Thursday, March 19, 2026
E-PAPER
Homeమానవిమీకు మీరే ఓ కోట... మీరే ఓ రక్ష‌ణ‌

మీకు మీరే ఓ కోట… మీరే ఓ రక్ష‌ణ‌

- Advertisement -

ఇటీవలె అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఈ సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు స్త్రీల జీవితాల గురించి మాట్లాడారు. వివిధ పత్రికల్లో, ఛానళ్లలో తమ భావాలను పంచుకున్నారు. అలా నటి, రచయిత్రి సోహా ఆలీ ఖాన్‌ కూడా తన అనుభవాల నుండి ఎన్నో విషయాలు చెప్పారు. సమాజంలో మహిళల వాస్తవ జీవితాలు, ఎదుర్కొంటున్న వివక్ష, కంటికి కనిపించని స్త్రీల శ్రమ గురించి వివరిస్తూనే ప్రతి మహిళ తనకు తానే ఒక కోటగా, రక్షణగా ఉండాల్సిన అవసరం గురించి ప్రస్తావించారు. ఆ వివరాలు నేటి మానవిలో…

సోహా అలీ ఖాన్‌ను కలిసినప్పుడు ఏదో ఓ ప్రశాంతత నెలకొంటుంది. ఆమెలోని ఒక నిశ్శబ్దమైన హుందాతనం వేదికను ప్రకాశవంతం చేస్తుంది. తాను ఏమి చేయాలో తెలిసిన, దాని గురించి మాట్లాడటానికి భయపడని వ్యక్తి. క్రికెట్‌ దిగ్గజం మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్‌ల కుమార్తె, నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ చెల్లెలు, కరీనా కపూర్‌కు వదిన మాత్రమే కాక ఓ నటిగా, రచయిత్రిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది ఆమె మాట్లాడే ప్రతి మాటలో మనకు అగుపిస్తుంది.

మరింత సవాలుతో కూడుకున్నది
భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ కుటుంబంలో ఆమె పుట్టారు. కానీ ఆమె మాట్లాడటం ప్రారంభించినప్పుడు మనల్ని ఎక్కువగా ఆకట్టుకునే విషయం ఏమిటంటే, ఆమె తనదైన మార్గాన్ని ఏర్పరచుకోవడం. ‘ఇలా ఉండటానికి ఒకరకమైన అంతర్గత బలం, స్థైర్యం అవసరం. ఎందుకంటే నేను సోషల్‌ మీడియా లేని కాలంలో పెరిగాను. నేటి ప్రపంచం మరింత సవాలుతో కూడుకున్నదని నేను భావిస్తున్నాను. సాధారణంగా అందరిలా మనమూ ఉండాలనే ఒత్తిడి చాలా ఉంటుంది. వాళ్లలా చేయాలనే కోరికతో కొన్నిసార్లు మనలోని అంతర్గత కాంతిని మనమే మసకబార్చుకుంటాం. అయితే ‘అది నేను కాదు. నేను అంటే ఇదే’ అని చెప్పగలగడానికి చాలా ధైర్యం, స్థైర్యం కావాలి’ అంటారు సోహా.

వారసత్వ భారం
చాలా మందికి సూపర్‌స్టార్లతో పాటు కలిసి ఎదగడం అనేది ఒకరకమైన ఒత్తిడితో కూడుకున్నది. కానీ సోహాకు చదువు ఓ ఆసరాగా నిలిచింది. ‘మీరు పదేళ్లపాటు భారత కెప్టెన్‌గా ఉండబోరని లేదా మూడుకు పైగా భాషల్లో పనిచేసే జాతీయ అవార్డు గ్రహీత నటిగా ఉండబోరని తెలిసినప్పుడు, ఆ ఒత్తిడి వెంటనే తొలగిపోతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు సంతోషంగా ఉండటంపై, మీకు ఆనందం, సంతోషం కలిగించే పనులను చేయడంపై దృష్టి పెట్టాలి. ‘ఇది చెయ్యి, అది చెయ్యి’ అని చెప్పే జన సమూహానికి ఎదురు నిలబడి, నిజంగా మీ హృదయాన్ని అనుసరించే అంతర్గత స్థైర్యాన్ని నింపుకోండి’ అంటూ ఆమె మహిళలకు చెబుతున్నారు.

