– రాయపోల్ ఎస్ఐ కుంచం మానస..
నవతెలంగాణ – రాయపోల్
రాయపోల్ మండలంలోని యువత సీఎం కప్‌లో పేర్కొన్న వివిధ క్రీడల్లో చురుకుగా పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస పిలుపునిచ్చారు. ఆదివారం రాయపోల్ మండల కేంద్రంలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువత ఖాళీ సమయాన్ని దురలవాట్లకు బానిసలుగా మార్చుకోకుండా క్రీడల వైపు మళ్లించాలన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయని, రోజువారీ జీవితంలో క్రీడలకు సమయం కేటాయించడం ద్వారా శరీరకద్రత్వంతో పాటు ఆరోగ్యం ఉంటారన్నారు.
సీఎం కప్ వంటి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు గ్రామీణ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి మంచి అవకాశమని ఆమె పేర్కొన్నారు. ప్రతి గ్రామం నుంచి క్రీడాకారులు ముందుకు వచ్చి పోటీల్లో పాల్గొని రాయపోల్ మండలానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని కోరారు.క్రీడల ద్వారా క్రమశిక్షణ, సహనం, ఐక్యత, నాయకత్వ లక్షణాలు అలవడతాయని, ఇవే యువతను భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దుతాయని ఎస్ఐ కుంచం మానస తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాసంపల్లి రాజు, ఉప సర్పంచ్ హనుమంతు రాజు, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, జాతీయ క్రీడాకారుడు ఉషనగళ్ల స్వామి, పోలీస్ సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు.



