నవతెలంగాణ – కాటారం
మంథని నియోజకవర్గంలో తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ యువజన నాయకుడు బొడ్డు శేఖర్ అన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మంత్రిగా శ్రీధర్ బాబు మంథని ప్రాంత రైతులకు, ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీనవర్గాల ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో చొరవ చూపించి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు వైఎస్ఆర్ తో ప్రారంభించి 75 శాతం పనులు పూర్తి చేయిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పక్కన పెట్టి, కూలేశ్వరం ప్రాజెక్టు కట్టిన మేధావి గొప్పతనం ప్రపంచం చూసిందని అన్నారు.
కాళేశ్వరం వల్ల ఉమ్మడి వరంగల్, కరీంనగర్ రైతులకు సంబంధించిన ఒక ఎకరా అయినా పండిందా ? అయినా బీఆర్ఎస్ నాయకుల బుద్ధి మారకుండా చిల్లర మాట్లడుతూ.. అవాస్తవ ఆరోపణలు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుందనీ, బీఆర్ఎస్ నియంత పాలన లాగా అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాలేదని బీఆర్ఎస్ నాయకులు గ్రహించాలన్నారు. రాబోయే 20 ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉంటుందని, బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారు. వారి బుద్ధి మార్చుకోవాలని తెలియజేశారు.