Tuesday, November 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅవినీతిరహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలి

అవినీతిరహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలి

- Advertisement -

– రాష్ట్రీయ లోక్‌ దళ్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ కుమార్‌
నవతెలంగాణ-జగిత్యాల

అవినీతి రహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ లోక్‌ దళ్‌ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రియ లోక్‌ దళ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక చైతన్య రథయాత్రలో భాగంగా సోమవారం జగిత్యాలలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ రెండు కూడా తెలంగాణకు తీవ్ర ద్రోహం చేశాయని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావించిన లక్షలాదిమంది యువత తెలంగాణ ఉద్యమంలో పనిచేశారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యువత ఆశలు అడియాసలు అయ్యాయని విమర్శించారు. భౌగోళిక తెలంగాణ ఏర్పడిందే తప్ప సామాజిక తెలంగాణ ఏర్పడలేదన్నారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి కీలక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇప్పటికీ కనీసం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని, 28 లక్షల మంది యువతకు వత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా కషి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఐక్యతతోనే బహుజనులకు రాజకీయ అధికారం వస్తుందని ఆ దిశగా రాష్ట్రీయ లోక్‌ దళ్‌ పార్టీ కషి చేస్తుందన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని దిలీప్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించడంతోపాటు వారికి ఉపాధి కల్పించే విషయంలో తమ పార్టీ తెలంగాణలోని అన్ని జిల్లాలలో జాబ్‌ మేలాలను నిర్వహించి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఆధ్వర్యంలో యువతకు ఎక్కువ సీట్లు కేటాయించి అన్ని విధాల ప్రోత్సహిస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, చివరికి రిటైర్డ్‌ ఉద్యోగులకు చెందవలసిన లాభాలను కూడా ప్రభుత్వ దారి మళ్లించడం అన్యాయమన్నారు. బీసీలకు 42 శాతం చట్టబద్ధ రిజర్వేషన్‌ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో ప్రజలు అధికార కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు విస్మరించడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను చైతన్యం చేసి వారిని రాజకీయ అధికారానికి దగ్గర చేయడం కోసం తమ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సామాజిక చైతన్య యాత్రలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌ ఎల్‌ డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిషబ్‌ జైన్‌,హసన్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -