Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంగడువు దాటినా ఫైల్‌ చేయొచ్చు

గడువు దాటినా ఫైల్‌ చేయొచ్చు

- Advertisement -

క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై
సుప్రీంకు తెలియచేసిన ఈసీ
పేర్లు తొలగించాలని కోరే అభ్యర్ధనలే వెల్లువెత్తుతున్నాయన్న ఈసీ
ఓటర్లకు అవగాహనకై లీగల్‌ వలంటీర్లను ఏర్పాటు చేయండి
బీహార్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ : బీహార్‌ ముసాయిదా జాబితా నుంచి పేర్లను తొలగించాలని లేదా బహిష్కరించాలని కోరుతూ వచ్చిన అభ్యర్ధనలు పేర్ల పునరుద్ధరణ కోసం వచ్చిన క్లెయిమ్‌ల కన్నా ఆగస్టు 22 నుండి 30వ తేదీ మధ్య కాలంలో దాదాపు ఆరు రెట్లు పెరిగాయని ఎన్నికల కమిషన్‌ సోమవారం సుప్రీం కోర్టుకు తెలియచేసింది. ఈ మేరకు ఒక నోట్‌ను అందచేసింది. ఆధార్‌ను సుప్రీం కోర్టు అనుమతించిన ఈ వారం రోజుల వ్యవధిలో పేర్లను చేర్చాలని కోరే వారు కన్నా తొలగించాలని కోరేవారే ఎక్కువయ్యారని పేర్కొంది. సెప్టెంబరు1 డెడ్‌లైన్‌ దాటిన తర్వాత కూడా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేయవచ్చని సుప్రీం కోర్టుకు ఎన్నికల కమిషన్‌ తెలియచేసింది. గడువు దాటిన తర్వాత దాఖలు చేసిన వాటిని కూడా పరిశీలించిన తర్వాతనే ఓటర్ల జాబితా ఖరారు చేస్తామని తెలిపింది. నామినేషన్ల చివరి తేదీ వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిశీలించే క్రమం కొనసాగుతుందని, తుది జాబితాలో అన్నింటినీ పొందుపరుస్తామని ఈసీ ఆ నోట్‌లో వివరించింది. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సందర్భంగా తమ క్లెయిమ్‌లు లేదా అభ్యంత రాలను ఆధార్‌తో దాఖలు చేయవచ్చని కోర్టు ఆగస్టు 22న పేర్కొంది.

ఆధార్‌ను అర్హమైన పత్రంగా గుర్తిస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ముసాయిదా జాబితాలో పేర్లు చేర్చాలని కోరుతూ దరఖాస్తులు వెల్లువెత్తు తాయని అందరూ భావించారు. దానికి తగ్గట్లుగానే తొలగించబడిన తమ పేర్లను పునరుద్ధ రించాలని కోరే ఓటర్లు పెరిగారని అటు రాజకీయ పార్టీలు, పిటిషనర్లు కూడా పేర్కొ న్నారు.అయితే, దానికి బదులుగా, ఆగస్టు 22నుండి 30 మధ్య పేర్లు చేర్చాలని కోరే క్లెయిమ్‌లు కేవలం 22,723 మాత్రమే అందాయని ఈసీ తెలిపింది. మరోవైపు అదే సమయంలో ముసాయిదా నుంచి పేర్లను మినహాయించాలని లేదా తొలగించాలని కోరే అభ్యంతరాలు మాత్రం 1,34,738 దాఖలయ్యాయని ఈసీ తన నోట్‌లో జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోమాల్యా బాగ్చిలతోకూడిన బెంచ్‌కు తెలియచేసింది. ”చాలా కేసుల్లో, తమ పేర్లు వేరే ఓటరు జాబితాలో వున్నాయని ఓటర్లు చెబుతున్నారు. ముసాయిదా జాబితా నుంచి పేర్లు తొలగిం చాలని కోరేందుకు కారణాలుగా మరణాలు, రెండు చోట్ల పేర్లు వుండడం వంటి అంశాలను పేర్కొంటున్నారని ఈసీ తరపున సీనియర్‌ న్యాయవాది రాకేష్‌ ద్వివేది తెలిపారు.

సహకరించని రాజకీయ పార్టీలు
ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ మినహా మరే రాజకీయ పార్టీలు ఓటర్లకు సహకరించలేదని ఈసీ విమర్శించింది. అభ్యం తరాలు అందాల్సిన సమయంలో రాజకీయ పార్టీల నుండి కేవలం 128 ఫారాలు మాత్రమే అందాయని ఈసీ తెలిపింది. వీటిలో ముసా యిదా నుంచి పేర్లను తొలగించాలని కోరేవి 103 ఫారాలు కాగా, పేర్లను చేర్చాలని కోరుతున్నవి కేవలం 25 మాత్రమేనని తెలిపింది. రాజకీయ పార్టీల కన్నా ఓటర్లే చాలా చురుగ్గా వున్నాయని ఈసీ పేర్కొంది. తమ పేర్లను చేర్చాలని కోరుతున్న దరఖాస్తులు తమకు వ్యక్తిగత ఓటర్ల నుంచి 33,326 అందాయని తెలిపింది. అదే సమయంలో పేర్లను తొలగించాలని కోరే దరఖాస్తులు 2,07,565 అందాయని పేర్కొంది.

ఈసీ, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు తగవు: సుప్రీంకోర్టు
బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్‌ జాబితా ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరించేందుకు సెప్టెంబర్‌ ఒకటి డైడ్‌లైన్‌ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.

లీగల్‌ వలంటీర్లను ఏర్పాటు చేయండి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, దిద్దుబాట్లు వంటి విషయాల్లో ఓటర్లకు, రాజకీయ పార్టీలకు సాయం చేయడానికి పారా లీగల్‌ వలంటీర్లను ఏర్పాటు చేయాల్సిందిగా బీహార్‌ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఛైర్‌పర్సన్‌ను కోర్టు ఆదేశించింది. తమ వద్దకు వచ్చిన సమాచారాన్నంతా ఆ వలంటీర్లు ఎవరికి వారు కాన్ఫిడెన్షియల్‌ నివేదికలుగా సంబంధిత జిల్లా, సెషన్స్‌ న్యాయమూర్తికి అందచేయాలని పేర్కొంది. ముసాయిదా జాబితాలోని 7.24కోట్ల మంది ఓటర్లలో 99.5శాతం మంది ఇప్పటికే తమ అర్హతా పత్రాలను అందచేశారని కూడా ఈసీ కోర్టుకు తెలియచేసింది. ఆ పత్రాల పరిశీలన ప్రస్తుతం సాగుతోందని, సెప్టెంబరు 25కల్లా వాటిని పూర్తి చేయాల్సి వుందని ఈసీ నోట్‌ పేర్కొంది. 15.3 లక్షల మంది కొత్త ఓటర్లు పేర్లను చేర్చాలని దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad