దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందన్నది మహనీయుల మాట. దేశానికి యువతరమే అతిపెద్ద వనరు. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మనది. జనాభాలో 28 శాతం యువతే . ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం.. నా నమ్మకం, ఆశ అంతా వారిపైనే’ అని స్వామి వివేకానందుడు అన్నట్లు యువత ప్రతిన బూనాల్సిన అవసరం ఉంది. అయితే నేటి యువతరం సామాజిక మాధ్యమాల ఊబిలో చిక్కుకుపోయి.. మత్తు పదార్థాలు, ఆన్లైన్ ఆటలతో జీవితాలను నాశనం చేసుకుంటోంది. జల్సాలకు అలవాటుపడి పెడదోవ పడుతోంది. యువత ప్రగతి పథంలో దూసుకెళ్లే దేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలబడుతుంది. వారికి సరైన దిశానిర్దేశం చేస్తే.. దేశాభివద్ధికి ముడిసరకుగా పనికొస్తారు. అలాంటి కొందరు యువకులు సామాజిక సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి అతి కొద్దిమంది యువకుల్లో వినయ్ కుమార్ వీరబల్లి ఒకరు.

‘బీటెక్ చేసేద్దాం.. కోడింగ్‌లో పట్టు సాధిద్దాం.. మంచి ప్యాకేజీతో కొలువు కొట్టేద్దాం’… ఇదీ చాలామంది కుర్రాళ్ల వరస! ఇంకొందరేమో భిన్నం.. అలా భిన్నమైన కొందరిలో ప్రత్యేకమైన వ్యక్తి వినరు కుమార్. సేవే లక్ష్యంగా విద్య, వైద్య, క్రీడా, సామాజిక సేవా రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఇరవై నాలుగేండ్ల యువకుడు. హైదరాబాద్ రామాంత్ పూర్‌కి చెందిన వినరు కుమార్ వీరబల్లి తన ఇంటర్మిడియట్ నుంచే సేవాగుణం అలవరచుకున్నాడు. తనలోని సేవా భావాన్ని కొనసాగిస్తున్నాడు. వ్యసనాల బారినపడిన యువతను సరైన వైపు మళ్లించాలని మంచి సంకల్పం తీసుకున్నాడు. చదువుకుంటూనే ”డాక్టర్ అబ్దుల్ కలాం యువ కెరటం ట్రస్ట్” స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించాడు. అతని సంకల్పానికి తల్లిదండ్రుల సహకారం తోడైంది. పోలీసు ఉద్యోగి అయిన తండ్రి వెంకటేశ్వర్లు కొడుకు ఆలోచనలను ప్రోత్సహించారు. వివిధ అంశాలతో విస్తతస్థాయిలో సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న వినరుకి తల్లి లక్ష్మీనర్సమ్మ, అక్కలు వినీల, అఖిల, బావ రాజేష్ సహకారం ఒక ఎత్తైతే… సోదరుడు మనోజ్ వెన్నుదన్నులు వెలలేనివి.
వినరు ఆలోచనలు ఎప్పుడూ భిన్నంగానే ఉండేవి. అందరూ నడిచిన దారిలో నడవడం కాదు. తానే ఒక సరికొత్త బాట వేయాలన్న తలంపుతో ఉండేవాడు. ఆపదలో ఉన్న వారికి ఏదో ఒక రూపంలో సాయాన్ని అందించాలనే లక్ష్యంతో ‘డాక్టర్ అబ్దుల్ కలాం యువ కెరటం ట్రస్ట్’ను 2017లో ప్రారంభించారు. అందరిలానే తను కూడా రక్తదానం, క్రీడాపోటీలు, ఓటు హక్కుపై అవగాహన, హరితహారంలో మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ, తెలుగు సంస్కతి సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, ముఖ్యంగా విద్యార్థులకు రక్తం నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారి వారి బ్లడ్ గ్రూప్స్ తెలియజేయడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికి నిర్వహిస్తున్నారు.
