– అండర్ 16 క్రికెట్ పోటీలలో సత్తా చాటిన యువ క్రీడాకారులు
– పోటీపడిన 35 జట్లు
– ఉత్సాహంగా పోటీల ముగింపు
నవతెలంగాణ – నవాబుపేట: మండల పరిధిలోని కాకర్జాల గ్రామంలో అండర్–16 క్రికెట్ టోర్నమెంట్ సోమవారం రాత్రి ఘనంగా ముగిసింది. ఈనెల 14 నుండి 16వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోటీల్లో పరిసర గ్రామాల నుంచి మొత్తం 35 జట్లు పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాయి. ఈ రోజు జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో రేకుల చౌడాపూర్ తాండ జట్టు అద్భుత ప్రదర్శనతో మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. వీరన్నపల్లి తండా జట్టు రెండో బహుమతిని అందుకుంది. ఈ టోర్నమెంట్ లో ఆటగాళ్లు చురుకైన తమ ఆటతీరుతో ప్రేక్షకులను అలరించారు.
గ్రామంలో తొలిసారి ఇలాంటి అండర్–16 టోర్నమెంట్ నిర్వహించడంతో గ్రామ పెద్దలు, యువకులు, క్రీడాభిమానులు నిర్వాహకులను అభినందించారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో ప్రతిభ వెలికితీసే అవకాశం కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. విజేతలకు కాకర్జాల గ్రామ డిప్యూటీ సర్పంచ్ కావలి యాదయ్య, వార్డు సభ్యులు కావలి అంజయ్య, గోవు యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.డి. ఉమర్ బహుమతులు ప్రధానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.



