Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత రాజకీయాల్లో రావాలి 

యువత రాజకీయాల్లో రావాలి 

- Advertisement -

కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చాలా గొప్పవి
పేదలకోసం పోరాడే ఎర్రజెండాలోనే పనిచేయాలి
సర్పంచిగా పోటీ చేయడం గొప్ప వరంగా భావిస్తున్నా
గెలిపిస్తే… గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
నిరుద్యోగ భూతాన్ని తరిమికొట్టుతా
నవతెలంగాణతో సీపీఐ(ఎం) బలపరిచిన యువ సర్పంచి అభ్యర్థి ఆలేటి బిందు
నవతెలంగాణ – మిర్యాలగూడ 

ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని అందులోను ప్రధానంగా గొప్ప సిద్ధాంతాలు కలిగిన కమ్యూనిస్టు లాంటి పార్టీల చేరి పని చేయాలని అప్పుడే అన్ని వర్గాలకు సమాన న్యాయం జరుగుతుందని దానిని నమ్మి తాను సీపీఐ(ఎం)లో చేరి సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని, ప్రజలు ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామంలో సీపీఐ(ఎం) బలపరిచిన యువ సర్పంచి అభ్యర్థి ఆలేటి బిందు అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఆ యువ సర్పంచ్ అభ్యర్థితో నవ తెలంగాణ మాట ముచ్చటా….

నవతెలంగాణ : మీ కుటుంబ నేపథ్యం నీ విద్యాభ్యాసం ఎలా జరిగింది…?
అభ్యర్థి : మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామం. మా నానమ్మ గ్రామ పంచాయతీలో స్వీపర్గా పనిచేసేది. ఆమె చనిపోయాక ఆ ఉద్యోగం మా నాన్న చేస్తున్నాడు. నా అమ్మ నాన్నతో పాటు ముగ్గురు అక్క చెల్లెలు… అందులో నేను పెద్దదానిని… ఇటీవల కాలంలోనే బీటెక్లో సివిల్ ఇంజనీర్ పూర్తి చేశాను. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. ఒకటి నుంచి 10వ తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్నాను, డిప్లమో పూర్తి చేశాక ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీర్గా చదువుకున్నాను.  రెండవ చెల్లెలు అగ్రికల్చర్ బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నది. మూడో చెల్లెలు మెడిసిన్ సెకండియర్ చదువుతున్నది. మా అమ్మ నాన్న అంతగా చదువుకోకపోయినా మమ్ములను మాత్రం బాగా చదివిస్తున్నారు. 

నవతెలంగాణ : రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది ?
అభ్యర్థి: ప్రస్తుతం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడిపోతుంది. నైతిక విలువలు కరువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో యువత భాగస్వామ్యం కావాలని నేను బలంగా నమ్ముతున్నా. అందులో భాగంగానే మా గ్రామంలో ఎస్సీ మహిళ రిజర్వేషన్ కావడంతో సర్పంచ్గా పోటీ చేసి చేయాలని నిర్ణయించుకున్నా.. గ్రామంలో ఎన్నో ఏళ్లుగా అనేక మౌలిక సదుపాయాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సమస్యలపై పూర్తిగా అవగాహన ఉండటం వల్ల వాటిని పరిష్కారం చేయాలంటే సర్పంచ్ పదవితోనే సాధ్యమవుతుందని భావించి అందుకే పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా గ్రామంలో ఎంతోమంది యువకులు చదువుకొని నిరుద్యోగులుగా ఉంటున్నారు. వారందరికీ ఉద్యోగ అవకాశాలు అందే విధంగా తయారు చేయడమే  లక్ష్యంగా పని చేస్తాను.

నవతెలంగాణ : కమ్యూనిస్టు పార్టీ నుండి ఎందుకు పోటీ చేస్తున్నారు 
అభ్యర్థి : కారల్ మాక్స్, లెనిన్, చేగువేరా, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి గొప్ప నాయకులన్నా కమ్యూనిస్టు పార్టీ సిద్దాంతాలు నాకు బాగా నచ్చాయి. చదువుకునే సందర్భంలో అనేక కమ్యూనిస్టు పుస్తకాలు చదివాను. పేదల కోసం నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం ముందుండే నడిపేది  కేవలం కమ్యూనిస్టు పార్టీ మాత్రమే.  అట్టడుగు వర్గాల ముఖ్యంగా పేదల సంక్షేమం కోసం పనిచేసే కమ్యూనిస్టు పార్టీ వల్లనే సమా సమాజ స్థాపన జరుగుతుందని భావించాను. గ్రామంలో కూడా గతంలో కమ్యూనిస్టు పార్టీ సర్పంచులున్నప్పుడే అభివృద్ధి జరిగింది. మౌలిక సదుపాయాలు కల్పన అప్పుడే జరిగింది. అందుకే కమ్యూనిస్టు పార్టీ తరపున పోటీ చేస్తున్నాను. కమ్యూనిస్టు పార్టీ వల్లనే గ్రామంలో సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలకు వివరిస్తున్నాను.

నవతెలంగాణ :  సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు. 
అభ్యర్థి : తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాను. ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామసభ ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారాన్ని కృషి చేస్తాను. ముఖ్యంగా ప్రాథమికంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం దృష్టి పెడతాను. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం మెరుగు పరుస్తాను. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. ముఖ్యంగా గ్రామంలో ఉన్న గ్రంధాలయాన్ని 24/7 నిరుద్యోగులకు ఉద్యోగాలు పొందే విధంగా వారికి అవసరమైన మెటీరియల్ ని అందిస్తాను.

తాను విద్యావంతురాలు కాబట్టి ఉద్యోగాలు ఎలా పొందాలో యువతకు ముందు నుంచి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మార్గాలు చూపిస్తాను. గ్రామంలో కుల మతాలకతీతంగా పని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తాను. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాలు అభివృద్ధి నిధులు పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటాను. ప్రాథమిక క్రమంలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాను.

నవతెలంగాణ : యువతుకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు…
అభ్యర్థి : ప్రస్తుతం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉన్నది. సమాజ మార్పు అన్ని వర్గాల అభివృద్ధి కోసం యువత ఇప్పుడు నుంచే రాజకీయాల్లోకి రావాలి. స్వార్థం కోసం పదవులకు కోసం పాటుపడే పార్టీలకంటే పేద ప్రజల కోసం నిరంతరం ఉద్యమాలు చేసి సిపిఐఎం పార్టీలో చేరడం చాలా గొప్ప విషయం. ఆ పార్టీ ద్వారానే సమా సమాజ స్థాపన జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాను. యువత మీరు కూడా సిపిఐఎం పార్టీ లాంటి పార్టీలో చేరి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసి పేద ప్రజలకు అండగా నిలవాలి. జరుగుతున్న, రాబోయే ఎన్నికలలో యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను చైతన్యపరచాలి. ముఖ్యంగా యువత ఎర్రజెండా లాంటి పార్టీలో చేరి ప్రజలకోసం ఉద్యమాలు చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -