– ఆర్మూర్ ఆర్టీవో వివేకానంద రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
యువత రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఆర్మూర్ ఆర్టీవో వివేకానంద రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఉప్లూర్ యువత సహకారంతో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల సహాయార్థం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ రక్తదాన శిబిరాన్ని ఆర్మూర్ ఆర్టీవో వివేకానంద రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ఎంతో గొప్పదని, ఒకరు దానం చేసిన రక్తంతో ఒక్కోసారి ఇద్దరి ప్రాణాలు కూడా కాపాడవచ్చు అన్నారు.రోడ్డు భద్రత నియమాలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ఉప్లూర్ యువతను ఆయన అభినందించారు.
యువత వాహనాలను నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనంపై వెళ్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ మాట్లాడొద్దని సూచించారు. సెల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపడం మూలంగా అనేక ప్రమాదాలు జరిగి ఎందరో తమ పాణాలను కోల్పోతున్నారని, అంతేకాకుండా ఎదుటివారిని ప్రమాదాలకు గురి చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు భద్రత ప్రమాణాలు పాటిస్తూ వాహనాలను నడపాలని వివరించారు.ఈ రక్తదాన శిబిరంలో 20 మంది యువకులు తమ రక్తాన్ని దానం చేశారు.
అంతకు ముందు గ్రామ యువకులు స్వామి వివేకానందుడి ఆలోచన విధానాలతో ఉప్లూర్ గ్రామాన్ని ముందుకు తీసుకువెళతామని ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో ఆర్మూర్ ట్రాఫిక్ సిఐ స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీమల్ల దేవన్న, ఉప్లూర్ యువత హరీష్ గౌడ్, అశోక్, మొకిమ్, నిఖిల్, అజయ్, వసంత్, అరుణ్ గౌడ్, విష్ణు, భూమేష్ గౌడ్, మహేష్, ఫరూక్, శివ, వసంత్, సాయి, నిఖిలేష్, యువజన సంఘ నాయుకులు, రాజకీయ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



