెయింట్ థామస్ కాలేజీ.. ఆ తర్వాత ఆయనను ‘వివాదాస్పద వ్యక్తి’ పేర్కొంటూ ఆ ఆహ్వానాన్ని ఉపసంహరించుకుంది. ఈ ఘటన స్వయంగా భారత ప్రజాస్వామ్య పరిస్థితిని ప్రతిబింబిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాళ్లోకెళ్తే.. కేరళ లోని పాలాలో గల ప్రతిష్టాత్మక సెయింట్.థామస్ కాలేజీ నిర్వహించే టి.సి.థామస్ ఎండోమెంట్ మెమోరియల్ లెక్చర్‌కు క్యారవాన్ మాజీ సంపాదకుడు, వాయనాడ్ లిటరేచర్ ఫెస్టివల్ వ్యవస్థాపకులు వినోద్ కె.జోస్‌ను ఆహ్వానించారు. ‘భారత ప్రజాస్వామ్య స్థితి’ అనే అంశంపై ఆయన మాట్లాడాల్సి ఉన్నది. కానీ కార్యక్రమానికి రెండ్రోజుల ముందు.. ఆయనను ‘వివాదాస్పద వ్యక్తి’గా పేర్కొంటూ కాలేజీ యాజమాన్యం ఆయన ఉపన్యాసాన్ని రద్దు చేసింది.
ఈ నిర్ణయంపై వినోద్ జోస్ స్పందించారు. ”నన్ను మాట్లాడ నివ్వకుండానే, భారత ప్రజాస్వామ్య స్థితి ఏమిటో ఈ సంఘటనే వివరించింది” అని ఆయన సోషల్ మీడియాలో వివరించారు. తాను పాలా వెళ్లాల్సిన అవసరం లేకపోవడం ఒక చిన్న ఉపశమనమే అయినా ఈ రద్దే తన ఉపన్యాసమని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కాలేజీ రాజకీయ శాస్త్ర విభాగం రెండు నెలల క్రితమే ఆహ్వానం ఇచ్చిందనీ, తేదీ, అంశం ఎంపికలో పూర్తి స్వేచ్ఛ కల్పించిందని జోస్ తెలిపారు. తాను సూచించిన రెండు అంశాలలో ‘భారత ప్రజస్వామ్య పరిస్థితి’ని మాత్రమే విభాగం ఎంపిక చేసిందని వివరించారు. కాలేజీ యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని జోస్ ఆరోపించారు. ఆరెస్సెస్-బీజేపీ లైన్‌కు అనుగుణంగా ఆలోచనలను అణచి వేయడం, కేరళలో పట్టు సాధించాలనే వ్యూహం.. ఇవన్నీ ఈ సంఘటనలో ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు.
కాలేజీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రద్దు భయం?
కాలేజీ వర్గాల సమాచారం ప్రకారం… కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌లు రద్దు చేస్తున్నది. దీంతో అంతర్జాతీయ విరాళాలు దెబ్బతింటాయన్న భయం ఇలాంటి విద్యా సంస్థల్లో ఉన్నది. అంతేకాదు.. ప్రభుత్వ విమర్శకుల్ని వేదికపైకి అనుమతిస్తే సమస్యలు వస్తాయన్న ఆందోళ కూడా కాలేజీ యాజమన్యానికి ఉన్నదని తెలుస్తున్నది. ఈ కారణాలే ఈ నిర్ణయానికి దారి తీసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై కాలేజీ ప్రిన్సిపాల్ సి.బి జేమ్స్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.