చదువే ఆసరా…
తనకు ఓ ఆసరాగా నిలిచింది విద్యేనని ఆమె అంటున్నారు. సోహా ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారు, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుండి మాస్టర్స్‌ డిగ్రీని పొందారు. ‘నా విద్యా నేపథ్యం వల్ల నాకున్న వంశపారంపర్యతను చూసి నా కుటుంబం నన్ను గౌరవిస్తుంది. మా అమ్మ యూనివర్సిటీకి వెళ్ళలేదు. మా నాన్న ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్ళినా ఎప్పుడూ క్రికెట్‌ పిచ్‌పైనే ఉండేవారు. మా సోదరుడు వెళ్ళలేదు. ఇవి వారిని వెనక్కి లాగిన విషయాలు కావు, కానీ నాకున్న అనుభవాలను వారు అభినందిస్తారు’ అని ఆమె అన్నారు.

వృద్ధాప్యం గురించి
వృద్ధాప్యం గురించి సోహా నిర్మొహమాటంగా మాట్లాడారు. కాస్మెటిక్‌ సర్జరీని ఆమె వ్యతిరేకించారు. ‘వృద్ధాప్యం అనేది నేను ప్రతిరోజూ ఎదుర్కొనే సమస్య. ఎందుకంటే నా అందం పట్ల నాకు అహంభావం ఎక్కువ. ‘నీ ముఖం మీద ముడతలు, పొడి చర్మం, నిద్రలేమి.. వృద్ధాప్యంతో వచ్చే ఈ సమస్యలన్నీ ఉండటం అద్భుతం’ అని ఎవరూ మనతో అనరు కదా’ అని ఆమె ఒప్పుకున్నారు. అయితే ఆమె కాస్మెటిక్‌ సర్జరీ విషయంలో గట్టిగా విభేదిస్తుంది. దానికి కారణం వ్యక్తిగతమైనది. ప్రతి ఒక్కరూ ఆమెను తన తల్లిలా కనిపిస్తుందని అంటారు. ఆమెకు తన తండ్రి ముక్కు, ముఖ కవళికలు వచ్చాయి. ‘ఇప్పుడు నా జీవితంలో ఆయన లేరు. కానీ ఇది నాకు గుర్తుంది. నా రూపంలో ఆయన ఒక భాగం అయినందుకు నేను గర్వపడతాను. నేను దాన్ని మార్చుకోవాలనుకోవడం లేదు. ఇతరుల నుండి ఆమోదం కోసం ఎదురుచూడటానికి ముందు, మీరు మీలా ఉన్నారని భావించడం, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తాను’ అంటారు ఆమె. అయితే ఇది ఒక పోరాటమేనని ఆమె అంగీకరిస్తున్నారు.

కనిపించని భారం
తాను పనిలో ఉన్నప్పుడే అత్యంత ప్రశాంతంగా ఉంటానని చెప్పడానికి సోహా ఏమాత్రం సంకోచించలేదు. ఎందుకంటే అక్కడ ఆమె దృష్టి పెట్టడానికి ఒకే ఒక విషయం ఉంటుంది. అది తన ఉద్యోగం. పని మాత్రమే కాకుండా ఆమె జీవితం చాలా బిజీగా ఉంటుంది. కూతురు ఇనాయా, భర్త కునాల్‌ ఖేము, అత్తమామలు, పిల్లల ఆటలు, స్కూల్లో పేరెంట్‌ టీచర్‌ సమావేశాలు, ఇంకా తన ‘ఆల్‌ అబౌట్‌ హర్‌’ అనే పాడ్‌కాస్ట్‌ను నిర్వహించడం వంటి పనులతో ఆమెకు ప్రశాంతమైన క్షణం దొరకడం చాలా అరుదు. ‘చాలా మంది మహిళలు ఇప్పటికీ మోస్తున్న ఒక పెద్ద కనిపించని భారం ఉందని నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులుగా పురుషులు ఉండరని దీని అర్థం కాదు. కానీ ఇది మహిళలకు, మేము చేసే పనికి అన్యాయం చేస్తుందని నేను భావిస్తున్నాను’ అని ఆమె అంటున్నారు. దీన్ని తాను బాధితురాలు కాకుండా ఆమె జాగ్రత్త పడుతున్నారు.