కానీ, వినరు ఆలోచనలు ఇక్కడితోనే ఆగిపోలేదు. ఇంతకు మించి రేపటి తరానికి ఉపయోగపడే ఆలోచనలు చేయాలని కలలు కన్నాడు. తన సేవలను మరికొన్ని అంశాలకు విస్తతం చేశాడు. ఎస్‌ఎఫ్‌ఐలో తాను పనిచేస్తున్నప్పుడు విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వారి హాస్టల్స్‌కు వెళ్లడం… అక్కడ వారు పడుతున్న కష్టాలను నాయకుడిగా ప్రభుత్వం దష్టికి తీసుకురావడం. వాటి పరిష్కారానికి కషి చేయడం ఒక తెలియని ఆనందాన్ని కల్గించాయి. అలా తానోక విద్యార్థిగా తన తోటి విద్యార్థులు చదువుకునేందుకు పడుతున్న తపనను గుర్తించారు. అలాంటి విద్యార్థుల టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలని సంకల్పించారు వినయ్.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల్లో ఉన్న టాలెంట్‌ను వెలికితీసి వారికి తగిన ప్రోత్సాహం అందించాలన్న సదుద్దేశ్యంతో 2018లో గ్రామీణ విద్యార్థుల కోసం ‘ఇంటర్ డిస్ట్రిక్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్’ ను ప్రారంభించారు. జిల్లా స్థాయిలో కబాడీ, ఖోఖోలను మాత్రమే మూడు రోజుల పాటు పోటీలు నిర్వహించారు. తొలి ప్రయత్నంలోనే 110 టీంలు వచ్చాయి. ఇంటర్ చదువుకుంటూనే ‘ఇంటర్ డిస్ట్రిక్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్’ ను విజయవంతం చేశారు. దీంతో తనపై తనకు బలమైన నమ్మకం ఏర్పడింది. ఆశయం మంచిదైతే విజయం తప్పక వరిస్తుందన్న విశ్వాసం కల్గింది. సామాజిక సేవంటే కేవలం రక్తదానం, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆ పూటకు సహాయం చేయడమో, మెడికల్ క్యాంపులు నిర్వహించడం ఒకటో కాదు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చేయాలని నిర్దేశించుకున్నాడు వినరు. 2020 తరువాత రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఈ సంకల్పానికి తోడైంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో ఎక్కువ మంది విద్యార్థులను ఈ ‘ఇంటర్ డిస్ట్రిక్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్’ లో భాగస్వామ్యం చేస్తున్నారు. ఎందరినో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవుతున్నారు.
విద్యార్థులు సైంటిఫిక్ టెంపర్ ఉండటం చాలా ముఖ్యమని భావించాడు వినరు. అప్పుడే వారికి విమర్శనాత్మకంగా, తార్కికంగా ఆలోచించే ఒక దక్పథం విద్యార్థులకు అలవడాలని, అప్పుడే విద్యార్థులు తమ చదువును కేవలం సమాచారాన్ని గుర్తుంచుకోవడం కాకుండా, దాన్ని విశ్లేషించి అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని, విద్యార్థులకు హేతుబద్ధంగా ఆలోచించే, వాస్తవాలను ఆధారంగా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాన్ని కేవలం సైంటిఫిక్ టెంపర్ మాత్రమే ఇస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి వినరు. సైంటిఫిక్ టెంపర్ ఉన్న విద్యార్థులు సమాజంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, సామాజిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి సహాయపడతారని తద్వారా సమాజానికి మేలు జరుగుతందని తాను విశ్వసించాడు. అప్పుడు మాత్రమే వారు ఒక మంచి భవిష్యత్తును నిర్మించగలరని భావించాడు. ఆ ఆలోచనలకు అతను పని చేసిన విద్యార్థి సంఘం(ఎస్‌ఎఫ్‌ఐ), యువజన రంగమైన (డివైఎఫ్‌ఐ) కారణం కావచ్చు. కానీ, ఆ శాస్త్రీయ ఆలోచనలను బలంగా విద్యార్థులలోకి తీసుకు వెళ్లాలంటే ఏదైనా ఒక మార్గం ఉండాలి. దానికి తను ఎంచుకున్న మార్గం ‘కలామ్స్ విజన్ సైంటిఫికల్ ప్రాజెక్ట్ ఎక్స్ పో’.
