నవతెలంగాణ – వేములవాడ : వేములవాడ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన గోవింద్ అభినవ్ (బద్ది పోచమ్మ ఆలయంలో కార్మికుడు) తాను నడుపుతున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రెండవ బైపాస్ రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. బైక్ నేరుగా మురికి కాలువలోకి దూసుకెళ్లడంతో అభినవ్ తలకు, శరీరానికి తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రాగానే స్థానికులు, మృతుడి బంధువులు ఘటనా స్థలానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మానవత్వం మరిచిన వాహనదారుడు..
ప్రమాదం జరిగిన సమయంలో, బ్రిడ్జి వైపు నుంచి వస్తున్న ఓ వ్యక్తి సుభాష్ నగర్ వైపు మలుపు తిరుగుతుండగా, ఎదురుగా వచ్చిన అభినవ్ బైక్ అదుపుతప్పి డ్రైనేజీలో పడింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఆ వ్యక్తి ఆగకుండా వెళ్లిపోయినట్లు సీసీ టీవీ ఫుటేజీ కనిపిస్తుంది. అతడు ఆగి సహాయం చేసి ఉండి ఉంటే, అభినవ్ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉండేదేమో అన్న ఆవేదన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, సమీప సీసీ టీవీ ఫుటేజీలను సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అభినవ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక పట్టణ ప్రజలు కోరుతున్నారు.
డ్రైనేజీలో పడిన యువకుడు మృతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



