తిలక్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంస
సీఎంకు బ్యాట్‌ను బహుకరించిన క్రికెటర్
నవతెలంగాణ-హైదరాబాద్
ఆసియా కప్ 2025 ఫైనల్లో వీరోచిత ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్‌పై చిరస్మరణీయ విజయాన్ని అందించిన తెలుగు తేజం తిలక్ వర్మను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. మంగళవారం సాయంత్రం జూబ్లిహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని తిలక్ వర్మ, కోచ్ సలామ్ బయాచ్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసిన సీఎం తిలక్ వర్మను సత్కరించారు. క్రికెట్ బ్యాట్, తన జెర్సీ సహా క్యాప్‌ను ముఖ్యమంత్రికి తిలక్ వర్మ బహుకరించాడు. తిలక్ వర్మ బహుకరించిన బ్యాట్‌తో రేవంత్ రెడ్డి తన కార్యాలయంలోనే షాడో బ్యాటింగ్ చేసి అలరించారు. ఆసియా కప్‌లో భారత్‌ను విజేతగా నిలపడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, దేశం గర్వపడే ఇన్నింగ్స్ ఆడావని తిలక్ వర్మను రేవంత్ రెడ్డి అభినందించారు. క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) చైర్మెన్ శివసేనా రెడ్డి, శాట్జ్ ఎండీ సోనిబాలా దేవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్రీడాభివృద్దిలో భాగం కావాలి
ఆసియా కప్ ఫైనల్లో ఎంతో ఒత్తిడిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తిలక్ వర్మ.. ఛేదనలో ఒత్తిడిని జయిస్తూ సాధించిన ఇన్నింగ్స్ విశేషాలను సీఎం రేవంత్ రెడ్డితో పంచుకున్నాడు. తెలంగాణ క్రీడాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తిలక్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘ తెలంగాణను దేశంలో నం.1 స్పోర్ట్స్ హబ్‌గా రూపుదిద్దాలి. అందుకు ఇప్పటికే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డును ఏర్పాటు చేశాం. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలను అభివృద్ది చేసేందుకు అవసరమైన సూచనల చేయటంతో పాటు ఆలోచనలను స్పోర్ట్స్ హబ్‌తో పంచుకోవాలి. క్రీడాశాఖ మంత్రి శ్రీహరి మాజీ రంజీ క్రికెటర్. శాట్జ్ చైర్మెన్ యువజన నాయకుడు, ఔత్సాహిక క్రీడాకారుడు. స్పోర్ట్స్‌లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు యంగ్ టీమ్ పట్టుదలతో పని చేస్తోంది. ఈ ప్రయాణంలో నువ్వు కూడా భాగం కావాలి’ అని తిలక్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఎన్నికల కోడ్ ఉందని..!
భారత జట్టు ఆసియా కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నగదు బహుమతితో పాటు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ప్రకటిస్తుందని అందరూ అనుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌తో సోమవారం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నగదు ప్రోత్సాహకం, ప్రభుత్వ ఉద్యోగంపై ఎటువంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత తిలక్ వర్మకు నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రభుత్వ ఉద్యోగంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.