అలా 2020లో 347 ఎగ్జిబిట్స్ తో ప్రారంభమైన ‘కలామ్స్ విజన్ సైంటిఫికల్ ప్రాజెక్ట్ ఎక్స్ b’ ఐదేండ్లుగా నిర్విరామంగా కొనసాగుతోంది. గతేడాది 1600 ఎగ్జిబిట్స్ తో తిరుపతిలో
”కలామ్స్ విజన్ సైంటిఫికల్ ప్రాజెక్ట్ ఎక్స్ పో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక (విజ్ఞాన, గణితశాస్త్ర) నైపుణ్యాలను వెలికితీసి వారి ప్రతిభకు పదును పెట్టేడమే ఈ ఎక్స్ పో ముఖ్యోద్దేశం. మరి ముఖ్యంగా ప్రభుత్వం పాఠశాలలో చదువుకునే గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు మల్టీ టాలెంటెడ్ గా ఉంటారు. వారికి సరైన దారి చూపితే ఆ దిశగా వారు వడివడిగా సాగిపోతారు. ఎక్స్ పో ప్రారంభమైన నాటి నుండి ముగిసే వరకు కూడా ఆ విద్యార్థుల భోజన, వసతి సౌకర్యాలు కూడా పెద్దల సహకారంతో తానే చూసుకుంటాడు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సైన్స్ డిపార్ట్మెంట్, ఎంఎస్‌ఎంఓ, నీటి అయోగ్‌లతో కలిసి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందిస్తున్నారు. అవి విద్యార్థులకు చాలా ఉపయోగపడుతున్నాయి. దీంతో ఏటికేడు ఆదారణ పెరుగుతూ వచ్చింది. మొదటి నుంచి ఈ ఎక్స్‌పోకు వచ్చిన ఎగ్జిబిట్స్‌ను అర్బన్, రూరల్ అని డివైడ్ చేసి రెండింటిలో బహుమతులు ఇవ్వడం ఈ ఎక్స్ పో ప్రత్యేకత. ఇది గత ఐదేళ్లుగా నిరంతరం కొనసాగుతూనే ఉంది. 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న ‘నూతన విద్యా విధానం’ ను వ్యతిరేకిస్తూనే ‘ఆడుతూ పాడుతూ చదువు’ అనే ప్రయోగం చేసి విజయం సాధించారు. వీటితోపాటు సంక్రాంతి, దసరా పండుగల సందర్భంగా తెలుగు సంస్కతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నత్య ప్రదర్శనలు, పాటల పోటీలను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నాడు. ఒకప్పుడు తాను ఒక వ్యక్తి మాత్రమే. కానీ నేడు అతను ఒక వ్యవస్థగా మారాడు. ఇప్పుడు అతడు యూత్ ఐకాన్. ‘సామాజిక సేవకు కొత్త అర్థం చెప్పిన వినరును బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ‘యూత్ ఐకాన్’గా గుర్తించి సత్కరించింది. జూన్ విజ్ఞాన వేదిక సహాకారంతో ఇంద్రజాల ప్రదర్శన నిర్వహిస్తూ మాయా మర్మం, కనికట్టుల గుట్టు విప్పి వాస్తవాలను విద్యార్థులకు తెలియజేస్తూ వారిని మూఢనమ్మకాల భారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నారు.
‘డాక్టర్ అబ్దుల్ కలాం యువ కెరటం ట్రస్ట్’ ద్వారా ఇప్పటి వరకు 120కి పైగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం ద్వారా సుమారు 4000 మందికి పైగా రక్తం అందించి వారి ప్రాణాలు కాపాడారు. ఇప్పటి వరకు వినరు ఒక్కడే దాదాపు 15 సార్లు రక్తదానం చేయడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎస్.కే. రెహమాన్ గారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో, ఎక్కడ ఉన్నాయి. వాటిని సాధించడానికి అవసరమైన గైడెన్స్ సరైన సమయంలో అందటం చాలా అవసరమని భావించిన వినరు ఆ సమాచారంతో ” లోకల్ జాబ్స్” అనే మొబైల్ యాప్ రూపొందించి యువతకు మరింత చేరువ అయ్యాడు.
గత ఐదేళ్లుగా విద్యార్థుల్లో వుండే నైపుణ్యలను, నైతిక విలువలను వెలికితీసేందుకు క్రీడా, సాంస్కతిక కార్యక్రమాలు, వైజ్ఞానిక సదస్సు, వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు, భారతీయ సంప్రదాయాలను ప్రోత్సహించే కార్యక్రమాలు వంటివి తన తరఫున దాదాపుగా ఎన్నో కార్యక్రమాలు ఉచితంగా విద్యార్థుల కోసం నిర్వహించారు. విద్యార్థుల్లో ఉండే ఎన్నో నైపుణ్యాలను వెలికితీసేందుకు కషిచేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను జాతీయ స్థాయి ఉత్తమ సేవా పురస్కారాలను వినరు కుమార్ అందుకున్నారు.
- అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417