– పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
– సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్
నవతెలంగాణ – రాయపోల్
ప్రజలతో పోలీసుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘మన పోలీస్ – మన ఊరు’ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సన్మార్గంలో నడవాలని పర్యావరణం పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ అన్నారు. బుధవారం రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి గ్రామంలో సీసీ కెమెరాలు, క్రీడోత్సవాలు ప్రారంభోత్సవం, మొక్కలు నాటారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ గ్రామానికి విచ్చేయగా గ్రామస్తులు బ్యాండు మేళా, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గ్రామంలో 16 సీసీ కెమెరాలను ప్రారంభించారు. అలాగే పెద్దమ్మ దేవాలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలలో క్రీడా పోటీలను ప్రారంభించి, విద్యార్థులకు నోట్‌బుక్స్, పరీక్ష ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కమిషనర్ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న చిన్నపాటి ఘటనలను ముందుగానే గుర్తించి నివారించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
యువతలో క్రీడా చైతన్యాన్ని పెంపొందించేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణ కూడా ముఖ్యమని తెలిపారు. పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తుందని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల పాత్ర కీలకమని, అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, ఆయేషా, గజ్వేల్ ఏసీపీ నర్సింలు, సీఐ లతీఫ్, స్థానిక ఎస్‌ఐ కుంచం మానస, గ్రామ సర్పంచ్ సత్తు అశోక్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.



