Friday, January 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసర్దుకుపోవాల్సిందే..!

సర్దుకుపోవాల్సిందే..!

- Advertisement -

టికెట్‌ దక్కని ఆశావహులకు బుజ్జగింపు
‘నమ్మి ఉన్నందుకు నట్టేట ముంచారని’ కొందరి ఆవేదన
సమయం వచ్చినప్పుడు తామేంటో చూపిస్తాం.. మరికొందరు ప్రతిన
ఇదీ మున్సిపల్‌ ఎన్నికల చిత్రం

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మున్సిపల్‌ ఎన్నికల వేళ రాజకీయంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ ముగియటంతో టికెట్లు దక్కని వారు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. పై స్థాయి నేతలు నచ్చచెప్పటంతో కొందరు సర్దుకుపోతుండగా.. మరికొందరు రెబల్స్‌గా నామినేషన్లు వేస్తున్నారు. అధికారం అండతో ఈసారి ఎలాగైనా కౌన్సిల్‌లో అడుగుపెట్టాలని ఆశించిన కాంగ్రెస్‌ ఆశావహుల మధ్య టికెట్ల విషయంలో స్పర్థలు తలెత్తుతున్నాయి. ఏండ్ల తరబడి జెండా మోసి, పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన తమను నట్టేట ముంచారంటూ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండటంతో మున్సిపల్‌ టికెట్‌ కోసం ప్రతి వార్డులోనూ విపరీతమైన పోటీ నెలకొంది. అభ్యర్థుల ఎంపికలో ప్రజాదరణ కంటే పైరవీలకే పెద్దపీట వేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు ప్రాధాన్యత ఇచ్చి, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారిని గాలికొదిలేశారనే చర్చ ఆ పార్టీలో నెలకొంది.

సొంత వర్గీయులకే ప్రాధాన్యం
మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత వర్గానికే బీ-ఫామ్‌లు కేటాయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా జెండా మోసిన తమను పక్కనపెట్టి, నిన్నకాక మొన్న వచ్చిన వారికి పట్టం కట్టడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టికెట్‌ దక్కని కొందరు నేతలు తమ నిరసనను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. కొందరు రాజీనామా బాట పట్టగా.. మరికొందరు తమ సత్తా ఏంటో వార్డుల్లో చూపిస్తామని ప్రతిన పూనుతున్నారు.

అధికారం ఉన్నా అన్యాయమేనా?
టికెట్‌ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అధికార పార్టీ నేతలు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల వైపు చూస్తుండటం గమనార్హం. అధికార పార్టీ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలోనో లేదంటే స్వతంత్ర అభ్యర్థులతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకునేందుకు డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. నమ్ముకున్న పార్టీయే గొంతు కోస్తే ప్రత్యర్థి పార్టీ వైపు చూడటంలో తప్పేముందని ఆశావహులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కొందరు అయిష్టంగానైనా పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి వెంట నడుస్తున్నారు.

పార్టీ ఏదైనా అసంతృప్తి కామనే..!
అధికార పక్షం తీరు ఓ రకంగా ఉండగా.. విపక్షాల్లో అసంతృప్తి మరోరకంగా ఉంది. అధికారం పోయాక పార్టీలో కొనసాగడం కష్టమైన తరుణం లోనూ తమకు గుర్తింపు దక్కటం లేదని ప్రధాన ప్రతిపక్షం పార్టీ నేతలు వాపోతున్నారు. ఇప్పటికే చాలామంది కీలక నేతలు కారెక్కకుండా చేయి అందుకున్న నేపథ్యంలో ఉన్న కేడర్‌ను కాపాడు కోవడం అధిష్టానానికి పెద్ద తలపోటుగా మారింది. విపక్షంలో ఉండి కూడా కష్టపడుతున్న తమకే టికెట్‌ ఇవ్వరా? అంటూ కొందరు నేతలు ఏకంగా పార్టీ కార్యాలయాల వద్దే నిరసనలకు దిగుతున్నారు. ఇక్కడ పొసగని వారు గుట్టుచప్పుడు కాకుండా అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.

బుజ్జగింపులు.. భవిష్యత్తుపై హామీలు
అసమ్మతి సెగలు ఎన్నికల ఫలితాలను తలకిందులు చేస్తాయని భయపడుతున్న రెండు పార్టీల అధిష్టానాలు రాత్రికి రాత్రే బుజ్జగింపుల కమిటీలను రంగంలోకి దించాయి. సర్దుకుపోవాలి అంటూ అసమ్మతి నేతలకు పెద్ద నేతలు ఫోన్లు చేస్తున్నారు. మరోవిధంగా అవకాశాలు కల్పిద్దామని, నామినేటెడ్‌ పదవులు ఇస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరని, ఇప్పుడు ఇచ్చేవి కేవలం ఉత్తి హామీలే అని ఆశావహులు నిట్టూర్చుతున్నారు. సమయం వచ్చినప్పుడు తామేంటో చూపిస్తామని సంకేతాలు ఇస్తున్నారు.

లోపాయికారీ ఒప్పందాలు.. వ్యూహాలు
వార్డు స్థాయిలో పట్టున్న నాయకుడు తిరుగుబాటు చేస్తే అది మొత్తం మున్సిపాలిటీ ఫలితాన్నే మార్చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల ఖరారు తర్వాత అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షం వైపు చూడటం.. వారికి సహకరించడం అనే అంశం ఇప్పుడు ఎన్నికల ఫలితాలపై పెను ప్రభావం చూపనుంది. నామినేషన్ల ఉపసంహరణ లోపు ఎంతమందిని అధిష్టానం శాంతింపజేస్తుందో వేచి చూడాలి. నిన్నటి వరకు పార్టీ జెండా మోసినోళ్లు నేడు టికెట్‌ రాకపోయేసరికి పక్క పార్టీ కండువా కప్పుకుంటున్నారు. కొందరు మాత్రం పైకి మేమంతా ఒకటే అంటూనే లోలోపల గోతులు తవ్వే పనిలో పడ్డారు. ఈ లోపాయకారీ ఒప్పందాలు ఈసారి పురపోరులో ఎవరి కొంప ముంచుతాయన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -