నవతెలంగాణ-హైదరాబాద్ : గుంటూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అత్యంత దారుణ రీతిలో ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆన్‌లైన్‌లో టేపు, క్లిప్పులు ఆర్డర్ చేసి మరీ బలవన్మరణానికి పాల్పడిన తీరు అందరినీ కలిచివేస్తోంది.
పట్టాభిపురం పోలీసులు అందించిన వివరాల ప్రకారం, ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన శ్రావ్య (20), గుంటూరు నంబూరు సమీపంలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. నగరంలోని అశోక్ నగర్‌లో ఉన్న ఓ ప్రయివేటు మహిళల హాస్టల్‌లో నివాసం ఉంటోంది. ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో విజయవాడలో ఉన్న తన స్నేహితురాలు జాగృతికి ఫోన్ చేసి, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది.
దీంతో ఆందోళన చెందిన జాగృతి వెంటనే శ్రావ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వారు శ్రావ్యతో ఫోన్‌లో మాట్లాడగా, మనసు బాగోలేక అలా అన్నానని, ఆత్మహత్య చేసుకోనని ఆమె నమ్మబలికింది. అయినప్పటికీ, అనుమానంతో తల్లిదండ్రులు హాస్టల్‌లో ఆమె గదిలో ఉండే ఇతర విద్యార్థినులకు ఫోన్ చేసి, శ్రావ్యను కనిపెట్టుకుని ఉండాలని కోరారు. ఆ తర్వాత శ్రావ్య తన గది బయట వరండాలో కూర్చుని ఉంది.
అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఇన్‌స్టా మార్ట్ ద్వారా టేపు, క్లిప్పులను ఆర్డర్ చేసింది. కొద్దిసేపటికే డెలివరీ బాయ్ వాటిని అందించి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తోటి విద్యార్థినులు చూసేసరికి శ్రావ్య వరండాలోనే నోటికి ప్లాస్టర్, ముక్కుకు క్లిప్పు పెట్టుకుని అపస్మారక స్థితిలో పడి ఉంది.
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రావ్య ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.