సోహా పాడ్‌కాస్ట్‌
పేరు పెట్టని విషయాలకు పేరు పెట్టాలనే అవసరం నుండే సోహా పాడ్‌కాస్ట్‌ పుట్టిందని ఆమె చెబుతున్నారు. నేను ‘ఆల్‌ అబౌట్‌ హర్‌’ ప్రారంభించడానికి గల ఏకైక కారణం, నేను సామూహిక శక్తిని నమ్మడమే. ప్రజలందరూ ఒక సురక్షితమైన ప్రదేశంలో, ఎలాంటి వడపోత లేకుండా, తీర్పులు చెప్పకుండా ఒకచోట చేరడం. మీరు చెప్పేదానితో వాళ్ళు ఏకీభవించకపోయినా, మిమ్మల్ని అడ్డుకోనంత వరకు అది ఫర్వాలేదు. మనం ఎప్పుడూ ఒకే అభిప్రాయంతో ఉండలేం కదా’ అంటారు సోహా.

మనపై మనకు నమ్మకం
ఇనాయా చిన్నగా ఉన్నప్పుడు, సోహా షూటింగ్‌లకు వెళ్లాల్సి వస్తే క్షమాపణలు చెప్పేది. కొన్నాళ్లకు చెప్పడం మానేసింది. ‘నేను ఇలా అన్నాను: నేను చేస్తున్న పనిని నేను నిజంగా ఆస్వాదిస్తున్నాను కాబట్టే వెళ్తున్నాను. నీకు నచ్చినది చేసే స్వేచ్ఛనిచ్చే ఉద్యోగం ఎప్పటికైనా దొరుకుతుం దని నేను ఆశిస్తున్నాను’ అంటున్నారు ఆమె. మీకు అండగా నిలిచే వ్యక్తులు, మీ చెవిలో వినిపించే మాటలు, మిమ్మల్ని ప్రోత్సహించే సమాజం. ఆమె వీటన్నింటినీ నమ్ముతుంది. కానీ ప్రతి వలయం కింద మనపై మనకు ఉండే నమ్మకం ఉంటుందని, మన చుట్టూ ఎవరున్నా అది ముఖ్యమని ఆమె అంటున్నారు. ‘ఏది ఏమైనా మీరే మీ కోటగా ఉండాలి. మిమ్మల్ని మీరే రక్షించు కోవాలి’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.

ఉద్యోగం చేసే తల్లంటే...
పిల్లల పెంపకం విషయానికి వస్తే సోహా నిజాయితీగా ఉంటారు. ఎల్లప్పుడూ మరింత మెరుగ్గా చేయడానికి కట్టుబడి ఉంటారు. పిల్లలు స్పాంజిలాంటి వారని, వారు ఇంటి వాతావరణాన్ని, దానిలోని ప్రతి అంశాన్ని గ్రహిస్తారని ఆమె నొక్కి చెబుతున్నారు. ఆమెకు తన చిన్ననాటి జ్ఞాపకంగా అమ్మ పనికి వెళ్లడం గుర్తుంది. తండ్రి ఇంట్లోనే ఉండేవారు. షర్మిలా ఠాగూర్‌ షూటింగ్‌కు వెళ్లిన సాయంత్రాలలో ఆమె భర్త అనుమతి అడగాల్సి వచ్చేది. ఉద్యోగం చేసే తల్లంటే కలలు కనే తల్లి అని, అంతేగానీ కలలు కనని తల్లి కాదని సోహా అర్థం చేసుకుంటూ పెరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -