Saturday, November 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమీ కాల్మొక్తా.. మా పత్తి కొనండి సారూ..

మీ కాల్మొక్తా.. మా పత్తి కొనండి సారూ..

- Advertisement -

పత్తి రైతు ఆవేదన
జడ్చర్ల సీసీఐ కేంద్రంలో రైతుల నిరసన
అధికారులు కొనుగోలు చేసేలా చూస్తామంటూ పోలీసుల హామీతో ఆందోళన విరమణ
నవతెలంగాణ- జడ్చర్ల

పత్తి రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. కొనుగోలు కేంద్రం వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. తీరా తమ వంతు వచ్చి కొనుగోలు చేస్తారని ఆశ పడే లోపే నాణ్యతా లోపం, తేమశాతం ఎక్కువగా ఉందనే సాకులతో పత్తి కొనుగోలుకు అధికారులు నిరాకరిస్తు న్నారు. చేతికందిన పంట అమ్ముకునే మార్గం తోచక అధికారుల కాళ్లావేళ్లా పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ”మీ కాల్మొక్తా.. మా పత్తి కొనండి సారూ..” అంటూ ఓ రైతు సీసీఐ కొనుగోలు కేంద్రం అధికారి కాళ్లమీద పడ్డాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో మహేష్‌ ఇండిస్టీలోని కొనుగోలు కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గద్వాల జిల్లా అలంపూర్‌ రైతులు 90 క్వింటాళ్ల పత్తిని మూడు రోజుల క్రితం సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. మూడు రోజుల పడిగాపుల తర్వాత శుక్రవారం వారి నుంచి 30 క్వింటాళ్ల పత్తిని అధికారులు కొనుగోలు చేశారు. మిగిలిన పత్తి గురించి అడిగితే నాణ్యత బాగోలేదు.. తేమశాతం ఎక్కువగా ఉందంటూ సాకులు చూపిస్తూ మిగిలిన పత్తిని కొనేందుకు నిరాకరించారు. దీంతో దిక్కు తోచని పరిస్థితుల్లో ఓ రైతు సీసీఐ అధికారుల కాళ్లు మొక్కాడు. అయినా అధికారులకు కనికరం కలుగలేదు. అధికారుల తీరుకు ఆగ్రహోద్రిక్తులయిన రైతులు కొనులుగోలు కేంద్రంలో నిరసనకు దిగారు. పండించిన పంటను అక్కడే పారబోసి వెళ్లడమొక్కటే దారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం పోలీసులకు చేరడంతో ఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేసేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -