– 6న ఇంగ్లండ్‌తో టైటిల్‌కై ఢీ
– ఆరోన్ సెంచరీ
– ఐసిసి అండర్-19 వన్డే
– సూర్యవంశీ, ఆయుష్ అర్ధసెంచరీలు
– ఆఫ్ఘన్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదించిన యువ భారత్
హరారే: ఐసిసి అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్లోకి భారతజట్టు దూసుకెళ్లింది. ఓపెనర్ ఆరోన్ జార్జి సెంచరీకి తోడు, సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్ మాత్రే అర్ధసెంచరీలతో రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని 41.1ఓవర్లలో భారతజట్టు కేవలం 3వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. దీంతో టీమిండియా రికార్డుస్థాయిలో 10వ సారి ఫైనల్‌కు చేరింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్‌లో భారతజట్టు 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఫ్ఘన్ లక్ష్యాన్ని 41.1 ఓవర్లలోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. భారత ఓపెనర్ ఆరోన్ జార్జ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 104 బంతులు ఎదుర్కొన్న జార్జ్ 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 115 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. మరోవైపు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆఫ్ఘన్ బౌలర్లను వణికించాడు. వైభవ్ కేవలం 33 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 206.06గా నమోదవ్వడం విశేషం. జార్జ్ తన అద్భుత ప్రదర్శనకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. తొలి వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఆయుష్ మాత్రే సైతం రాణించాడు. ఆరోన్ జార్జ్‌తో కలిసి రెండో వికెట్‌కు 101 బంతుల్లో 114 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించాడు. ఆయుష్ 59 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం విహాన్ మల్హోత్రా (38 నాటౌట్), వేదాంత్ త్రివేది (5నాటౌట్) మ్యాచ్‌ను ముగించారు.
వరల్డ్ కప్ చరిత్రలో భారత్ రికార్డు ఛేజింగ్
ఈ మ్యాచ్‌లో భారత్ సాధించిన విజయం అండర్-19 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత భారీ ఛేజింగ్‌గా రికార్డు పుటల్లోకెక్కింది. 311 పరుగుల లక్ష్యాన్ని భారతజట్టు కేవలం 41.1ఓవర్లలో సునాయాసంగా ఛేదించింది. గతంలో 2000, 2008, 2012, 2018, 2022 ఛాంపియన్‌గా నిలిచిన భారతజట్టు 2006, 2016, 2020, 2024లలో రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు 10వ సారి ఫైనల్‌కు చేరి 6వ టైటిల్‌పై కన్నేసింది.
ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో అమీతుమీ
సెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించిన భారత్, మరోసారి టైటిల్ పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న ఐసిసి అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్ చేరడం వారి చరిత్రలో ఇదే మొదటిసారి. ఇంగ్లాండ్‌తో జరిగే ఫైనల్‌లో కూడా ఇదే తరహా ప్రదర్శన కనబరిస్తే టీమిండియా ఆరోసారి విశ్వవిజేతగా నిలవడం ఖాయం.
స్కోర్‌బోర్డు…
ఆఫ్ఘనిస్తాన్ (అండర్-19) ఇన్నింగ్స్: ఉస్మాన్ (సి)దేవేంద్రన్ (బి)కనిష్క్ చౌహాన్ 39, ఖలీద్ అహ్మద్ (సి)అభిజ్ఞాన్ కుందు (బి)దీపేష్ దేవేంద్రన్ 31, ఫైసల్ (బి)దీపేష్ దేవేంద్రన్ 110, ఉజారుల్లా (నాటౌట్) 101, అజీజుల్లా (సి)ఖిలాన్ పటేల్ (బి)కనిష్క్ చౌహాన్ 12, అబ్దుల్ అజీజ్ (నాటౌట్) 2, అదనం 10. (50ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 310పరుగులు.
వికెట్ల పతనం: 1/53, 2/117, 3/265, 4/293
బౌలింగ్: అంబరీష్ 9-0-65-0, హేనిల్ పటేల్ 10-0-56-0, దేవేంద్రన్ 10-0-64-2, ఖిలాన్ పటేల్ 10-0-49-0, కనిష్క్ చౌహాన్ 9-0-55-2, ఆయుష్ మాత్రే 2-0-14-0
ఇండియా (అండర్-19) ఇన్నింగ్స్: ఆరోన్ జార్జి (సి)నజీఫుల్లా (బి)వాహిదుల్లా 115, సూర్యవంశీ (సి)ఉస్మాన్ (బి)ఒమర్జారు 68, ఆయుష్ మాత్రే (సి)ఉస్మాన్ (బి)ఒమర్జారు 62, విహాన్ మల్హోత్రా (నాటౌట్) 38, త్రివేది (నాటౌట్) 5, అదనం 23. (41.1 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 311 పరుగులు.
వికెట్ల పతనం: 1/90, 2/204, 3/300
బౌలింగ్: అబ్దుల్లా 10-0-70-0, వాహిదుల్లా 7.1-0-67-1, ఒమర్జారు 10-0-64-2, ఖాతిర్ 9-0-52-0, రూహుల్లా 4-0-35-0, ఉజారిల్లా 1-0-8-0



