ట్రంప్‌ను హెచ్చరించిన వాణిజ్యశాఖ మాజీ మంత్రి రైమాండో
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న విదేశీ వాణిజ్య విధానంపై వాణిజ్య శాఖ మాజీ మంత్రి గినా రైమాండో మండిపడ్డారు. భారత్ సహా కీలకమైన అంతర్జాతీయ భాగస్వాముల విషయంలో పెద్ద తప్పు చేస్తున్నారని హెచ్చరించారు. కెన్నెడీ స్కూలుకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అమెరికాను ట్రంప్ ఒంటరిని చేశారని, దీంతో అంతర్జాతీయ వ్యవహారాలలో తమ ప్రభావం బలహీనపడిందని చెప్పారు. ‘భారత్ విషయంలో మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాము. ట్రంప్ ప్రభుత్వం మన భాగస్వాములందరినీ వదులుకుంటోంది. అమెరికా ఫస్ట్ అనేది ఒకటి. అమెరికా అలోన్ అనేది వినాశకర విధానం’ అని తెలిపారు. అమెరికా అవలంబిస్తున్న ప్రస్తుత విధానాలు కీలక ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాలను దూరం చేస్తోందని విమర్శించారు.
ఇప్పుడు యూరప్ నుంచి జపాన్ వరకూ ప్రపంచ దేశాలకు అమెరికా మంచి స్నేహితుడు కాదని, అది బలహీన అమెరికాగా మారిందని ఆమె వ్యాఖ్యానించారు. సమర్ధవంతమైన అంతర్జాతీయ కార్యకలాపాలలో బలమైన భాగస్వాములు ఉండాలే తప్ప ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. యూరప్ లేదా ఆగేయాసియా దేశాలతో బలమైన సంబంధాలు లేకుండా సమర్ధ వంతంగా వ్యవహరించలేమని అభిప్రాయపడ్డారు. యూరప్‌తో పటిష్టమైన వాణిజ్య సంబంధాలు కలిగి ఉండాలని ఆమె ఆకాంక్షించారు. భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు అహంకారం, గర్వం పనికిరావని సూచించారు. అందరూ మన వద్దకే రావాలని కోరుకోవడం సరికాదని, అది జరిగే పనికాదని చెప్పారు. యూరప్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగేయాసియా దేశాలతో చైనా సత్సంబంధాలు కొనసాగిస్తోందని రైమాండో గుర్తు చేశారు. కాగా జో బైడెన్ ప్రభుత్వంలో ఆమె వాణిజ్య మంత్రిగా పనిచేశారు.



